Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిజంగా పీడన నుంచి విముక్తమయ్యాయా..? పంద్రాగస్టు వేళ ఓ ఆత్మావలోకనం…

August 15, 2023 by M S R

India – Independence: మహాత్మా మళ్లీ జన్మిస్తావా? (ఇరవై ఆరేళ్ల కిందట 1997లో స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల వేళ ఒక పత్రికలో ప్రచురితమయిన సంపాదకీయ వ్యాసమిది. వజ్రోత్సవాలు దాటి వచ్చిన 2023లో ఒకసారి నెమరువేత)

నాగరికత నడక నేర్చుకుంటున్న రోజుల్లో... ప్రపంచం అబ్బురపడేలా భారతీయ చరకుడు వైద్యానికి భాష్యం చెబితే మనకెందుకు? చాణక్యుడు అర్థశాస్త్రానికి అర్థం చెబితే మనకెందుకు? అంతకుముందు నుంచే ఉన్న వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, సకల శాస్త్రాల గురించి మనకెందుకు?

స్వాతంత్య్రం వచ్చింది. వచ్చి యాభై ఏళ్లయింది. అది చాలు మనకు అంతకు మించి ఏ చరిత్రా లేనట్లు ఉత్సవాలు జరుపుకోవడానికి. అదీ ఒకరోజా రెండ్రోజులా? ఈ పంద్రాగస్టునుంచి పై ఏడు ఆగస్టు పదిహేను వరకు స్వతంత్ర భారతికి స్వర్ణోత్సవాల సంబరాలతో క్షణం తీరిక ఉండదు. అప్పుడెప్పుడో బ్రిటీషు వాళ్ల చేతుల్లో చిక్కుకున్నప్పుడు దేశభక్తులు భారతమాతను రక్షించారు.  ఆ సమరంలో సర్వస్వం కోల్పోయిన వాళ్లు, ప్రాణాలనే కర్పూరంగా వెలిగించి భారత భారతికి హారతి పట్టినవాళ్లు కోకొల్లలు.

Ads

ఏ జైలు రికార్డుల్లోనో, ఏ డాక్యుమెంట్లలోనో పేరున్న వాళ్ళు ప్రభుత్వం దృష్టిలో సమరయోధులు. ఉంటే వారికి, లేకుంటే వారి కుటుంబం వారికి పెన్షన్ వస్తోంది. రేప్పొద్దున బ్రిటీషువాడు మూటముల్లె సర్దుకుని దేశానికి స్వాతంత్య్ర ఇస్తాడు…ఎక్కడో ఒకచోట పేరుంటే పెన్షన్ వస్తుందని పోరాటంలో పాల్గొని ఉండరు. వారి ఖర్మకొద్దీ ఏ సాక్ష్యమూ లేక ఆపై ఉద్యమంలో పాల్గొన్నట్లు ప్రభుత్వం దరఖాస్తుఫారంలో నిరూపించుకోలేక కరిగి కన్నీరైన వాళ్లు మాత్రం కోకొల్లలుగా ఉండి ఉంటారు.

ఒకరా ఇద్దరా? యావజ్జాతి చైతన్య తరంగమై ఎగసిపడింది. రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్యానికి తెరపడింది. అర్ధరాత్రి స్వాతంత్య్రం భళ్లున తెల్లారేసరికి సరికొత్త రంగుల లోకంలోకి తీసుకువెళుతుందనుకున్నారు. ఊరూవాడా, నింగీనేల ఏకం చేస్తూ స్వేచ్ఛాగానం చేశారు. ఎవరెస్టు తలదన్నే ఆశయాలతో రాజ్యాంగం రాసిపెట్టుకున్నాం ప్రాథమిక హక్కులన్నాం – ఆదేశిక సూత్రాలన్నాం- పంచవర్ష ప్రణాళికలన్నాం – ఇంకా ఎన్నెన్నో అనుకున్నాం. తెల్లవాళ్లు నాలుగు రైల్వే లైన్లు, టెలిఫోన్ తీగలు ఇంకా ఏవేవో వేస్తే వేశారు కానీ…దేశాన్ని కొల్లగొట్టి పోయారన్నది మాత్రం నిజం.

ఉద్యోగం కోసం దేశమొచ్చి తుది శ్వాస దాకా భారత ప్రజలకోసం పాటుపడిన థామస్ మన్రోలు, మన వేమన్నలను మనమే గుర్తించకపోయినా భాష నేర్చుకుని మన కళ్లు తెరిపించిన బ్రౌన్ లు ఇంగ్లీషు వాళ్లేనంటే మనకు మింగుడు పడదు. డయ్యర్ను తిట్టడంలో ఉన్న ఆనందం మన్రోను పొగిడితే వస్తుందా? ఏదేమైతే మనకెందుకు? రాత్రిపగలు, నిద్రాహారాలు అన్నీ మరచి పోరాడాం. అనుకున్నది సాధించాం. పరాయి పాలన పీడ విరగడై మువ్వన్నెల జండా సిగలో రెపరెపలాడింది. సంతోషం.

అప్పుడు…

🟆 పొట్ట చేత పట్టుకుని వచ్చి మమ్మల్ను కట్టి పడేస్తారా అంటూ తెల్లదొరలపై మొదట తిరుగుబాటు చేశాం.
🟆 వందేమాతరం అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించాం.
🟆 ఎన్నాళ్లీ బానిస బతుకులని హోంరూల్ కావాలని ఉద్యమించాం.
🟆 సహాయ నిరాకరణనే తిరగులేని అస్త్రంగా సంధించాం.
🟆 ఇవి చట్టాలా? చట్టుబండలా? అంటూ శాసనోల్లంఘన చేశాం.
🟆 మా గడప తొక్కి మమ్మల్నే నడివీధిన నిలబెడతారా? అంటూ క్విట్ ఇండియా అన్నాం.

ఇప్పుడు…

🟆 మనకోసం మనమే ఎన్నుకున్న నల్లదొరలు ఎగబడి అవినీతి గడ్డి కరుస్తుంటే చలనం లేకుండా చూస్తూ ఉన్నాం.
🟆 తప్పనిసరైతే తప్ప జాతీయ గీతం పాడ్డానికి నోరు విప్పలేకపోతున్నాం.
🟆 ఎక్కడికక్కడ జాతులకో, ప్రాంతాలకో స్వయం పాలన కావాలని ఉద్యమిస్తున్నాం.
🟆 ప్రభుత్వం బూజుపట్టే ఫైళ్లతో సహాయ నిరాకరణ చేస్తున్నా సహిస్తున్నాం.
🟆 చట్టం కలవారి చుట్టమై వారాడించినట్లల్లా ఆడుతున్నా శాసనం ముందు అందరూ సమానమేనన్న చిలక పలుకులు పలుకుతున్నాం.
🟆 తెల్లవాళ్లు పరాయి వాళ్ళు కాబట్టి తిరుగుబాటు చేసి తరిమిపారేశాం. నల్లవాళ్లు మనవాళ్లే కాబట్టి అయిన వాళ్లు ఏం చేసినా చూసి చూడనట్లు ఉండాలన్న ధర్మంకొద్దీ ఊరకున్నాం.

మిగిలిన సహాయ నిరాకరణలు, శాసనోల్లంఘనలు, క్విట్ ఇండియాలు అప్పుడూ ఉన్నవే- ఇప్పుడూ ఉన్నవే- ఏదో ఒక రూపంలో రేప్పొద్దునా ఉండేవే. ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి మనది కేరాఫ్ అడ్రస్. ఎన్నో దేశాల ప్రజాస్వామ్య వ్యవస్థలను కాచి వడపోసి భారత ప్రజాస్వామ్యానికి ఓ రూపమిచ్చారు.

రాజ్యాంగం మొదటి పేజీల్లో ఆదేశిక సూత్రాల ఆశయాలు చదివితే చాలు- ఒళ్లు పులకించి ఇంత బాధ్యత వహించే ప్రభుత్వం చల్లని నీడలోనా మనం ఉన్నది! అని నిద్రాహారాలు లేకుండా కూడా బతికేయవచ్చు.  అందరికీ ఆహారం- అందరికీ విద్య- వీలైతే నిర్బంధ విద్య- అందరికీ ఇళ్లు- అందరికీ ఆరోగ్యం- అందరికీ అన్ని– ఇన్ని అని ఆ ఆశయాలు చెప్పడానికి వేనోళ్లు చాలవు. కానీ ఆచరణలో జరిగిందేమిటి? ఆవే ఆశయాలు, అవే ఆదర్శాలు ఇప్పటికీ ఉన్నాయి. అవే సమస్యలు ముందుకంటే మరింత ముందుకొచ్చాయి.

పంచవర్ష ప్రణాళికలతో ప్రగతి పంచకళ్యాణి రథమెక్కి మనోవేగంతో దూసుకుపోతుందన్నారు. ఆ రథమెక్కడుందో వెతకాలిప్పుడు. –ప్రజాస్వామ్యం మూడు పువ్వులు ముప్పయ్యారు  కాయలవుతుందన్నారు. దానికి పాలన, శాసన, న్యాయ వ్యవస్థలు మూడూ మూల స్తంభాలని చెప్పుకున్నాం. అదే గనక నిజమైతే ప్రస్తుతం మన ప్రజాస్వామ్య పెను భవనం ఉంటున్నది ఒంటికంబం మీద. పాలన పగ్గాలు తప్పి దశాబ్దాలవుతోంది. రాజకీయం ఏనాటినుంచో అరాచకంగా పేరు మార్చుకుని ఉనికిని కాపాడుకుంటోంది. న్యాయ వ్యవస్థ ఒకటే ములుగర్రతో మిగతా రెండు వ్యవస్థలను నడుపుతోంది. ప్రజాప్రయోజన వ్యాజ్యమనో, మరొకటనో కోర్టుల చొరవ ఎక్కువైనా ప్రజల దృష్టిలో న్యాయమూర్తులే ఇప్పుడు హీరోలు.

రైలు యాక్సిడెంటయిందని తెలిసి, ఆ యాక్సిడెంట్ కు ప్రత్యక్షంగా తాను కారణం కాకపోయినా మంత్రి పదవికి రాజీనామా చేసేంత అమాయక లాల్ బహదూర్ శాస్త్రులు ఇప్పుడు ఎవ్వరూ లేరు. ఒక్కసారి గద్దెనెక్కాక ఏనేరారోపణ వచ్చినా, ప్రతిపక్షాలు, జనం కాదు పొమ్మన్నా జైల్లో ఉండో, భార్యను సీటు మీద కూర్చోబెట్టో అధికారం చెలాయించే లాలూలే ఇప్పుడు జాతికి నాయకులు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ మెజారిటీ ప్రాణవాయువు దొరక్క పక్షానికే పక్కకు తప్పుకుంటుంది. అతుకుల బొంత పార్టీలు అరగంటకోసారి ప్రధానమంత్రిని మార్చినా మహద్భాగ్యంగా జనం భరిస్తూ ఉంటారు.

ఏది మెజారిటీ? ఏది కాదు? మన వోటింగ్ విధానమే అతుకుల బొంత. ఉన్నవి వంద వోట్లు. పోలైనవి 85. దిక్కున్న పార్టీకి 25, దిక్కులేని మరో మూడు పార్టీలకు చెరో 20 వచ్చాయి. 25 ఓట్లు వచ్చిన పార్టీ మారాజుగా గెలిచినట్లు. ఒక రకంగా డెబ్బయ్ అయిదు, సరిగ్గా చెబితే అరవై శాతం మంది తిరస్కరించిన అభ్యర్థి ఎలాగెలిచినట్లు? గెలిచినా ఆ మెజారిటీకి అర్థమేముంది? ఒక్కసారి వోటు వేయడమే వోటరు వంతు. ఆపై ప్రజాప్రతినిధి బిళ్ల తగిలించుకున్న నాయకుడు ఆడింది ఆట- పాడింది పాట. ఎన్నికలకు ముందు చేసిన ప్రమాణాలు అమలుచేసి తీరాలని రూలేం లేదు.

అసలు ఎన్నికలే మన ప్రజాస్వామ్యంలో ఓ పెద్ద ప్రహసనం. స్వేచ్ఛగా, ప్రశాంతంగా రిగ్గింగ్ చేసుకునే వేనవేల ప్రాంతాలను మహామహా శేషన్లే ఏమీ చేయలేకపోయారు. వోటరుకొక్క పోలీసును పెట్టినా అక్రమాలు ఆగుతాయన్న గ్యారెంటీ లేని స్థాయికి ఏనాడో వచ్చేశాం. ఇక ఇప్పుడేం చేస్తాం? పేదవాడి బతుకు దీపానికి చేతులు అడ్డుపెట్టి రక్షించే వాడు లేడు కానీ నాయకుల భద్రతకు స్థాయుల వారీగా స్పెషల్ ప్రొటెన్షన్ గ్రూపులుంటాయి. 

అత్యున్నత స్థానాల్లో నాయకులందరూ అవినీతి ఆరోపణల బురద పులుముకుంటున్నవారే. రాజకీయ తీర్థం పుచ్చుకునే రోజు గరీబులు- కుర్చీ మీద కూర్చోగానే మహరాజులు. శమంతక మణి సైతం ఇవ్వలేనన్ని నగలు జయలలితల దగ్గర ఉంటాయి. వందల కోట్లను సైతం గడ్డి మింగేస్తుంది. బ్యాంకులను హర్షద్ లు మింగేస్తారు. బోఫోర్స్ లు, టెలికామ్ లు, సెయింట్ కిట్లు, హవాలాలు, యూరియాలు ఒకటేమిటి అవినీతి – లంచగొండితనం జాతి పతాకంగా, కుంభకోణాలే జాతీయ గీతంగా మారినా మనకు పట్టదు- చీమకుట్టినట్లయినా ఉండదు.

ఆటలా- పాటలా ఎక్కడ మన ఉనికి?
భారత్ క్రికెట్ మ్యాచులుంటే టి.వి. లకు అతుక్కు పోయేంత దేశభక్తి మనది. వరల్డ్ కప్ పోటీలో చేతిలో బ్యాటు జారిపోయి నిలువెల్లా నీరుగారిపోయిన క్రికెటర్లను మనం ఏం చేశాం? నెత్తిన పెట్టుకుని ఇంకా ఊరేగుతున్నాం. వాళ్లు కాస్త ‘మ్యాచ్ ఫిక్సింగ్’ బెట్ల కొత్త వ్యాపారానికి వాకిళ్లు తెరిచి ఒడిపోవడానికి పోటీలు పడి రక్తం చిందిస్తున్నారని ఆరోపణలు వస్తున్నా వింటూ విననట్లు ఉంటున్నాం.

పరీక్షలంటే భయపడే వాళ్లెవరు?
బయట మార్కెట్లో సరసమైన ధరలకు కావాలసినంత ముందుగా ప్రశ్నపత్రాలు దొరుకుతున్నాయి. ఫలానా వ్యవస్థ బావుందనో, ఫలానా రంగం బావుందనో గుండెమీద చేయి వేసుకుని చెప్పగలమా? అవ్యవస్థ వ్యవస్థీకృతమై రాజ్యమేలుతోంటే భారత భారతికి స్వర్ణోత్సవాలొచ్చాయి. సభలో బిల్లులు పాస్ చేయించుకోలేని అసమర్థ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు యాభై ఏళ్ల ఉత్సవాలు రావడం కాకతాళీయమే కావచ్చు కానీ పొరుగు దేశాల ముందు స్వర్ణోత్సవాల సందర్భంగా పోయేది మన పరువే. కాశ్మీరం మీద, పే కమీషన్ మీద దేశాన్నేలే గుజరాల్ ఒకసారి ఏమంటారో రెండోసారి అదే మాటంటారని గ్యారెంటీ లేదు.

నల్లడబ్బును వెలికితీసి దేశాన్ని ఆదుకోండని ప్రభుత్వమే ఓ స్వచ్చంద పథకం పెట్టిందంటే దేశంలో ఉన్న నల్ల డబ్బు గురించి ప్రభుత్వానికి ఎంత నమ్మకం ఉండాలి? ఎంత ఆశ ఉండాలి? తరచి చూస్తే భారత భారతి తనువంతా గాయాలే. కాశ్మీరం ఆమె సిగలో మంచుపువ్వట. మల్లెపువ్వట. వర్ణనకేం తక్కువలేదు కానీ అక్కడ కనిపించే దృశ్యం మాత్రం మంచుకొండల్లో ఆరని మంటలు. కన్యాకుమారి పాదాల చెంత తమిళ పులుల స్వైరవిహారం. అస్సాంలు, జార్ఖండ్ లు రావణకాష్ఠాలు. దేశ నాయకులుగా కొలిచే వారి మెడలో చెప్పుల హారాలు- దానికి దారుణ మారణ హోమాలు. యాభై ఏళ్ల ప్రస్థానంలో ఏమున్నది గర్వకారణం? ఒక్కటంటే ఒక్కటి చూసి స్వర్ణోత్సవాల నిర్వహణను సమర్థించుకోవడానికి ఉందా? ఉంది.

నల్లడబ్బే జాతిని ముందుకు నడుపుతుందన్న నమ్మకం బలపడినా…
అవినీతి – అక్రమాలే వ్యవస్థ ఊపిరిగా మారినా…
మనం నమ్ముకున్న వ్యవస్థలే మనల్ను నట్టేట ముంచినా…
ఎన్నెన్ని లోపాలు, వైఫల్యాలు ఉన్నా…
ఒక దేశంగా మన ప్రయాణం చిన్నది కాదు. ఒక జాతిగా మనం సాధించినవి కూడా చిన్నవి కావు. చెడును పరిహరించి…మంచిని పట్టుకుని…రేపటి వెలుగులవైపు అడుగులు వేయడమే కర్తవ్యం.

స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…
  • డిస్టర్బింగ్ సీసీటీవీ ఫుటేజీ… కొన్ని జవాబులు దొరకని ప్రశ్నలు కూడా…
  • ‘‘నీ ఏడుపేదో నువ్వేడువు… నాకన్నా ఎక్కువ ఏడువు… నేనేమైనా వద్దన్నానా..?’’
  • అమ్మతనం అంటే అన్నీ సహించడం కాదు… కొన్ని వదిలించుకోవడం కూడా..!!
  • ఆ ఉగ్రవాది కసబ్‌ను కోర్టులో గుర్తించిన ఓ చిన్న పాప మీకు గుర్తుందా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions