మొన్న కామారెడ్డిలో ఏం జరిగింది..? ఇద్దరు సీఎం అభ్యర్థులు తలపడ్డారు… గజ్వెల్‌లో ఏం జరిగింది..? ఇద్దరు సీఎం అభ్యర్థులు తలపడ్డారు… ఒక సీఎం అభ్యర్థి కేసీయార్ ఒకచోట మాత్రమే గెలిచాడు, కానీ సీఎం కాలేకపోయాడు… ఒక సీఎం అభ్యర్థి గెలవకపోయినా సరే సీఎం అయిపోయాడు… కానీ భలే పోటీ జరిగింది… పెద్ద నాయకులు కదా, చాలా చాలా ప్రాధాన్యాంశాలు చర్చకు వచ్చాయి, గుడ్…
ఇక లోకసభ పోటీలకు వద్దాం… మొదట సోనియాను తెలంగాణలో పోటీచేయాలని కోరుతూ ఓ తీర్మానం చేశారు, నిజానికి ఆమె పోటీకన్నా ఆమె పట్ల విధేయత ప్రకటన అది… తన వయస్సు, తన అనారోగ్యం కారణంగా ఆమె ఈసారి ఎక్కడా పోటీలోనే ఉండకపోవచ్చు… ఒకవేళ నిజంగానే పోటీకి వచ్చే పక్షంలో, గతంలో ఇందిరాగాంధీ పోటీచేసిన మెదక్ నుంచి పోటీచేస్తే సెంటిమెంట్ పరంగా బాగుంటుందనే సూచనలు వచ్చాయి…
నో, నో, ఒకవేళ ఓడిపోతే పరువు పోతుంది, తెలంగాణ కాంగ్రెస్ తలెత్తుకోలేదు, సో… కాంగ్రెస్ బలంగా ఉన్న నల్గొండ లేదా ఖమ్మం నుంచి పోటీ చేయిస్తే సేఫ్ అనే సూచనలూ వచ్చాయి… బాగానే ఉంది… కానీ ఓ ఫైటింగ్ స్పిరిట్ చూపించాలంటే ఆమెను మెదక్ నుంచే పోటీలో ఉంచితే బెటర్… ఎందుకంటే, అక్కడి నుంచి కేసీయార్ లోకసభకు పోటీచేస్తాడని వినిపిస్తోంది…
Ads
తనే ఓ జాతీయ పార్టీ పెట్టేసి… కాంగ్రెస్, బీజేపీల తాటతీస్తాను, గాయిగత్తర లేపుతాను అన్నాడు కదా… అఫ్‌కోర్స్, ఉన్నదే ఊశిపోయింది, అది వేరే సంగతి… మళ్లీ బీఆర్ఎస్ పేరు మార్చుకుని, పాత తెలంగాణ రాష్ట్ర సమితి అని పెట్టుకుంటే… పాత ఆత్మ శాంతిస్తుంది… జనమూ హర్షిస్తారు… నేషనల్ లెవల్ యాక్సెప్టెన్స్ కేసీయార్‌కు అసాధ్యం కాబట్టి ఉన్న బుడ్డగోచిని జాగ్రత్తగా కాపాడుకుంటే చాలా బెటర్ అనే సూచనలూ ఉన్నాయి… ఏకంగా సోనియాతోనే మెదక్‌లో పోటీపడితే ఆ లెవల్ వేరే ఉంటుంది…
ఇక్కడ మరో సంగతి ఉంది… ఆమెను మల్కాజగిరి నుంచి పోటీచేయిస్తే బెటరని మరో సూచన వినవస్తోంది… అది నానాజాతిసమితి… దేశంలోకెల్లా పెద్ద నియోజకవర్గం… అనేకవర్గాల ప్రజలున్నారు… ఒకరకంగా దేశ వైవిధ్యానికి ప్రతీక… పైగా మొన్నటిదాకా రేవంతుడి స్వస్థానం… కాస్త కష్టపడితే సోనియాకు గెలుపు కిరీటం పెట్టొచ్చు… సరిగ్గా ఇక్కడే కేసీయార్ పోటీపడినా బాగుంటుంది… మొన్నటి ఎన్నికల్లో హైదరాబాద్, రంగారెడ్డి నుంచే బీఆర్ఎస్ పార్టీ పరువు దక్కించుకుంది…
కాస్త ఇటువైపు దృష్టి మళ్లిద్దాం… బీజేపీకి ఓ జోష్ రావాలంటే, మొన్నటి ఎత్తుగడల్ని తలుచుకుని, ఓసారి లెంపలేసుకుని, బీఆర్ఎస్‌తో తెగదెంపులు చేసుకుని, ఏకంగా మోడీని మల్కాజగిరి నుంచి పోటీచేయిస్తే బెటరని మరో సూచన… ఎందుకంటే..? దక్షిణాదిన బీజేపీకి జోష్ రావాలంటే వారణాసితోపాటు తమిళనాడు నుంచి ఏదో ఒక స్థానంలో తను పోటీ చేయాలని ఇప్పటికే పలు ప్రతిపాదనలు నడుస్తున్నయ్… ఆ తమిళనాడులో ఓడిపోతే పరువు పోతుంది… సో, తను మల్కాజగిరి నుంచి పోటీ చేస్తే బెటర్… తెలంగాణ బీజేపీకి జోష్… పైగా సోనియా, కేసీయార్‌లతో పోటీలో ఓ థ్రిల్ ఉంటుంది… మోడీ భాయ్, వోకేనా…!? అఫ్‌కోర్స్, నా వోటూ ఇక్కడే ఉంది…!!
Share this Article