యూట్యూబ్ చెఫులు, స్టార్ హోటళ్ల చెఫులు ఏవేవో చేతికొచ్చినవన్నీ ఉడికించి, కాల్చి, వేయించి, పోపు పెట్టేసి… చివరకు ఒరిజినల్ వంట ఏదో తెలియనంత గందరగోళం, చిత్రవిచిత్ర వంటల్ని పరిచయం చేస్తుంటారని చెప్పుకున్నాం కదా… మన కడుపులు కూడా మనకు ముఖ్యం కాబట్టి, తక్కువ శ్రమతో, తక్కువ సరుకులతో, తక్కువ సమయంలో, మంచి రుచికరమైన, ఒరిజినల్ టేస్ట్ చెడిపోని వంటల్ని మాత్రమే ఎంచుకుని చూస్తూ ఉండండి… అసలే రోజులు బాగాలేవు మరి…
సరే, ప్రస్తత విషయానికొస్తే… మామిడికాయల సీజన్… రకరకాల ఊరగాయలు పెట్టేస్తున్నారు… జాడీల్లో నింపేస్తున్నారు… చుట్టూ తెల్లబట్ట చుట్టేసి, అటకల మీదకు ఎక్కించేస్తున్నారు… కొందరు ముక్కల్ని ఒరుగులుగా ఆరబెట్టే పనిలో పడ్డారు… ఎప్పుడు వీలయితే అప్పుడు పుల్లటి టేస్టుకు ఆ ఒరుగులు చాలా బెటర్… ఇవన్నీ సరే కానీ మరి రెగ్యులర్ వంటల్లో..? మామిడికాయ అనగానే చాలామంది అర్జెంటుగా మామిడికాయ పులిహోర, మామిడికాయ పప్పు, మామిడికాయ పప్పుచారు ఎట్సెట్రా వండేస్తుంటారు… పుల్లదనంతో అవన్నీ సూపర్… అలాంటిదే మామిడికాయ పచ్చిపులుసు…
ఎహె, పచ్చిపులుసు అంటేనే చింతపండుతో చేసేది… అదే పులుపు, మళ్లీ దానికి మామిడికాయ ఏం కాంబినేషన్..? డబుల్ పులుపు అవుతుంది కదా అంటారా..? నిజమే… అందుకే దీన్ని మామిడికాయ పులుసు అందాం… ఇవి కూడా బోలెడు వీడియోలు కనిపిస్తయ్… కానీ కాస్త వెరయిటీగా చేసుకునే పులుసు చూద్దాం… సరిగ్గా కుదరాలే గానీ… అన్నంలోకి పోసేసి, మొత్తం దానితో కుమ్మేయడమే… మామిడితో ఉన్న అసలైన మజాయే అది…
Ads
మార్కెట్‌లో పుల్లటి మామిడికాయల్ని తెచ్చుకొండి… ఎంత పులుపు ఉంటే అంత బాగుంటుంది… అవి చాలు… మిగతావన్నీ ఇంట్లోనే ఉంటాయి… ఆ కాయల్ని పెద్ద ముక్కలుగా కోసి ఉడికించండి… కుక్కర్‌లో ఉడికించినా సరే… పప్పుగుత్తితో ఆ ఉడికించిన నీళ్లలోనే గట్టిగా మెదపండి… కొందరు మామిడికాయల్ని, పచ్చి మిరపకాయల్ని కాల్చాలని చెబుతుంటారు… కానీ అవసరం లేదు… అదొక ప్రయాస… అసలు పచ్చి మిర్చి, కారంపొడి అవసరమే లేని విధానం మనం చెప్పుకుందాం… ఈజీ మెథడ్ విత్ మినిమం ఇంగ్రెడియెంట్స్…
పప్పు గుత్తితో మెదుపుతుంటే కాస్త చల్లబడుతుంది కదా… ఇక చేత్తో పిసికేయండి… తొక్కలు తీసేయండి… ఉడికించిన మామిడికాయల రసం మిగులుతుంది… గుజ్జు గుజ్జు ఉన్నా పర్లేదు, వద్దు అనుకుంటే ఫిల్టర్ చేసుకొండి… ఇక అందులో సరిపడా ఉప్పు, కాస్త బెల్లం గానీ, చక్కెర గానీ కలపండి… బెల్లం అయితే బెటర్…
ఇక పోపు పాత్రలో నూనె కాస్త ఎక్కువగానే వేసి, ఎప్పటిలాగే ఆవాలు, జిలకర వేసేయండి… సాధారణంగా పోపులో వేసినట్టు గాకుండా ఇందులో ఎండు మిరపకాయ ముక్కల్ని కాస్త ఎక్కువగా వేయండి… అలాగే ఎండు మిర్చి గింజల్ని కూడా వేయించండి అందులోనే…. పసుపు, కరివేపాకు మీ ఇష్టం… మరీ కారం సరిపోదేమో అని డౌట్ పీడిస్తే రెండు పచ్చి మిర్చిని అందులో పడేయండి… ఉల్లిపాయలు లేని పులుసుకు అర్థమేముంది అని కారెడ్డం ఆడకండి… అనగా నిష్ఠురమాడకండి… ఇష్టమయితే వేసేయండి… (కొందరు మొత్తం పులుసు వండటం అయ్యాక పచ్చి ఉల్లిపాయ తరుగును కలుపుతారు… పచ్చిపచ్చిగా అదోరకం రుచి…)
అంతే ఇక ఏమీ వద్దు… నో అల్లం వెల్లుల్లి, నో మసాలాస్, నో వెజిటుబుల్స్, నో ఎక్సట్రా ఎక్సట్రా ఇంగ్రెడియెంట్స్… ఆ పోపు ఆ మామిడి రసంలో కలిపేయండి… కాస్త ఉప్పూకారం చూసుకుని, వేడి అన్నంలోకి కలుపుకుంటే నాసామిరంగా… ఆత్మరాముడు అన్నిరకాల డాన్సులూ చేస్తాడు… ట్రై వన్స్… కాస్త ముద్దపప్పు వండుకుని, ఇందులోకి కలుపుకుంటాం అంటారా..? వావ్, ఇంకేం… అద్దిరిపోతుంది మీ టేస్టు… కుమ్మేయండి ఇక…!!
Share this Article