Bharadwaja Rangavajhala……… మన సినిమాలు మనమే తీసుకుందాం, మన సమీక్షలు మనమే రాసుకుందాం … సమీక్ష … ఏ భాషలో అయినా … ఏ బంధంలో అయినా …. ఇంత ఇబ్బందికరమైన పదం మరోటి ఉండదేమో? వ్యాపారమైనా, ఉద్యోగమైనా, సంసారమైనా, రచన అయినా సినిమా అయినా సమీక్ష అనగానే …. బోల్డు గందరగోళం ఏర్పడిపోతుంది.
సమీక్ష అంటే ఏమిటి? ఒకరు చేసిన పనిని మరొకరు చూసి అందులోని మన్నికను అంచనా వేసి చెప్పడం. చాలా మంది విమర్శ అనే పదాన్ని కూడా ఇదే అర్ధంలో వాడేస్తూంటారు. ఈ రెంటికీ ఓ సూదిమొన మోపినంత వ్యత్యాసం ఉందనుకోండి . ఆ మాత్రం తేడా లేకపోతే రెండు పదాలెందుకు పుడతాయి.
సాధారణంగా తను చేసిన పని మాత్రమే గొప్పది అనుకోవడం మానవనైజం. తను కాబట్టి ఇంత చేశానని … అదే మరొకరైతేనా అనుకోవడం కామను. అందుకే ఏ మానవుడైనా కూడా తను చేసిన పనిని ఎవరైనా సమీక్షిస్తే తట్టుకోవడం కష్టం. మన వేదాలూ పురాణాలూ ఉపనిషత్తులూ అన్నీ కూడా ఈ తట్టుకోవడం ఎలా అనే అంశాన్ని చెప్పడానికే ఎక్కువ పేజీలు కేటాయించాయి.
Ads
ఎవరు చేసిన పని వారికి గొప్ప. ప్రతి ఒక్కరూ తను చేసిన పనిని సమర్ధించుకోడానికి పనిచేసేప్పుడే కొన్ని పాయింట్లు మనసులో రాసేసుకుంటారు. అంటే ఏమిటీ..? మొదటే తను చేస్తున్న పని మీద ఒక అంచనా అతనికి ఉంటుందనే కదా. అది కూడా కామనే.
కొందరు బాగా పనిచేసినా ఎందుకైనా మంచిదని కూడా కొన్ని పాయింట్లు రాసి పెట్టుకుంటారు. ఇంత సేపూ మనం మాట్లాడుకున్న విషయాలను బట్టి ఈ పాటికి మీకో అవగాహన వచ్చేసుంటుంది. ఏ వ్యక్తీ కూడా లేదూ వ్యవస్థా కూడా సమీక్షను అంత త్వరగా అంగీకరించరు అని తేలిపోయింది కదా … మరి సమీక్ష లేదూ దానికి దగ్గరలో కనిపించే విమర్శ అనే పదాల్ని తీసి తుంగలో తొక్కొచ్చు కదా …
కానీ అలా చేయలేదు. చేయరు కూడా. సమీక్ష ఉండాలి. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సమీక్ష అవసరం. ఎందుకు అవసరమంటే … అవతలోడు చెప్పింది మనం ఒప్పుకోంగానీ … మనం చేసిన దాంట్లో తప్పులేమిటో కనీసం మనకు తెలియాలి కదా… అలా తెలియచేసేదే సమీక్ష. అది మన్ని బాధపెట్టినా … మనం దాన్ని నోరారా తిట్టినా … బతికించే ఉంచాలి.
సమీక్ష వచ్చిన తర్వాత దాన్ని చదివి మనం మనకు అవసరమైన పాయింట్సు నోట్ చేసేసుకుని ఆ తర్వాత దాన్ని తూర్పారపట్టొచ్చు. పట్టాలి కూడాను. లేకపోలే సమీక్షకులను సమీక్షించేవారు లేక వారు ఒన్ సైడ్ గా పోరూ … కనుక సమీక్ష అనేది ఖచ్చితంగా ఉండాలి. కానీ అది మనకు ఇబ్బందిగా ఉండకూడదు.
అందుకే మనం అవతలవాడు మనసులో ఇంకేదో పెట్టుకుని తనను సమీక్షిస్తున్నాడంటాం. విమర్శ అనేది నిర్మాణాత్మకంగా ఉండాలని .. అది పనిని ముందుకు తీసుకుపోయేదిగా ఉండాలి తప్ప పని కుంటుపడేదిగా ఉండకూడదనే అభిప్రాయం కూడా తరచు వ్యక్తపరుస్తూంటాం. ఇది గడుసుదనంతో చెప్పేమాటో మరోటో కాదు . చాలా సహజమైన వ్యక్తీకరణే.
మనుషులు తాము చేసిన పనులను ఇంకోడు సమీక్షిస్తే ఎలా ఒప్పుకోరో … అలాగే తాము చేసే పనిని ఇంకొకరు చేసినా ఒప్పుకోలేరు. వంకలు వెతికి శంకలు చెప్పి ఎలా చెడగొట్టాలో చూసేవాళ్లే ఎక్కువ. ఇది కూడా మానవ ప్రవృత్తి. ప్రకృతి.
కనుక మనం అవతలివాడి సమీక్ష మీదో విమర్శ మీదో విరుచుకుపడడం తప్పేం కాదు. ఈ మధ్య సినిమా సమీక్షల మీద గొడవ జరుగుతోంది కదా … కోట్ల రూపాయలు పెట్టి తీసిన సినిమాను వీడెవడో ఉచితంగా చూసేసి చేతికొచ్చింది రాసేసి నాశనం చేసేస్తున్నాడని కదా సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి విమర్శకుల మీద ఉన్న అభిప్రాయం.
అందుకే ఈ మధ్య మన హీరోలు సమీక్షకుల మీద సమీక్షలు చేస్తున్నారు. ఆ మధ్య సినిమా రెవ్యూల మీద జూనియర్ ఎన్టీఆర్ చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు కదా … ప్రేక్షకుల్ని డాక్టర్లతోనూ సమీక్షకులను పరామర్శకొచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడి పేషెంటు బంధువులను భయపెట్టే దుర్మార్గులుగానూ ఆయన అద్భుతమైన పోలిక కూడా తెచ్చారు.
అసలు సినిమా రివ్యూల మీద ఇండస్ట్రీ చాలా సందర్భాల్లో రియాక్ట్ అయ్యింది. ముఖ్యంగా వెబ్ సైట్స్ వచ్చాక ఈ ఘర్షణ ఎక్కువయ్యింది. సినిమా థియేటర్ లోంచీ బయటకు రాకముందే వెంటతెచ్చుకున్న ల్యాబ్ ట్యాపులో రివ్యూ రాసి సినిమాను వీధిన పడేస్తున్నారు ఇంటర్నెట్ రిపోర్టర్లు అనే అభిప్రాయం ఇండస్ట్రీలో చాలా బలంగా ఉంది. ఇది పూర్తి వాస్తవం.
సినిమా తీసేప్పుడు అనేక ఇబ్బందులు వస్తాయి. బోల్డు తలనొప్పులు ఉంటాయి. అనుకున్న కథ అనుకున్నట్టు తెరకెక్కడానికి చాలా కష్టపడాల్సొస్తుంది. ఇవన్నీ సమీక్షకుడికి అవసరం లేదు. పైగా సినిమా తీయడం మీ కర్తవ్యం. విమర్శించడం నా కర్తవ్యం అంటారు వీళ్లు.
కరక్టే… మంచి సమీక్షకులు మంచి సినిమాలు తీసిన దాఖలాలు ఉన్నాయా? అంటే లేవనే చెప్పాలి. అయితే విమర్శని సహించని నిర్మాతలు మాత్రం అదిరిపోయే సినిమాలు తీసిన దాఖలాలు చాలానే ఉన్నాయి. విమర్శకులు బాలేదన్నా సూపరు హిట్టైపోయిన సినిమాలు కూడా అనేకం ఉన్నాయి. అలాగే విమర్శకులు బావున్నాయి అన్న సినిమాలు ఫ్లాపైన సందర్భాలూ అనేకం ఉన్నాయి.
అసలు సమీక్ష మీదే సమీక్ష రాయించిన నిర్మాతలూ ఉన్నారు. అప్పుచేసి పప్పుకూడు అనే విజయావారి సినిమాను ముళ్లపూడి వెంకటరమణ అనే రచయిత ఆంధ్రపత్రికలో సమీక్షిస్తూ సినిమాలో చాలా లోపాలున్నాయన్నాడు. ఆ సమీక్ష చిత్ర నిర్మాతల్లో ఒకరైన చక్రపాణిగారికి నచ్చలేదు. ఆయన వెంటనే పత్రిక వాళ్లకి ఫోను చేసి ఆ సమీక్ష బాలేదన్నారు. పత్రిక వారు వెంటనే అయితే మరోటి మీరు రాయించి పంపించండి వేసేద్దాం అన్నారు.
చక్రపాణిగారు సై అన్నారు. అనడమేమిటి వెంటనే కొడవటి కుటుంబరావుగారితో సినిమా అద్భుతంగా ఉందని సమీక్ష’ రాయించి పత్రికకు పంపారు. సరిగ్గా వారం క్రితం బాగోలేదని సమీక్ష వెలువరించిన పత్రికే సినిమా అద్భుతం అనే సమీక్ష’ను కూడా ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ప్రచురించింది. మెయిన్ స్ట్రీమ్ పత్రికల్లో వచ్చే సమీక్షలు సాదారణంగా అనుకూల ధోరణితోనే రావడం జరిగేది.
ప్రకటనలు రాకపోతే ఒక్కోసారి నిర్మాతకు తగలాలనే అభిప్రాయంతో ఎక్కడైనా నెగెటివ్ రెవ్యూలు రాయించేవారు తప్ప ఏ పత్రికాధిపతీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడానికి ఇష్టపడేవారు కాదు. ఈ ధోరణి ఎంత బలంగా ఉండేదో చెప్పడానికి పెద్దగా కష్టపడనవసరం లేదు.
వెలుగునీడలు సినిమాలో పేకేటి శివరావు జర్నలిస్టు. నాగేశ్వర్రావు రూమ్మేటు. ఓ రోజు నాగేశ్వర్రావు సిటీబస్ స్టాపులో ఉంటే పేకేటి సైకిలు మీద పోతూ … ఒరే … ఒకే వరలో రెండు కత్తులు అనే మహోజ్వల జానపద చిత్రం ప్రివ్యూ ఉంది, చూసి బాగుందని రివ్యూ రాయాలి, వస్తాను అని వెళ్లిపోతాడు. ఆత్రేయగారు చాలా మామూలుగా రాసినా ఆ ధోరణి అప్పటికి బలంగా ఉందనే కదా …
ఆ రోజుల్లో కూడా హిందూ నేషన్ , కాగడా లాంటి పత్రికలు కాస్త నెగెటివ్ టచ్ సమీక్షలు బలంగా రాసినా … వాటి ప్రభావం స్వల్పమే. అయితే నిర్మాతలు వారినీ బ్యాక్ డోర్ ఖర్చు కింద పోషించేవారు. కారణం కొన్ని అలాంటి మాటలు కూడా వస్తే … దర్శకుడ్ని ఏడిపించడానికి కంట్రోలు చేయడానికి ఉపయోగకరంగా ఉంటుందనేది నిర్మాతల అంతర్గత అభిప్రాయం కావచ్చు.
ఇదంతా ప్రింటు మీడియా రోజుల నాటి మాట. ఇప్పుడు నెట్ రోజులు వచ్చేశాయి. బెజవాడలో కూర్చుని సినిమా చూసి ఒపినియన్ను పెడితే ప్రపంచంలోని నలుమూలలా చూసేసి ఓ అభిప్రాయానికి రావడం జరిగిపోతోంది. సరిగ్గా ఈ స్పీడే హీరోల్ని భయపెడుతోంది. నిజానికి మీడియాను మచ్చిక చేసుకోడానికి ప్రమోషన్ లో భాగంగా ప్రకటనలు ఇస్తారు. ఇస్తున్నారు కూడా.
ఇవి కాక ఈ సినిమా వ్యవహారాలు చూసే మీడియా ప్రతినిధుల కోసం విడిగా కవర్లూ ముట్టజెబుతారు. ఇన్ని చేసిన తర్వాత నెగెటివ్ రివ్యూలు వస్తున్నాయంటే హీరోలకు కోపం రావడం సహజమే కదండీ … అదే జరుగుతోందిప్పుడు. ఒకప్పుడు సినిమా సమీక్షల మీద నిర్మాతలు సీరియస్సు అయ్యేవారని చక్రపాణిగారి ఎపిసోడ్ నుంచీ అర్ధం అయ్యింది కదా …
ఆ తర్వాత రోజుల్లో దర్శకులు రివ్యూలను గట్టిగా పట్టించుకుని స్పందించి తమ తడాఖా ఏమిటో కూడా చూపించేవారు. ఇప్పుడు హీరోల వంతు వచ్చింది. సమీక్షల మీద విరుచుకుపడడం ఎన్టీఆర్ తోనే మొదలు కాలేదు. ఆ మధ్య హీరో శివాజీ ఓ పాపులర్ వెబ్ సైటు వాడి మీద పడి నానా యాగీ చేశాడు.
అసలు సమీక్షల మీద హీరోలు నోరు విప్పేదాకా నిర్మాతేం చేస్తున్నాడనేది నా ప్రశ్న. ఇది ఇబ్బందికరం అని సీరియస్ గా నలుగురు పెద్ద నిర్మాతలు కలసి కట్టుగా కూర్చుని నివారించాలనుకుంటే అద్భుతమైన మార్గం ఉంది. ఎలాగూ అన్ని మీడియా కార్యాలయాలకూ ప్రకటనలూ కవర్లూ వెళ్తాయి కదా … ఆ కవరులతో పాటే నిర్మాతలే సినిమా విడుదలకన్నా ముందే సమీక్షలు కూడా రాసేసి పంపేశారనుకోండి … ఏ ఇబ్బందీ లేకుండా మన వెబ్ సైటోళ్ల దగ్గర నుంచీ అందరూ అదే అచ్చేసుకుని సినిమా పరిరక్షణోద్యమంలో బాగస్వాములవుతారు కదా …
ఇవన్నీ నిర్మాతలే చూసుకోవాలి. ఎన్నని హీరోలు చూసుకుంటారు? ఇప్పుడూ ఇది కొత్తేం కాదు … ఎలాగూ సినిమా రిలీజవగానే హీరోతోనూ హీరోయిన్నుతోనూ దర్శకుడితోనూ తామే ప్రత్యేక ఇంటర్యూలు చేయించి ఎలక్ట్రానిక్ మీడియాకు ఇస్తున్నారు కదా … మరి … ప్రింట్ అండ్ వెబ్ మీడియా పరిస్థితేమిటి? ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఎలాగైతే మీ సినిమాను ఆకాశానికి ఎత్తేస్తూ ఇంటర్యూలు చేసి ఇచ్చి వాటిని టెలికాస్ట్ చేసినందుకు డబ్బులు ఇస్తున్నారో అలాగే ప్రింట్ అండ్ వెబ్ మీడియాకు కూడా వారు ఏం రాయాలో మీరే రాయించి, వాటిని కూడా ఆ కవర్లోనే పెట్టి ఇచ్చేస్తే వేయమనే ధైర్యం ఎవరికైనా ఉందా?
ఆ పని చేస్తే ఎన్టీఆర్ లాంటి హీరో నోరు తెరిచి యాంటీ మీడియా ఇమేజ్ తెచ్చుకునే పరిస్థితే వచ్చేది కాదు కదా … కనుక ఇప్పటికైనా నిర్మాతలు కళ్లు తెరిచి సినిమా ప్రమోషన్ లో భాగంగానే సమీక్షలు కూడా వారే రాసేసి మీడియాకు పంపాలి. అప్పుడు కన్ఫూజను ఉండదు … దీని వల్ల నిర్మాతలకు మరో ప్రయోజనం ఏమిటంటే … మనం ఇచ్చిన సమీక్ష కాకుండా ఎవరైనా సొంత రివ్యూలు రాశారనుకోండి … ఆ బ్లాక్ లెగ్ ఎవరో వెంటనే తెల్సిపోతుంది. వాళ్లను ఏం చేయాలనేది ఆలోచించుకుని ఓ నిర్ణయానికి రావచ్చు.
ఇప్పటి వరకు అంతా స్వచ్చందమే కాబట్టి ఎవరేం రాసినా ఎప్పుడో తిడుతున్నారు తప్ప పెద్దగా రియాక్ట్ కావడం లేదు నిర్మాతలు. దీన్ని మార్చాలి. కవర్లు ఇచ్చేప్పుడు సమీక్షలూ మనమే ఇవ్వడం కానిపనేం కాదు కదా … అందుకని సినిమాలను రక్షించుకోడానికి నిర్మాతలు తక్షణం రంగంలోకి దిగి ప్రతి సినిమాకూ ఫష్ట్ ప్రింటు రడీ అవగానే సమీక్షలు రాయించేయాలి. వాటిని జాగ్రత్తగా కవరులో పెట్టి మీడియాకు అందించాలి. ఎవరైతే కవరు తీసుకోడానికి రాలేదో … అలాంటి వారిని విడిగా కలుసుకుని మాట్లాడి సెటిల్ చేయాలి. ఏది ఏమైనా సినిమా సమీక్ష మాత్రం మనం రాయించిందే రావాలి.
ఆ రోజులు వస్తే తప్ప తెలుగు సినిమా స్థాయి పెరిగే అవకాశమే లేదు. వాటి కోసం ఎదురుచూడ్డం కాదు మనం చేయాల్సింది … బలవంతంగానైనా తీసుకువచ్చేయడమే…. – భరద్వాజ
Share this Article