M.P.మైఖేల్ అలియాస్ లాల్… ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల నుంచి బాగా అప్లాజ్‌కు నోచుకుంటున్న పేరు… కర్ణన్ సినిమాకు బహుళ ప్రశంసలు వస్తున్నయ్… ఆ ధనుష్‌కూ, ఆ దర్శకుడికి కూడా మంచి అభినందనలే దక్కుతున్నయ్… అదేసమయంలో లాల్ నటనకు కూడా చప్పట్లు పడుతున్నయ్… అర్హుడే… నిజానికి తను కొత్తేమీ కాదు… ఆమధ్య సుల్తాన్‌లో కూడా ఉన్నాడు… సాహోలో ఉన్నాడు… అప్పట్లో పందెంకోడిలో కూడా కనిపించాడు… తన వయస్సు ఎంతో తెలుసా..? 62 ఏళ్లు… ఐనా సరే, అలా కనిపించడు… ఏ వయస్సు పాత్ర ఇచ్చినా సరే, అందులో దూరిపోతాడు… ఒరిజినల్‌గా తను మళయాళీ… తండ్రి ఎంఏపాల్ ఫేమస్ తబలా ప్లేయర్… సోదరుడు అలెక్స్ పాల్ మంచి మ్యూజిక్ కంపోజర్… అంతెందుకు..? లాల్ కొడుకు కూడా దర్శకుడు… మొత్తం ఫ్యామిలీ అంతా సినిమా ప్రపంచమే… లాల్ అనేది తన ఇండస్ట్రీ నేమ్…
విచిత్రం ఏమిటంటే..? ఇండస్ట్రీలో తన ప్రయాణం కేవలం నటుడిగా ప్రారంభం కాలేదు… నటుడిగా మాత్రమే సాగడం లేదు… తన బహుముఖ ప్రజ్ఞలో నటన ఒక పార్ట్… అంతే… తను నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్… మళయాళమే కాదు, తమిళం, తెలుగు… నిజానికి ఫస్ట్ ఓ మిమిక్రీ ఆర్టిస్టు… తన కెరీర్ స్టార్టయ్యేది దాంతోనే… తరువాత అసిస్టెంట్ దర్శకుడయ్యాడు… బాల్యస్నేహితుడు సిద్దిఖీతో కలిసి నిర్మాత కమ్ దర్శకులుగా మారిపోయాడు… తక్కువ బడ్జెట్‌తోనే అప్పట్లో మళయాళ సినిమాలు వచ్చేవి… కొన్నాళ్లకు సిద్దిఖితో విడిపోయినా లాల్ మాత్రం నటుడిగా, రైటర్ కమ్ డైరెక్టర్‌గా తన ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నాడు…
Ads
మన తెలుగు హీరోలు ప్రతిభావంతులైన విలన్లు గానీ, ప్రధాన పాత్రధారులుగానీ ఉంటే ఎందుకో నచ్చరు, మెచ్చరు… నటనలో తమ బలహీనతలు బయటపడిపోయి, వాళ్లు ఎక్కడ బాగా ఎక్స్పోజ్ అయిపోతారో అని భయం కావచ్చు… ముందుజాగ్రత్త కావచ్చు… బలమైన నటులు ప్రధాన పాత్రల్లో ఉన్నప్పుడే సీన్లు రక్తికడతాయనే సోయి కూడా దీంతో గాలికి ఎగిరిపోతుంది… ఉదాహరణకు విలన్ పాత్ర ఎంత బలంగా ఉంటే, ఆ పాత్రధారి తన నటనలో ఎంత ఇరగదీస్తే అంతగా హీరోయిజం కూడా ఎలివేట్ అవుతుంది… ఎటొచ్చీ, ఆ విలన్ పాత్రధారికి దీటుగా మన హీరో నటించగలిగినప్పుడు..! తమిళ, మళయాళ హీరోలు కాస్త నయం… తమ హీరోయిజం విషయంలో కాంప్రమైజ్ కాకుండానే, ఇతర పాత్రలకు ప్రతిభావంతులైన యాక్టర్స్‌ను తీసుకోవడాన్ని ఎంకరేజ్ చేస్తారు… హీరో ధనుష్ కూడా అంతే… కథనబలం ఉన్న సీన్లు దొరికితే విజయ్ సేతుపతి వంటి నటులు ఎలా రెచ్చిపోతారో మనకు తెలుసు కదా… తెలుగులో అలాంటివాళ్లకు కొదవేమీ లేదు… కానీ వాళ్లను బలంగా ఎక్స్పోజ్ కానివ్వరు… అంతే తేడా… లాల్ విషయానికొస్తే… తన పేరు చెప్పగానే మలయాళంలో తీసని పెంగలీల అనే ఒక సినిమా గుర్తొస్తుంది… ఒక చిన్నపాప, వాళ్ళ ఇంట్లో పనిచేసే ఓ దళిత నౌకరు… ఆ పాపకూ ఈ నౌకరుకూ నడుమ ఏర్పడే అనుబంధం ఆ సినిమా… అందులో లాల్ నటవిశ్వరూపం… నీ ప్రస్థానం ఇలాగే సాగనీ బ్రదర్… తెర నిండుగా, కన్నులపండుగ్గా…!
Share this Article