ఖాకీలంటే కాఠిన్యమే, ఆ కరకు ఖాకీతనమే కాదు, కాసింత కారుణ్యం కూడా..!! పోలీసులూ మనుషులే… కాకపోతే చేతిలోకి అధికారాల లాఠీ వచ్చాక, ఆ డ్రెస్సు తొడిగాక మనుషులు పోలీసులు అవుతారు… కాకపోతే పలుసార్లు మేమూ మనుషులమే అని చాటిచెబుతుంటారు కొందరు పోలీసులు…
***
భార్య శవాన్ని మోసుకెళ్తున్న అభాగ్యుడికి సాయం కథ చెప్పేది అదే…
***
పోలీసులంటే కాఠిన్యం అనే అందరూ అనుకుంటారుకదా… కానీ కొన్ని కరకు ఖాకీ దుస్తుల వెనుక చల్లని మనసు కూడా ఉంటుందని నిరూపితమైన ఘటన ఇది…
.
నిరుపేదలు దేశంలో చచ్చిన తరువాత వారు సజావుగా కాటికి చేరడం కూడా కష్టమే అనే మరో జీవన సత్యం సైతం ఆవిష్కృతమైన సంఘటన ఇది. మార్గమధ్యంలోనే భార్య కన్నుమూస్తే ఆమె శవాన్ని 130 కిలోమీటర్లు మోసుకుని వెళ్లేందుకు సిద్ధమైన ఓ అభాగ్యుని దీన గాథ ఇది.
.
బుధవారం ఒరిస్సాకు చెందిన ఈది గురు అనే మహిళ విశాఖ జిల్లాలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరింది, బతికే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు. దీంతో భర్త సాములు ఆమెను ఆటోలో కోరాపుట్ జిల్లాలోని సరోడా గ్రామానికి బయల్దేరాడు…
.
ఖర్మ బాలేదు. పేదవాడికి చావు కూడా కష్టంగానే వస్తుంది.. అందుకే ఆటో విజయనగరం రాగానే గురు ఆటోలోనే కన్నుమూసింది. ఇక శవాన్ని నేను అంతదూరం తేలేను అంటూ 2000 లాక్కుని ఆటోడ్రైవర్ అక్కడే దించేశాడు. సాములుకు తెలుగు రాదు.. చేతిలో చిల్లిగవ్వ లేదు..
.
జీవితాంతం భార్యను ఆదరిస్తానని పెళ్లినాడు ఇచ్చిన మాట గుర్తొచ్చింది. ఇక వేరే ఏమీ ఆలోచించలేదు.. మిగిలిన ఆ నూటా ముప్ఫయ్ కిలోమీటర్లూ ఆమెను మోస్తూ నడిచేద్దాం అని నిర్ణయించుకుని ఆమె మృతదేహాన్ని భుజాన వేసుకున్నాడు.. కన్నీళ్లు దారి కప్పేస్తున్నాయ్.. అడుగులు తడబడుతున్నాయ్.. భుజాన భార్య వేలాడుతోంది.. అయినా సాములు నడుస్తూనే ఉన్నాడు.
.
ఈ విషయం ఏదోలా పోలీసులకు చేరింది. వెంటనే సీఐ తిరుపతి రావ్, ఎస్సై కిరణ్ కుమార్ హుటాహుటిన వచ్చి సాములును ఊరడించి, కాసిన్ని నీళ్లు తాగించి.. చేతిలో ఓ పదివేలు పెట్టి, అంబులెన్స్ కూడా ఏర్పాటు చేసి వారిని స్వగ్రామానికి పంపారు. పోలీసుల సహాయానికి సాములు కన్నీళ్ళతో కృతజ్ఞత తెలిపాడు… గురు శవాన్ని తీసుకుని అంబులెన్స్ ఒరిస్సా వైపు దారితీసింది.
.
.
చాలామందికి హార్ష్‌గా అనిపించినా ఒకటి మాత్రం నిజం… అయోధ్యలు, కాశీలు, మధురలు ఎప్పటికైనా హిందువులవే… కానీ ముందుగా ఏ పేద అనాథ తన వాళ్ల శవాన్ని ఏడుస్తూ, మోస్తూ, నడుస్తూ లేదా సైకిళ్ల మీద ఇళ్లకు, ఊళ్లకు తీసుకుపోయే దుస్థితి లేకుండా చూడాలి… ప్రపంచంలోకెల్లా మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ తన ప్రజలకు ఈమాత్రం చేయలేదా..? మనకే నగుబాటు కాదా…!!
.
(మిత్రుడు పంపింది యథాతథంగా… ఏడాది క్రితం పోస్టు అని ఫేస్‌బుక్ వాడు గుర్తుచేశాడు… )
Share this Article