నిజంగా ఈ వార్త బాగుంది… అసలు మన మెయిన్ స్ట్రీమ్ పత్రికలు హ్యూమన్ ఇంట్రస్టింగ్ వార్తల్ని రోజురోజుకూ మరిచిపోతున్నయ్… పాపపంకిలమైన రాజకీయ, ఉద్దేశపూరిత కథనాలకు పరిమితమై మన పత్రికలన్నీ మురికి కంపు కొడుతున్నవేళ ఇలాంటి వార్తలు రావడమే అరుదు… అందుకని ఈ వార్త రాసిన ఈనాడు ఇంద్రవెల్లి విలేఖరికి అభినందనలు… వార్తను స్థూలంగా గమనిస్తే…
అదొక గిరిజన గూడెం… ఉన్నవే 6 ఆదివాసీ కుటుంబాలు… ఏ చిన్న అవసరానికైనా సరే పది కిలోమీటర్ల దూరంలోని ఇంద్రవెల్లి మండలకేంద్రానికి వెళ్లాలి… జనవరి 10న ఇంద్రవెల్లి పీహెచ్‌సీలో కొడప పారుబాయి అనే 22 ఏళ్ల మహిళ ప్రసవించింది… ఆడపిల్ల పుట్టింది… మరుసటిరోజే ఆమెను గూడేనికి తీసుకెళ్లారు… కానీ దురదృష్టం కొద్దీ ఆమె పది రోజులకే అనారోగ్యంతో మరణించింది…
ఆ పసికూన ఆకలి తీర్చడానికి రోజూ పది కిలోమీటర్లు వెళ్లి పాలపాకెట్ కొనుక్కురావల్సి వస్తోంది… పాల కోసం ఒక పాడిఆవు కొనివ్వాలని స్థానిక ఐటీడీఏకు మొరపెట్టుకున్నా ఎవడూ పట్టించుకున్న పాపాన పోలేదు… ఇదీ వార్త సారాంశం… ఇక విషయానికి వద్దాం…
Ads
ఓ హ్యూమన్ ఇంట్రస్టింగ్ వార్త పబ్లిష్ చేసినందుకు ఈనాడుకు అభినందనలు… ఈనాడు స్టాండర్డ్స్ ఎంత పడిపోతున్నా సరే, వేరే పత్రికలు ఈరోజుకూ దాన్ని అందుకోలేకపోవడానికి కారణాలు ఇలాంటివే… క్షుద్రమైన ప్లాంటెడ్ వార్తలు తప్ప ఇలాంటి ‘లైఫ్’ ఉన్న వార్తలు పట్టకపోవడం…!! సరే, అదంతా వేరే చర్చ… ఈ వార్తకు సంబంధించి… ప్రసవం జరిగి రెండు నెలలు గడిచిపోయాక గానీ ఈ కుటుంబం బాధ ఎవరి దృష్టికీ రాలేదు… రోజూ ఎవరో ఒకరు 3 కిలోమీటర్లు కాలినడకన ఛిద్దరి ఖానాపూర్ దాకా, తరువాత ఏదో ఓ వెహికిల్‌లో ఇంద్రవెల్లికి వెళ్లి పాలు తీసుకొస్తున్నారు…
కొన్ని సందేహాలు… 1) ఆ గూడెంలో పిల్లల తల్లులు ఎవరూ లేరా..? 2) గూడెంలో ఎవరికీ బర్రె గానీ, ఆవు గానీ, మేక గానీ లేవా..? 3) ఆ పరిసరాల్లో వేరే గూడేలు లేవా…? అక్కడా ఎవరూ పిల్లల తల్లులు లేరా..? బర్లు, ఆవులు, మేకలు కూడా ఎవరికీ లేవా..? 4) ప్రసవం జరిగి రెండున్నర నెలలు గడుస్తున్నా ఈరోజుకూ ఆ గూడేనికి సంబంధించిన బాల్వాడీ సెంటర్ ఏం చేస్తోంది..? 5) కనీసం జిల్లా అధికారులకైనా చెప్పారా..? 6) దీనికి పరిష్కారం ఏమిటి..?
ఈ వార్త చూసి మంత్రి హరీష్ స్పందించాడు, ప్రస్తుతానికి పీహెచ్‌సీ నుంచి పాలు, పౌష్టికాహారం సప్లయ్ చేస్తున్నారనీ, ఓ పాలిచ్చే ఆవును కూడా సప్లయ్ చేస్తారనీ ఒక వార్త కనిపించింది… గుడ్, హరీష్ సకాల స్పందనకు అభినందనలు… కానీ ఇది తాత్కాలికం, ఒక్క కుటుంబం బాధ తీర్చడం… అసలు ఇలాంటి అవస్థల్లో ఏ ప్రభుత్వ శాఖ వాళ్ల అవసరాల్ని తీర్చాలి..? ఏం సమకూర్చాలి..?
శిశు సంరక్షణ, శిశు సంక్షేమం… ఇది పీహెచ్‌సీ బాధ్యత కాదు, శిశుసంక్షేమ శాఖ ఒకటి ఏడ్చింది… గిరిజన సంక్షేమ శాఖ కూడా ఉంది… వాళ్లు ఏం చేస్తున్నారు..? వాళ్లేం చేయాలి..? అసలు ఆ తల్లి ఏ అనారోగ్యంతో మరణించింది..? ప్రసవానంతర అనారోగ్యంతోనేనా..? ఆ ఎంక్వయిరీ జరగాలి… సో, ఇవన్నీ నివారించే దిశలో కదా ఓ పాలసీ ఫ్రేమ్ చేయాల్సింది… మంత్రికి అర్థమైందనే అనుకుంటున్నాను… !!
Share this Article