Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హీరో రాజేంద్రప్రసాద్ మరో పెళ్లాం… కానీ పెద్దగా అచ్చిరాలేదు పాపం…

April 3, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. రాజేంద్రప్రసాద్ నట జైత్రయాత్రలో మరో సూపర్ హిట్ మూవీ 1991 లో వచ్చిన ఈ ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ . బహుశా ఈ టైటిల్ పోలీసు సంఘాలకు నచ్చి ఉంటుంది . ఎవరూ రచ్చ చేసినట్లు లేదు . రూల్స్ ఒప్పుకోవు కానీ త్రేతాయుగం , ద్వాపర యుగం , రాజుల యుగంలోలాగా అందరూ ఇద్దరు , ముగ్గురు , నలుగురు , అయిదుగురు పెళ్ళాల ముద్దుల మొగుళ్ళు కావాలని మనసులో కోరుకునేవారే ! పైకి చెప్పరండోయ్ . అందరూ కాదండోయ్ . కొందరు శ్రీరామచంద్రులు ఉంటారు . వారి గురించి కాదు . సరే . సినిమాలోకి వద్దాం .

అనగనగా ఓ కానిస్టేబుల్ కృష్ణయ్య . వాళ్ళ నాన్న వాళ్ళబ్బాయి SI అని అబధ్ధమాడి రుక్మిణితో పెళ్లి చేస్తాడు . పెళ్ళయ్యాక నిజం తెలిసిన రుక్మిణి కృష్ణయ్యని బహిష్కరిస్తుంది . ఈ సందట్లో పక్కింటి సత్యభామ కృష్ణయ్య మీద కన్నేసి మానార్పణ చేస్తుంది . రుక్మిణే అఫిషియల్గా పర్మిషన్ ఇచ్చి పెళ్లి చేస్తుంది . అలా రాజేంద్రప్రసాద్ దివ్యవాణి , పూజితలకు ముద్దుల మొగుడవుతాడు కానిస్టేబుల్ కృష్ణయ్య .

Ads

ఒద్దురోయి దేవుడయా ఇద్దరు పెళ్ళాలు అని… ఇంక అక్కడ నుంచి ఇద్దరూ ఫుట్ బాలుని తన్నినట్లు తంతుంటారు . ఇంకో రాజేంద్రప్రసాద్ కూడా ఉన్నాడు సినిమాలో . అంటే డబుల్ ఫోజు అన్న మాట . ఆ రాజేంద్రప్రసాద్ నాటకాలరాయుడు . మేనమామ కూతురు అనూషను ప్రేమిస్తాడు . ఉద్యోగం వస్తే కానీ పిల్లను ఇవ్వనంటాడు మేనమామ .

ఈ రెండో రాజేంద్రప్రసాద్ కానిస్టేబుల్ అవతారం ఎత్తటం , ఇద్దరు పెళ్ళాల మధ్య ఫుట్ బాల్ కావటం , అసలు మొగుడు నిలేయటం , పెళ్ళయ్యే దాకా వదిలేయమని అడగటం , అనూష అపార్థం చేసుకోవటం , క్లైమాక్సులో అన్నీ సర్దుకోవటం , రెండో రాజేంద్రప్రసాద్ మేనమామ కూతురిని పెళ్లి చేసుకోవటం , ఇద్దరు పెళ్ళాలు తమ ముద్దుల పోలీస్ మామ చెంతకు చేరటంతో సినిమా శుభాంతం అవుతుంది .

ఈ సినిమా కధను చిక్కగా , ఆద్యంతం హాస్య రస సన్నివేశాలతో నింపిన రచయితలు రేలంగి నరసింహారావును , కాశీ విశ్వనాధుని ; చిక్కని కధకు బిర్రయిన స్క్రీన్ ప్లేని వ్రాసి దర్శకత్వం వహించిన రేలంగి నరసింహారావును ; సినిమాకు తగ్గ కడుపుబ్బ నవ్వించే డైలాగులను వ్రాసిన మా గుంటూరు వారు Divakara Babu Madabhushi , కాశీ విశ్వనాథ్ గారిని ముందుగా మెచ్చుకోవాలి .

సినిమా నిండా కామెడీ కేరక్టర్లే . ముఖ్యంగా వయ్యారాల వై విజయ గేదెల కాంతమ్మగా మొగుడు సుత్తి వేలుని ఓ ఓ ఓ అని గేదెని కంట్రోల్ చేసినట్లు చేయటం బాగుంటుంది . మరో జంట మల్లిఖార్జున రావు , శ్రీలక్ష్మి . స్వర్ణ కమలంలో సాక్షి రంగారావుకి హారతి ఇచ్చినట్లు , ఈ సినిమాలో బట్టల సత్యం కాళ్ళు 10,116 సార్లు కడిగి తర్వాత జన్మలో మంచి మొగుడు కోసం పళ్ళెం , చెంబు పట్టుకుని తిరుగుతూ ఉంటుంది . నవ్వని రోగం ఉన్నవారు కూడా కడుపారా నవ్వాల్సిందే .

పాటలు కూడా బాగుంటాయి . ముఖ్యంగా టైటిల్ సాంగ్ . ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ మామా అంటూ ఇద్దరూ ఒద్దికగా పాడుకుంటారు . అలాగే మరో two-in-one/2+1 పాట అమ్మ నా మువ్వంకాయో గుమ్మత్తే గుత్తొంకాయో పాట హుషారుగా ఉంటుంది .

సాహితి వ్రాసిన గోకులమదిగోనయ్యా గోకుల మది నీదయ్యా పాట రెండో రాజేంద్రప్రసాద్ , అనూషల మీద బాగా చిత్రీకరించారు . కానిస్టేబుల్ కృష్ణయ్య సారాయి తాగి పాడే పాట శివుడో శివుడో కూడా బాగుంటుంది .
జె వి రాఘవులు సంగీత దర్శకత్వంలో జాలాది , డి నారాయణ వర్మ , సాహితిలు వ్రాసిన పాటల్ని బాలసుబ్రమణ్యం , రమణి , శైలజ శ్రావ్యంగా పాడారు . అదే నాకు మండుద్ది అనే డైలాగ్ ఈ సినిమా ద్వారానే జనానికి ఊతపదం అయిపోయింది .

కె ఆర్ విజయ చెల్లెలు కె ఆర్ సావిత్రి కుమార్తె అనూష ఈ సినిమా ద్వారానే తెలుగు తెరకు పరిచయం అయింది . (తరువాత పెద్దగా సినిమాల్లో క్లిక్ అయినట్టు లేదు పాపం)… ఈ సినిమా ప్రధాన పాత్రల్లో మల్లికార్జున రావు , సుత్తి వేలు , పొట్టి ప్రసాద్ , కృష్ణ చైతన్య , వై విజయ  తదితరులు నటించారు . తక్కువ మంది తారాగణం , చిన్న బడ్జెట్ , సరదా సరదాగా కామెడీ సినిమాలు తీయటంలో జంధ్యాల , రేలంగి నరసింహారావులు సిధ్ధహస్తులు .

తెలుగులో హిట్టయిన ఈ సినిమా కన్నడంలో శశికుమార్ , నిరోష , తార , షబ్నంలతో రీమేక్ అయింది . తమిళంలో ఆనంద్ బాబు , రోహిణి , వైదేహి , దేవిప్రియలతో రీమేక్ అయింది. సినిమా యూట్యూబులో ఉంది . హాస్య రస ప్రియులు చక్కగా , హేపీగా చూడొచ్చు …..

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హిందీ రాముడికన్నా మన తెలుగు రాముడే బాగున్నాడు..!!
  • హీరో రాజేంద్రప్రసాద్ మరో పెళ్లాం… కానీ పెద్దగా అచ్చిరాలేదు పాపం…
  • ఇప్పుడంటే సిలిం‘డర్’… కానీ అప్పట్లో బాబును గెలిపించిన గ్యాస్ బుడ్డి…
  • ఎస్ ‘సర్’… బెంగాల్‌లో అరాచకం సుప్రీం కోర్టుకూ అర్థమైంది..!
  • Narcissistic Injury…. కేజ్రీవాల్ మానసిక సమస్య… రాఘవ్ చద్దా తొలగింపు…
  • ఫాఫం పాడి కౌశిక్..! చివరకు రెంటికి చెడ్డ రేవడి ఐపోబోతున్నాడా..?!
  • దొందూ దొందే…! గ్యాండ్ లీడర్ తరువాత ఎవరికి వారే… దూరం- వైరం..!!
  • ‘బడా సాహెబ్’కు తలొగ్గలేదు… సవాల్ చేసి వణికించాడు కూడా…
  • అమరావతి..! పాత చట్టానికి సవరణలు కూడా మీ ఇష్టమేనా బాబూ..!?
  • రేవంత్ బాటలో మోడీ..! సోషల్ మీడియా విషానికి విరుగుడు మంత్రం..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions