ఈనెలను విడిచిపెట్టండి… ఇక మార్చి, ఏప్రిల్, మే నెలల్లో తెలుగు ప్రజలు కనీసం 1500 కోట్లను వెచ్చిస్తే గానీ పెద్ద హీరోలను సంతృప్తిపరచలేరు… నిజానికి నాగార్జున, బాలయ్య, బన్నీ నయమేమో… కరోనా గిరోనా జాన్తానై అంటూ మార్కెట్‌లోకి వచ్చేశారు… ఆ రిస్క్‌కు మంచి ఫలితం పొందారు… కరోనా పేరిట పదే పదే వాయిదాలు వేస్తూ, మార్కెట్‌లో అడుగుపెట్టడానికి జంకుతున్న పలు పెద్ద సినిమాలు వచ్చే మూడు నెలల్లో పలకరించనున్నయ్… పైగా అవీ ఓటీటీ బాపతు సరుకు కాదు…
థియేటరా, ఓటీటీయా… వేదిక ఏదయితేనేం..? సినిమా రిలీజ్ చేశామా, జనం చూశారా లేదా అని దూకడానికి వాళ్లు ‘సూర్య’ టైప్ కూడా కాదు… ఈమధ్య మనవాళ్లు ప్రతిదీ సౌత్ భాషల్లో డబ్ చేసేసి, వీలయితే హిందీలో కూడా తర్జుమా చేసేసి, పాన్ ఇండియా అంటూ రిలీజ్ చేసేస్తున్నారు… పుష్ప సినిమాకు ఈ టెక్నిక్ భలే క్లిక్కయింది కూడా… హిందీలో దాదాపు వంద కోట్లు కొల్లగొట్టింది, హిందీ హీరోలకే అసూయ కలిగించే వసూళ్లు…
ఒక్కొక్క సినిమాను తెలుగు రాష్ట్రాలు ప్లస్ మూడు ఏరియాలు కలిపి దాదాపు 80 కోట్ల నుంచి 100 కోట్ల దాకా థియేటర్ హక్కుల్ని అమ్ముతున్నారు… ఆర్ఆర్ఆర్ వంటి ఇంకా భారీ రేంజ్ సినిమా అయితే 150 కోట్ల దాకా… ఖర్చులు, డిస్ట్రిబ్యూషన్ కమీషన్, టాక్సులు కలిపి బ్రేక్ ఈవెన్ కావాలంటే, వచ్చే 3 నెలల్లో విడుదలయ్యే భారీ సినిమాలన్నింటికీ కలిపి, ప్రేక్షకులు దాదాపు 1500 కోట్ల దాకా వెచ్చిస్తే సాధ్యం కాదని ఓ అంచనా… పైగా అందరూ పేరున్న పెద్ద హీరోలే… జూనియర్ ఎన్టీయార్, రాంచరణ్, చిరంజీవి, యశ్, మహేశ్‌బాబు, వెంకటేశ్, వరుణ్‌తేజ, విజయ్ దేవరకొండ, ప్రభాస్ వంటి హీరోలు…
Ads
భీమ్లా నాయక్, ఆచార్య, సర్కారువారి పాట, కేజీఎఫ్-2, లైగర్, ఘని, ఆర్ఆర్ఆర్, రాధేశ్యాం, ఎఫ్-3… ఇలాంటి పెద్ద సినిమాలు రావల్సి ఉంది… ఇవి గాకుండా సరిగ్గా టైమ్‌కు తమిళం నుంచి, మలయాళం నుంచి డబ్బింగ్ రుద్దుకుని హడావుడిగా వచ్చేసే సినిమాలు సరేసరి… ఇక ఓవర్సీస్, ఓటీటీ విక్రయాలు, టీవీ రైట్స్ ఎట్సెట్రా కూడా లెక్కేసుకుంటే వీటి మొత్తం వ్యాపార టర్నోవర్ ఇంకా ఏ రేంజ్‌కు పెరిగిపోతుందో అర్థం చేసుకోవాల్సిందే…
ఏపీలో టికెట్ల ధరలు అంశం మెల్లిగా పక్కకుపోయింది,.. కొత్త జిల్లాలు, పీఆర్సీ వంటి కొత్త సమస్యలు, చర్చలతో ప్రభుత్వ ప్రయారిటీలో ఈ టికెట్ల అంశం ఎక్కడికో జారిపోయింది… ఆర్జీవీ ఓ మంత్రిని కలవడం ఓ ప్రహసనం… చిరంజీవికి జగన్ మంచి మర్యాద ఇచ్చి, కాసేపు చర్చించినా సరే, అదేమీ ఫలించలేదు… ఈ టికెట్ల ధరలు ఇలాగే ఉంటే వసూళ్లపై ప్రభావం పడుతుందనేది ఇండస్ట్రీ పెద్దల కలవరం… కానీ అది నిజం కాదు…
ఈ టికెట్ల రేట్లతోనే అఖండ, పుష్ప వసూళ్లను దున్నేశాయి కదా… జగన్ ప్రభుత్వం మీద కస్సుబుస్సుమన్న నాని సినిమా శ్యామ్ సింగరాయ్, జగన్ దోస్త్ నాగార్జున సినిమా బంగార్రాజు కూడా బ్రేక్ ఈవెన్ అంటున్నారు… ఎలాగూ కీలక రాష్ట్రాలు కరోనా ఆంక్షల్ని తొలగిస్తున్నాయి… ఇంకేం, రెండు మూడు నెలలపాటు థియేటర్ల వద్ద జాతరలే… అఫ్‌కోర్స్, ప్రేక్షకుల్ని ఆకర్షించే ఎలిమెంట్స్ ఉంటేనే సుమా…
Share this Article