.
చదువుల గొడ్ల చావిళ్ళలో మోతుబరి అయ్యవార్లు మార్కుల కోసం దుర్మార్గమయిన హింస పెడుతున్నారని;
ఎంత చదివినా బాగా మార్కులు రాలేదని;
మార్కులు బాగా వచ్చినా సరైన ర్యాంక్ రాలేదని;
మంచి ర్యాంకే వచ్చినా కోరుకున్న చోట సీటు రాలేదని ఇలా అనేకానేక కారణాలతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
వారు బతికి ఉండి ఆవిష్కరించాల్సిన కొంగొత్త విషయాలు దిక్కులేనివి అవుతున్నాయి. వారు బతికి ఉండి తుళ్లుతూ… గడపాల్సిన ఘడియలు దిగులుపడుతున్నాయి. వారు పోయి ఎన్ని జీవితాలు జీవం లేనివైపోతున్నాయో!
Ads
భారతదేశంలో జననాల సంఖ్యను విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య దాటేసిందట. అంటే పుట్టేవారికంటే పోయేవారే ఎక్కువ. మన చదువుల దాహం చావులతో కూడా తీరడం లేదు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు మరీ ఎక్కువగా ఉన్నాయి. బతకడం నేర్పి పైపైకి ఎదిగేలా చేయలేని చదువులు… చావును నేర్పి… పైకి పంపుతున్నాయి.
చదువంటే మార్కులు.
చదువంటే ర్యాంకులు.
చదువంటే దిక్కులు పిక్కటిల్లే ఒకటే అంకె.
చదువంటే ఒకటి నుండి వందలోపు అంకెల పక్కన ఫోటోగా మిగలడం.
చదువంటే ఐ ఐ టి.
చదువంటే నీట్.
చదువంటే ప్రభుత్వాలకు దండగ.
చదువంటే కార్పొరేట్ విద్యా కంపెనీలకు పండగ.
చదువంటే ప్రభుత్వ బడులను ఎండబెట్టి ప్రయివేటు బడులను పెంచి పోషించడం.
చదువంటే తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకోవాల్సిన అగత్యం.
చదువంటే బతుకుతెరువు చూపని గుండె చెరువు.
చదువంటే రాతలో పాస్ చేసి… బతుకులో ఫెయిల్ చేసే గోడకు వేలాడేసుకోవాల్సిన సర్టిఫికేట్.
చదువంటే చచ్చే చావు.
చెట్టంత ఎదిగి శాఖోపశాఖలుగా విస్తరించాల్సిన పిల్లలు;
వారి మేధస్సు పూలుగా పుష్పించి… కాయలై… ఫలించాల్సిన పిల్లలు;
భవిష్యత్తును నిర్మించాల్సిన పిల్లలు-
మన కళ్లముందే చదువులకు బలి అవుతుంటే… సామూహికంగా బాధపడే ఓపిక, తీరిక కూడా లేని మనం…
సామూహికంగా సిగ్గుపడే నైతిక హక్కును కూడా ఏనాడో కోల్పోయాం.
విశాఖలో పశ్చిమ బెంగాల్ కు చెందిన యువతి వైద్యవిద్యలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పోటీ పరీక్షకు ఒక కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటూ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ భారత సర్వోన్నత న్యాయస్థానం అనేక మార్గదర్శకాలు జారీ చేసింది.
ఈ తీర్పును చట్టంగా పరిగణించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఈ ఆదేశాల అమలుకు ప్రత్యేక చట్టం కానీ, ఒక క్రమబద్దీకరణ చట్రం (రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్) కానీ చేయాలని చెప్పింది.
# వందమందికి మించి విద్యార్థులున్న అన్ని విద్యాసంస్థల్లో మానసిక నిపుణులు తప్పనిసరిగా ఉండాలి.
# పిల్లల్లో పరీక్షల ఒత్తిడి పోగొట్టడానికి కౌన్సిలింగ్ ఇప్పించాలి.
# విద్యాసంస్థల్లో, ప్రత్యేకించి కోచింగ్ సెంటర్లలో పిల్లల ప్రతిభ ఆధారంగా తరగతులను ఏర్పాటు చేయడం, మెరికల్లాంటివారికి మెరికల్లాంటి టీచర్లను నియమించి, పనికిరానివాళ్ళుగా ముద్రవేసినవారికి పనికిరానివాళ్ళుగా ముద్రవేసిన టీచర్లను ఏర్పాటు చేయడం మానుకోవాలి.
# మానసిక వైద్యులు, కౌన్సిలర్లు, హెల్ప్ లైన్ నంబర్లు తరగతి గదుల్లో బోర్డుల మీద రాసి పెట్టాలి.
# సామాజికంగా, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా వెనుకబడ్డ పిల్లలను కలుపుకునివెళ్లేలా విద్యాసంస్థలు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి.
# ర్యాగింగ్, లైంగిక దాడులపై వచ్చే ఫిర్యాదులమీద తక్షణం చర్యలు తీసుకోవాలి.
# ఎంతమంది విద్యార్థులకు మానసిక నిపుణులు కౌన్సిలింగ్ ఇచ్చారో యూజిసి లాంటి నియంత్రణ సంస్థలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలి.
# విద్యాసంస్థలు క్రీడలు, కళలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలపై కూడా దృష్టి పెట్టాలి.
# డ్రగ్స్ మీద ప్రత్యేక నిఘా పెట్టాలి.
# ఆత్మహత్యలు చేసుకోవడానికి వీల్లేని విధంగా సీలింగ్ ఫ్యాన్లు, బాల్కనీలను ఏర్పాటు చేయాలి.
# కోటా, జైపూర్, చెన్నయ్, ఢిల్లీ, హైదరాబాద్, ముంబయ్ లాంటి పోటీ పరీక్షలకు ఎక్కువమంది తయారయ్యే నగరాల్లో వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి… విద్యార్థుల ఆత్మహత్యలను కట్టడి చేయాలి.
విద్యార్థుల ఆత్మహత్యల మీద సుప్రీం కోర్టు ఇంత సీరియస్ గా ఆదేశాలు జారీ చేయడం మంచిదే. ఎంతో కొంత చర్చ జరగడం అవసరం కూడా. కానీ… ఆచరణలో మెరికల్లాంటివారికి మెరికల్లాంటి టీచర్లను పెట్టి… మిగతావారిని గాలికొదిలేసే అధునాతన అంటరానితనపు పోటీ తరగతులు పోతాయా?
ఒకటి ఒకటి ఒకటి అనే ఒకటే రొద అయిన ర్యాంకుల ప్రకటనలు పోతాయా? నామకరణం నాడే జెఈఈ మెయిన్స్ అడ్వాన్స్ డ్ కు మెయిన్ గా అడ్వాన్స్ ఇచ్చి కోచింగ్ సెంటర్లలో బుక్ చేసుకోవడం ఆగుతుందా?
దేవాతావస్త్రం కథలో కనీసం పిల్లాడయినా రాజు ఒంటిమీద బట్టల్లేని నగ్నసత్యాన్ని బహిరంగంగా చెప్పాడు. ఈ చదువుల దేవాతావస్త్రం కథలో నగ్నసత్యం అందరికీ తెలుసు. ఎవరూ నోరు విప్పరు- అంతే! ఇదొక అంతేలేని చదువుల విధ్వంసం…. – పమిడికాల్వ మధుసూదన్ 9989090018
Share this Article