మొన్న ఓ వార్త… చిన్నగా ఎక్కడో కనిపించింది… నిజానికి పెద్ద వార్తేమీ కాదు… సంగీత దర్శకుడు ఇళయరాజా తన సొంత స్టూడియోలో తన సంగీత దర్శకత్వం పనులు ప్రారంభించాడు అని వార్త సారాంశం… చెన్నైలోని టీనగర్లో ఎంఎం థియేటర్ కొని, దాన్ని రికార్డింగ్ థియేటర్‌గా మలుచుకున్నాడు… దానికి ‘ఇళయరాజా’ అని పేరు పెట్టాడు… అక్కడ ఒక తమిళ సినిమా పాటను బుధవారం రికార్డు చేశాడు… అవును, ఇందులో పెద్ద విశేషమేముంది అంటారా..? ఉంది… ఇళయరాజా చేజేతులా పోగొట్టుకున్న గౌరవం ఉంది… నా ఎదుగుదలకు గుర్తు ఇది, నా ఏళ్ల శ్రమకు వేదిక ఇది, నా జ్ఞాపకాలకు కేంద్రం ఇది వంటి కొన్ని ఎమోషనల్ వాదనలతో… ప్రసాద్ స్టూడియో ఓనర్లతో తగాదా పెట్టుకుని, కోర్టు దాకా వెళ్లి, ఓడిపోయి… మర్యాదను కోల్పోయి, కిక్కుమనకుండా సొంత దుకాణం ఓపెన్ చేశాడు… అయితే…?
మొన్నమొన్ననే కదా తను కోర్టులో ఓడిపోయి, ప్రసాద్ స్టూడియో నుంచి తన సామాను తెచ్చుకున్నది… మరి ఇంత వేగంగా, రోజుల్లోనే ఒక థియేటర్ కొనడం, రికార్డింగ్ స్టూడియోగా మార్చుకోవడం, అప్పుడే ఓ పాటను రికార్డు చేసుకునేలా తీర్చిదిద్దాడా..? అసాధ్యం కదా…! అంటే చాలా రోజులుగా తను సొంత రికార్డింగ్ స్టూడియో పనుల్లో ఉన్నాడు… ఐనా సరే, ప్రసాద్ స్టూడియో వాళ్లను కెలికాడు, సాధ్యం కాని కోరికను ముందు పెట్టాడు… వామ్మో, ఇళయరాజా అంటే ఏమో అనుకున్నాం గానీ… మహాముదురే… ఎందుకంటే… మొన్నటి పంచాయితీ గురించి సంక్షిప్తంగా చెప్పుకోవాలి… ఎల్వీ ప్రసాద్ బతికి ఉన్నప్పుడు సంగతి… అప్పట్లో మరీ ప్రతిదానికీ లిఖిత పూర్వక ఒప్పందాలు ఉండేవి కావు… మాట మీద నడిచిపోెయేవి… తన స్టూడియోలో ఓ గదిని చూపించి, ఇళయరాజాను వాడుకో బ్రదర్ అన్నాడు… రూం నంబర్ వన్… అదే క్రమేపీ ఇళయరాజా రికార్డింగ్ థియేటర్ అని పిలిపించుకుంది…
Ads
మూడున్నర దశాబ్దాల క్రితం నాటి మాట ఇది… అప్పట్లో ఈయన ఫుల్ బిజీ… స్టూడియో బిజీ… బోలెడు సినిమాలు… రికార్డింగులు, సిట్టింగులు… ఈయన అవసరం వాళ్లకుంది… వాళ్ల అవసరం ఈయనకుంది… సత్సంబంధాలున్నయ్… కాలం గిర్రున తిరిగింది… ఆ స్టూడియో పాతబడింది, ఇళయరాజా కూడా పాతబడ్డాడు… రియల్ ఎస్టేట్ జోరు పెరిగింది… ఇప్పుడు పెద్ద పెద్ద రికార్డింగ్ స్టూడియోల కాలం కాదు కదా… పైగా చెన్నైలో ఇండస్ట్రీయే కుదించుకుపోయింది… ఈ స్థితిలో ఎల్వీ ప్రసాద్ వారసులు ఓ ఐటీ కంపెనీకి లీజుకివ్వాలని అనుకున్నారు… వాళ్ల ఆస్తి వాళ్లిష్టం… కానీ ఇళయరాజా కొర్రీలు పెట్టాడు, ఆ రూంతో తన అనుబంధాన్ని వినిపిస్తూ కథలు చెప్పసాగాడు… వాళ్లకు చిరాకెత్తి, ఆ గదికి తాళం వేసి, ఫోఫోవయ్యా అన్నారు… వాళ్ల దృష్టిలో ఓ హార్మోనియం పెట్టె, ఓ తబలా, ఓ వీణ… దీనికోసం ఈ మొత్తం ఆస్తిని ఏమీ చేయకుండా వదిలేయాలా..?
వాళ్లు స్టూడియో గేటు తొక్కనివ్వలేదు… దాంతో ఈ పంచాయితీ ఏమిటో తేల్చండి అని కోర్టుకెక్కాడు ఇళయారాజా… నిజానికి అది తన ఆస్తి కాదు, ఇన్నేళ్లూ అప్పనంగా వాడుకున్నాడు… ఆ లీజు లెక్కలేస్తే ఇళయరాజాకు చుక్కలు కనిపిస్తాయి… కానీ తనకే 50 లక్షల్ని ప్రసాద్ వారసుల నుంచి ఇప్పించాలని డిమాండ్ చేశాడు, ఎందుకయ్యా అంటే, తనను మానసికంగా క్షోభ పెడుతున్నందుకు అట…! ఈయన వాదనతో కోర్టుకు కూడా చిరాకెత్తి… నీకు ఒక్క పూట టైమిస్తున్నాం, వెళ్లి, నీ సామాను తెచ్చేసుకో అని చెప్పింది… ఆ ఒక్క పూట అనుమతిస్తామని ప్రసాద్ వారసులు చెప్పారు… అప్పటికే సంగీత పరికరాలను ఏదో గోదాములో పడేశారు… ఇక చేసేదేమీ లేక, అవి తీసుకుని, వచ్చేశాడు… విషయం ఏమిటంటే..? ఎలాగూ అది తనది కాదని తెలుసు… ఈ చిన్న గది కోసం అంత పెద్ద స్టూడియోను ఖాళీగా ఉంచరనీ తెలుసు… తను సొంతంగా రికార్డింగ్ స్టూడియో ఏర్పాటు చేసుకుంటున్నాడు కూడా… ఐనా సరే, వాళ్ల జోలికి ఎందుకు వెళ్లినట్టు..? ఇండస్ట్రీలో పరువు ఎందుకు కోల్పోయినట్టు..? పేరుకే లబ్దిప్రతిష్టులు గానీ, కొందరు కొన్ని విషయాల్లో మరీ లుబ్ద ప్రతిష్టులే సుమా…!!
Share this Article