మన డర్టీ టీవీ సీరియల్స్ సంగతి తెలిసిందే కదా… అత్త అంటే పైశాచికత్వానికి ఐకాన్ చేసేశాయి… ఏ సీరియల్ చూసినా అవే కథలు… కోడల్ని చంపేయడానికి కొత్త కొత్త క్రియేటివ్ ఐడియాలు, కడుపులు పోగొట్టడం, మరీ కొన్ని సీరియల్స్‌లోనైతే పాత తెలుగు సినిమాల్లాగా ఫ్లోర్ మీద నూనె పోయడాలు… అబ్బో, ఏ సీరియల్ చూసినా అది హైదరాబాద్, జవహర్‌నగర్ డంపింగ్ యార్డే…
ఈ పైత్యాలకు తోడు కథలు, నవలలు, వెబ్ సీరీస్, సినిమాలు… ప్రతి క్రియేటివ్ ప్రక్రియా అత్తంటే ఓ పిశాచిలాగే చూపిస్తోంది… నిజానికి కోడళ్ల చేతుల్లో కుమిలిపోతున్న అత్తలెందరో… ఈ మూర్ఖులకు వాళ్లు కనిపించరు… ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… ఈనాడులో ఓ వార్త కనిపించింది నిన్న… నిజానికి అది ఈటీవీ భారత్ ప్రసారం చేసింది… బాగుంది… మిగతా వాళ్లకు ఇలాంటి వార్తలు ఎందుకు కనిపించవు..?
నిజానికి సొసైటీలోకి పాజిటివ్ వైబ్స్ పంపించడానికి… సోకాల్డ్ మన సీరియల్స్, సినిమాలు ప్రసారం చేసే విషానికి విరుగుడుగా ఇలాంటి వార్తలు పనిచేస్తాయి కదా… (ఈ వార్తలో ఫస్ట్ వాక్యంలోనే అత్తాకోడళ్లంటే గిల్లికజ్జాలు అనే పదాల ప్రయోగం ఆప్ట్‌గా లేదు…) కానీ వార్త చదవండి ఓసారి…
Ads
ప్రభా కాంతిలాల్ మోటా అని 70 ఏళ్ల వృద్ధురాలు… ముంబై… కోడలి పేరు అమిషా… వయస్సు 43… అనారోగ్యంతో కిడ్నీ పాడైంది అమిషాకు… భర్త తన కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చాడు… కానీ తనకు సుగర్… ఆపరేషన్ క్లిష్టం… దాంతో అత్త ముందుకొచ్చింది… తన కిడ్నీ ఇవ్వడానికి అంగీకరించింది… కానీ ఆమె వయస్సు పెద్దది, వైద్యులు కూడా డిస్కరేజ్ చేశారు…
నాకు బీపీలు, సుగర్లు లేవు, ఆరోగ్యంగా ఉన్నాను… నా కొడుకు, నా కోడలు సుఖంగా ఉంటే చాలు అని అత్తగారే ఉల్టా కౌన్సిలింగ్ చేసింది కుటుంబ సభ్యులకు, డాక్టర్లకు… ‘నా కోడలు కాదు ఆమె… నా బిడ్డ… బిడ్డ ఆరోగ్యం అమ్మ బాధ్యతే కదా’ అన్నదామె… ఆపరేషన్ జరిగింది… పది మందీ చప్పట్లు కొట్లారు… అత్తవు కాదమ్మా, నిజంగానే నువ్వు అమ్మవు అని అభినందించారు…
ఆపరేషన్ అనంతరం ఆమె ఇంటికి వస్తే పండుగ జరిపారు… ఘనంగా స్వాగతం పలికారు… ఇదంతా నెట్టింట్లో వైరల్… ఐనాసరే, మన మీడియాకు మాత్రం కనిపించలేదు… కనిపించదు… ఇదొక దరిద్రం… తెలుగు టీవీ సీరియళ్లను మించిన దరిద్రం… ఇలాంటి వార్తలు, ఫోటోలు సొసైటీలోకి ఎంత మంచి సంకేతాల్ని పంపిస్తాయో కూడా సోయి లేదు మన మీడియాకు…!!
Share this Article