కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్… ప్రభుత్వ హాస్పిటళ్లలో వార్డులు ఖాళీ చేసి కృష్ణపట్నం ఆనందయ్య మందు కోసం పరుగులు… వేలాది మంది పడిగాపులు… వరుసలు….. ఇది మూర్ఖత్వంగా చూసేవాడిదే మూర్ఖత్వం… ఎందుకంటే, ఇది ప్రజల్లో పెరిగిన నమ్మకం… ఒక ఆశ… నడిసంద్రంలో చిక్కుకున్నవాడికి ఏది దొరికితే అదే ఆధారం కాబట్టి… అల్లోపతిలో కరోనాకు చికిత్స ఎలా జరుగుతున్నదో జనం అనుభవిస్తున్నారు కాబట్టి, అది నమ్మకాన్ని ఇవ్వలేకపోతోంది కాబట్టి, కార్పొరేట్ వైద్య దోపిడీ ఆకాశాన్ని అంటుతోంది కాబట్టి…… అంతేకాదు… చికిత్సలో దారుణమైన నిర్లక్ష్యం కాబట్టి… స్టెరాయిడ్స్ విచ్చలవిడిగా వాడితే కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి కాబట్టి…
ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి… హైదరాబాదులో కొన్ని తరాలుగా చేపమందు వేస్తారు… ఉబ్బసం కోసం… ఒక్కరికీ సైడ్ ఎఫెక్ట్ ఉండదు… తొక్కులాట ఉండదు… పనిచేస్తే చేస్తుంది, లేకపోతే లేదు… కానీ పనిచేస్తుందనే నమ్మకం పనిచేస్తుంది… దాన్ని ప్లేసిబో అనండి, ఇంకేమైనా అనండి… ఏళ్లుగా వస్తున్నవాళ్లు ఉన్నారు… వాడికి రిలీఫ్ దొరక్కపోతే, ప్రయాసపడి ఎందుకొస్తున్నట్టు..? వాడికి ఒక రిలీఫ్ కావాలి కాబట్టి… దాని మీద విషప్రచారాలు చేసీ చేసీ, దాని శాస్త్రీయ ప్రమాణం మీద రచ్చ చేసీ చేసీ, చివరకు ఏమనాలో తెలియక… మందు వేస్తున్నప్పుడు ఇన్ఫెక్షన్ ఒకరిదొకరికి సోకే ప్రమాదముందని ఓ పిచ్చి సాకు చూపబోయి, అదీ ఫలించక ఇక ఇప్పుడు నోళ్లు మూసుకున్నారు… ఏటా యంత్రాంగం కూడా ఏర్పాట్లు చేసి, సాఫీగా మందు పంపిణీ జరిపిస్తుంది…
Ads
చేపమందు ఒక పరంపరగా ఆ కుటుంబానికి సిద్ధిస్తున్న ఓ సూత్రం… దానికి డీజీసీఐ, ఐసీఎంఆర్ సర్టిఫికెట్లు ఏమీ లేవు… అవసరం లేదు… వుడ్ వర్డ్స్ గ్రైప్ వాటర్‌కు, జిందాతిలిస్మాత్కు, అమృతాంజనానికి ఎవరి ధ్రువీకరణ అక్కర్లేదు… కృష్ణపట్నం ఆనందయ్యదీ అంతే… ఆయన లాభాపేక్ష కోసం చేయడం లేదు… సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు… జనంలో నమ్మకం ఉంది… ఆ నమ్మకానికి ఆధారం సోషల్ మీడియా కాదు… ఆ మందు వాడిన వాళ్లు షేర్ చేసుకునే అనుభవాలు… ఇక్కడ ప్రభుత్వం చేయాల్సింది… సేమ్, చేపమందుపై తెలంగాణ ప్రభుత్వం చేసిన పనే… ప్రభుత్వం ఆల్రెడీ ముగ్గురు ఆయుర్వేద ఎండీలు ప్లస్ ఆర్డీవో, డీఎంహెచ్వోలతో రిపోర్ట్ తెప్పించింది… ఇప్పుడు తాజాగా ఐసీఎంఆర్ ద్వారా శాస్త్రీయ ప్రమాణాల్ని నిర్ధారించాలని ఆదేశించిందట… సపోజ్, అక్కడికి వెళ్లిన ఓ సైంటిస్టు సిద్ధవైద్యానికి బద్దవ్యతిరేకి అనుకుందాం… మొదటి నుంచీ దీన్ని ఫాలో అవుతున్న ఎవరైనా కొన్ని ప్రశ్నలు వేస్తే ఎలా ఉంటుందో… జస్ట్, ఓ కల్పన…
చెప్పండి, మీరు ఈ నాటు వైద్యం వాడారు కదా, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయా..?
ముందు నాటు వైద్యం అనే పదం వాడకండి, మీకు నాటు వైద్యానికీ, ఆయుర్వేదానికీ తేడా తెలియకపోతే ఎలా..? పోనీ, మూలికా వైద్యం అనండి…
ఆ మందు కోసం వాడుతున్న ముడి పదార్థాల ప్రామాణికత చూడాలి కదా..?
ఆయుర్వేదం వేల ఏళ్లగా వాడుతున్న పదార్థాలే అవి… ఒక్కటీ నిషిద్ధ పదార్థం కాదు, అల్లోపతీలో వాడినట్టుగా కృత్రిమ రసాయనాలు కూడా వాడటం లేదు… దానికి వేరే ప్రామాణికత ఏముంటుంది..? ఆ ముడిసరుకులన్నీ కరోనా లక్షణాలకు వాడేవే… రహస్యమేమీ లేదు, ఆయనే చెప్పాడుగా… ఎలా తయారు చేసుకోవాలో కూడా చెప్పాడు… దొంగ వైద్యం, దొంగ వైద్యుడు అయితే ఎందుకు చెప్పేస్తాడు..?
నో, నో, ఆయనకు ఉన్న అర్హత ఏమిటి..? ఆయన డాక్టర్ కాదు…
మూలికా వైద్యంలో ఏ కోర్సులు ఆఫర్ చేస్తోంది ఇండియన్ మెడికల్ కౌన్సిల్..? అది చెప్పండి…
ప్రయోగాలు జరగాలి, ఫలితాలు పరిశీలించాలి, రికార్డు చేయాలి, తరువాత డీజీసీఐ అనుమతించాలి… అప్పుడు గానీ మందు అమ్మడానికి వీల్లేదు…
కరోనాకు రెమ్‌డెసివర్, టోస్లీజుమాబ్, స్టెరాయిడ్లు వాడటానికి డీజీసీఐ అనుమతి ఇచ్చిందా..? పోనీ, ఈ వేక్సిన్లకు పూర్తి స్థాయి ప్రయోగాలు జరిగాయా..? ‘‘తక్షణావసరం’’ పేరిట అనుమతులు ఇచ్చేశారు కదా… మరి దీనికెందుకు ఇవన్నీ… ఇన్నిరోజులుగా రోజూ వందల మంది ప్రజలు వాడుతున్న మందే కదా…
కాదు, కాదు, ఆ కంట్లో మందు దీర్ఘకాలికంగా నష్టం చేయవచ్చు…
ఒక్కసారి ఆ బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ ఎందుకొచ్చిందో చెప్పగలరా..? పోనీ, దీర్ఘకాలిక పరిశీలన అంటే ఎన్నేళ్లు పరిశీలించాలి..? మీ డీజీసీఐ అనుమతులు ఇస్తున్న ప్రతి మందుకూ ‘‘ఎంత దీర్ఘకాలం పరిశీలన’’ జరిగింది..?
శాస్త్రీయ వైద్యం వేరు, ఈ అశాస్త్రీయ వైద్యం వేరు… దేశీయ వైద్యాన్ని ఎంకరేజ్ చేయలేం…
ఓహో, మరి ఆయుర్వేదం, యునాని, హోమియో కోర్సులు ఎందుకు కొనసాగిస్తున్నారు..? ఆ దవాఖానాలు దేనికి..? ఏది శాస్త్రీయ వైద్యం… ప్లాస్మా థెరపీ, రెమ్‌డెసివర్ శాస్త్రీయమేనా..? మరి ఎందుకు WHO వాటిని వద్దంటోంది..? నిన్నటిదాకా శాస్త్రీయం..? ఇప్పుడు అశాస్త్రీయమా..,?
అవి శాస్త్రీయమే… కానీ కరోనాకు పనిచేయడం లేదు…
పనిచేయని వాటిని పర్మిట్ చేసింది ఎవరు..? ఏ ప్రామాణికత ఆధారంగా పర్మిట్ చేశారు..? ఆనందయ్య మందు పరిశీలించాలంటే ఏదో ఓ కొలమానం కావాలి కదా, మందు అంటే ఫలానా ప్రమాణాల్లో ఉండాలని… అవేమిటో నిర్దేశించి ఉన్నాయా..? జాండిస్ తగ్గడానికి పోసే ఆకుపసరుకు ఏ ప్రమాణాలు ఉండాలో మీరు చెప్పగలరా..?
నష్టదాయకంగా ఉండకూడదు, ఫలితం చూపించాలి… సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు…
అదే నిజమైతే ఇప్పుడు మీరు కరోనాకు వాడుతున్న ఒక్క యాంటీ వైరల్ డ్రగ్ కూడా అమ్మకూడదు…
నో, నో, అదంతా డీజీసీఐ చూసుకుంటుంది… మేం కాదు…
మరి మీరు చూసేదేమిటి..? లక్షల కోట్ల డ్రగ్ మాఫియాల నడుమ, రూపాయి ఖర్చు లేకుండా, ఓ నమ్మకంతో మందు వేయించుకుంటాను నేను… పనిచేస్తే వోకే, చేయకపోయినా వోకే… పోయేదేమీ లేదు… ఇదేమీ తాయెత్తు మహిమ కాదు, భూతవైద్యం కాదు…
మా ప్రయత్నం కూడా జనానికి నష్టం జరగొద్దనే కదా…
ఇక్కడికొచ్చిన 30 వేల మందిలో… విద్యావంతులున్నారు, విజ్ఞులున్నారు, అనుభవజ్ఞులున్నారు… అంబులెన్సుల్లో ఆక్సిజన్‌తో ఊపిరాడక కొట్టుకుంటున్న రోగులున్నారు… మీరు చెప్పేవి ఒక్కరైనా నమ్ముతారా..? అడిగి చూడండి… ఫోఫోవయ్యా, మీరు చేసేవన్నీ మళ్లీ కార్పొరేట్ దోపిడీకి వంతపాడేందుకే… నీళ్లసీసా ధరకు వేక్సిన్ ఇస్తానన్నాడు ఒకాయన… ఇప్పుడు 1250కు ఒక డోస్ వేస్తున్నారు… చాలా..? ఇంకా చెప్పాలా..?
(ఈ సంభాషణ ఒడవదు, తెగదు… ఎందుకంటే, ఓ సంక్లిష్ట సబ్జెక్టు కాబట్టి… ఆనందయ్య మందును సర్వవిధాలా అడ్డుకునే ప్రయత్నాలు సాగుతూనే ఉంటయ్, స్టార్టయినయ్… పోనీ, జనమే దాన్ని నాలుగు రోజులకు వదిలేశారు అనుకుందాం… నష్టమేముంది..? కానీ ఆల్టర్నేట్ మెడిసిన్ అవసరంపై, మనం వదిలేసుకున్న మంచి మంచి ప్రభావవంతమైన మూలికలపై బలమైన రీసెర్చ్ జరగాల్సి ఉందనే డిబేట్ అయినా జరుగుతుంది కదా… అది మంచిదే కదా…)
Share this Article