వైయస్ఆర్ కు తలపాగా – రేణుకా చౌదరి తలపై క్యాప్ లో ఫ్యాన్… అధికారమనే శక్తే నడిపిస్తుంది అన్నాను… జర్నలిస్ట్ జ్ఞాపకాలు –
—————————————-
‘‘ఎన్టీఆర్ వద్ద ఉన్నప్పుడు నేను ఎన్నో చూశాను . వైయస్ రాజశేఖర్ రెడ్డికి చెప్పాను. ఇది సరైన సమయం కాదు, ఇప్పుడే పాదయాత్ర వద్దు . ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది అని చెప్పాను. కానీ ఆయన వినలేదు .,,’’ – ఇది పర్వత నేని ఉపేంద్ర చెప్పిన మాట . మెదక్ జిల్లా జోగిపేట ప్రాంతంలో వైయస్ఆర్ పాదయాత్ర సాగుతున్నప్పుడు పిచ్చాపాటిగా మాట్లాడుతుంటే ఉపేంద్ర ఈ మాట చెప్పారు .
Ads
ఉపేంద్ర ఆ మాట చెబుతుంటే ఇతనేనా ఒకప్పుడు టీడీపీలో నంబర్ టూ అనిపించింది . ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో చక్రం తిప్పుతుంటే , రాజ్యసభ సభ్యునిగా ఉపేంద్ర ఢిల్లీలో చక్రం తిప్పేవారు . ఒక రకంగా ఆయనది దాదాపు నంబర్ 2 పవర్ సెంటర్ . తరువాత కాంగ్రెస్ లో చేరారు . మెదక్ జిల్లాల్లో పాదయాత్ర కవర్ చేయడానికి వెళ్ళాను .
పాదయాత్ర జరుగుతున్న కాలంలో రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో ఎండలు . ఆ సమయంలోనే తొలిసారిగా తలపై క్యాప్ లో ఫ్యాన్ ఉండడం చూశాం . రేణుకా చౌదరి తలపై క్యాప్, దానిలో ఫ్యాన్ ధరించి ప్రత్యేకంగా కనిపించడం మీడియాలో ఫొటోతో మంచి ప్రచారం లభించింది . ఆ సమయంలో కాంగ్రెస్ శాసనసభా పక్షం కార్యాలయంలో రిపోర్టర్లు అందరూ ఉన్నప్పుడు కెవిపి రామచంద్రరావు ఓ సలహా అడిగారు . ఎండలు బాగా ఉన్నాయి , ఫ్యాన్ ఉన్న క్యాప్ ధరిస్తే ఎలా ఉంటుంది అని …
ఫ్యాన్ ఉన్న క్యాప్ ధరిస్తే బాగుంటుంది అని ఒకరిద్దరి సలహా . ఆ సమయంలో రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో ఎండలు , ఇంట్లో నుంచి బయట కాలు పెట్టలేని పరిస్థితి . అందరూ ఈ ఎండలు చూసి వైయస్ఆర్ ఎలా నడుస్తున్నాడో అనుకుంటున్నారు … క్యాప్ , దానికో ఫ్యాన్ ఒక్క రోజు బోలెడు ప్రచారం వస్తుంది కానీ ఇప్పటి వరకు వచ్చిన సానుభూతి పోతుంది . పడే ఇబ్బంది ఏదో పడుతున్నారు అలానే కొనసాగించాలి అన్నాను . నేను ఎవరో కెవిపికి తెలిసే అవకాశం లేదు . నేను టీడీపీ బీట్ రిపోర్టర్ ను కాబట్టి.. పేరు తెలియక పోయినా ఓ రిపోర్టర్ అని తెలిసే అవకాశం ఉంది .
***********
తరువాత ఫ్యాన్ ఉన్న క్యాప్ కాదు కానీ ఎండ దెబ్బ తాకకుండా పెద్ద తలపాగా చుట్టుకొని , దాన్ని నీటితో తడుపుతూ పోయారు . వైయస్ఆర్ కు సన్నిహితంగా ఉండే రవిచంద్ పరిచయం ఉండడం వల్ల అతనితో చెప్పి ఈ పాదయాత్రలో జోగిపేటలో వైయస్ఆర్ ఇంటర్వ్యూ చేశాను . సరైన సమయం కాదు అనే మాటకు బదులిస్తూ కరువుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు పాదయాత్ర ద్వారా వారిని పలకరించాలి కానీ మనకు కుదిరిన సమయంలో పలకరిద్దాం అంటే ఎలా అన్నారు .
****
టీడీపీలో ఢిల్లీలో అధికార కేంద్రంగా చాలా కాలం చక్రం తిప్పిన ఉపేంద్ర మారిన పరిస్థితిని జీర్ణం చేసుకోలేక పోయారు . ఆయన ఒక్కరే కాదు, రాజకీయాల్లో చాలామంది ఒకప్పుడు చక్రం తిప్పి ఉంటారు . అది శాశ్వతం అనుకుంటారు … ఉపేంద్ర కాంగ్రెస్ లో చేరినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు . ప్రాధాన్యత ఇవ్వలేదు . కాంగ్రెస్ లో తన ప్రభావం చూపాలి అని ప్రయత్నించినా సాధ్యం కాలేదు . 99లో స్వల్ప తేడాతో టీడీపీ గెలిచింది . విద్యుత్ ఉద్యమం , తెలంగాణ ఉద్యమం వల్ల టీడీపీ ఓటమి ఖాయం అని తేలిపోయింది . ఎర్రటి ఎండలో ధైర్యంగా పాదయాత్ర చేసిన వైయస్ఆర్ కు కాంగ్రెస్ లో ఎదురు లేకుండా పోయింది ….. – బుద్దా మురళి
Share this Article