సుధీర్ బాబు… ఇప్పటికీ కృష్ణ అల్లుడనీ, మహేశ్ బాబు బావ అనీ సంబోధిస్తున్నాం… కారణం, తను హీరోగా ఇంకా ఎస్టాబ్లిష్ కాకపోవడం… చెప్పుకోదగ్గ హిట్ తన ఖాతాలో పడకపోవడం..! నిజానికి చాలామంది కొత్త హీరోల్లాగా లాంచింగుతోనే మాస్ ముద్ర కోసం ఏమీ ప్రయత్నించలేదు… సూపర్, సుప్రీం హీరో వేషాల కోసం ప్రయత్నించలేదు… తనదంటూ ఓ భిన్నమైన స్టయిల్… పాత్రల ఎంపికలో కొంత వెరయిటీగా ఉంటాడు, టేస్టు ఉంది… కాకపోతే అవేవీ క్లిక్ కాలేదు…
నటనలోనూ మరీ తీసిపారేయదగిన కేరక్టర్ ఏమీ కాదు తను… ఓ కమర్షియల్ హీరోకు అవసరమైన రూపం, బాడీ, మెరిట్, బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సరే, తనకు ఇంకా సుడితిరగడం లేదు… తన సినిమాల్లో సమ్మోహనం దాదాపు అందరికీ నచ్చిన సినిమా… సరే, తన వ్యక్తిగతాన్ని, కెరీర్‌ను కాసేపు వదిలేస్తే… తను హీరోగా నటించిన హంట్ రిలీజైంది… నిజానికి ఇది చాన్నాళ్ల క్రితం మలయాళంలో వచ్చిన సినిమాయే… 2013లో వచ్చింది, పేరు ముంబై పోలీస్… హీరో పృథ్వీరాజ్ సుకుమారన్…
మలయాళం మార్కెట్ వేరు… ఆ ప్రేక్షకులు వేరు… ప్రయోగాత్మక సినిమాలు చాలా తక్కువ ఖర్చులో తీసిపడేస్తారు… సోకాల్డ్ కమర్షియల్, యాక్షన్ బీభత్సాల కాలం కాదు అది… పదేళ్లు దాటింది కదా… సినిమాల తీరే మారిపోయింది… స్పీడ్ నెరేషన్, గ్రిప్పింగ్ ఎడిటింగ్, థ్రిల్లింగ్ బీజీఎం, ఇంటర్వెల్ బ్యాంగ్, ఇంటరెస్టింగ్ ట్విస్ట్స్… ఇలా ఒక ఇన్వెస్టిగేటివ్ క్రైం థ్రిల్లర్ తీయాలనుకున్నా సరే, చాలా మసాలాలు అవసరం… అన్నింటికీ మించి వంట బాగా రావడం వేరు, దాన్ని వడ్డించే తీరు వేరు… ప్లేటులో పెట్టిన తీరు చూస్తేనే సగం కడుపు నిండిపోవాలి…
Ads
ఇందులో హీరోయిన్ లేకపాయె… వేరే సబ్ ప్లాట్లు కూడా ఉండవు… ఒకే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది… అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సింది… ఏదో సాదాసీదా క్రైం కథనం చదివినట్టుగా ఉంటుంది… ఒకే ఒక షాకింగ్ ట్విస్టు ఉంటుంది… అది రివీల్ అయ్యేవరకూ సినిమా బోరింగ్ నడక… నిజానికి మంచి కథే… కొలీగ్‌ను ఎవరో కాల్చిచంపడం, దాన్ని చూసి కూడా ఓ యాక్సిడెంటులో జ్ఞాపకశక్తి కోల్పోవడం, మళ్లీ తనే దర్యాప్తు చేయడం… మంచి దర్శకుడి చేతిలో పడితే అదిరిపోతుంది… కానీ ఇక్కడ వంట సరిగ్గా కుదరలేదు… కాకపోతే ఇలాంటి పాత్రను అంగీకరించడంలో సుధీర్ బాబు సాహసం అభినందనీయం… అది క్లిక్కయిందా లేదానేది వేరే సంగతి…
ఇలాంటివి ఓటీటీల్లో చూడటానికి అలవాటు పడిపోయారు ప్రేక్షకులు… జనాన్ని థియేటర్ దాకా రప్పించాలంటే సినిమా సాదాసీదా ఉంటే సరిపోదు… ఏదో యూనిక్ ప్రజెంటేషన్ ఆకర్షించాలి… అది స్టార్ డం కావచ్చు, హై టెక్నికల్ స్టాండర్డ్స్ కావచ్చు, భిన్నమైన కంటెంట్ కావచ్చు… సో, ఓటీటీ విడుదల కోసం వేచి ఉండుడు… లేదంటే కొమ్మూరి సాంబశివరావు రాసిన ఏదైనా పాత డిటెక్టివ్ యుగంధర్ నవల మళ్లీ చదవండి…!!
Share this Article