మాల్దీవులు కథ ఏమిటి? గత వారం రోజులుగా మాల్దీవుల మీద న్యూస్, ఎలెక్ట్రానిక్, సోషల్ మీడయాలో విపరీతంగా వివిధ కథనాలు వైరల్ అవుతున్న నేపథ్యంలో నా అభిప్రాయాల్ని రెండు భాగాలుగా వివరిస్తాను. మొదటిసారిగా నాకు మాల్దీవుల గురుంచి తెలిసింది 1984 లో. అప్పట్లో ఆంధ్ర ప్రాంతం నుండి సింగపూర్, మాల్దీవులుకి టూరిజం ఎక్కువగా ఉందేది.
1984 లో జపాన్ కి చెందిన ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ పరికరాలు కొనడానికి ఎక్కువగా వెళ్ళేవారు సింగపూర్ కి. కొద్ది మంది మాల్దీవులు వెళ్ళేవారు.
సింగపూర్ లో దొరికినన్ని వెరైటీ ఎలక్ట్రానిక్ గూడ్స్ మాల్దీవులలో దొరికేవి కావు. కానీ మన దేశంలో నెహ్రూ తాలూకు సోషలిస్ట్ ఆర్థిక విధానం వలన విదేశాలలో తయారయిన వస్తువులని అక్కడ కొని మన దేశానికి తెస్తే 180% నుండి 360% వరకు కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి వచ్చేది. అయినా సరే అంటూ ఆనందంగా వస్తువులు కొని పన్నులు చెల్లించి మరీ తెచ్చుకునే వారు.
సింగపూర్ వెళ్ళాలి అంటే మద్రాస్ వెళ్లి శ్రీలంకన్ Air Lines లో టికెట్ బుక్ చేసుకునేవారు… ఎందుకంటే రానూ పోనూ 2800/- ఉండేది అప్పట్లో. నేను 2800/- లతో వెళ్లి వచ్చాను. అఫ్కొర్స్ సింగపూర్ కి షిప్ కూడా ఉండేది కానీ మూడు రోజులు పట్టేది మద్రాస్ నుండి సింగపూర్ కి. ఇక మాల్దీవులు వెళ్ళేవారు త్రివేండ్రం నుండి విమానంలో కానీ కొచ్చిన్ నుండి షిప్ లో కానీ వెళ్ళేవారు.
Ads
అప్పట్లో మాల్దీవుల జనాభా రెండు లక్షల లోపే ఉండేది. విద్యుత్ సరఫరా ఉండేది కాదు కానీ చిన్న చిన్న పెట్రోల్ జెనరేటర్స్ తో షాపులు, హోటళ్ళు నడిపేవారు. ఎక్కువ శాతం టూరిస్టులు భారత్ నుండే ఉండేవారు. విదేశీ టూరిస్టులు తక్కువగా ఉండే వారు. మాల్దీవులు ఎక్కువగా భారత్ మీదనే ఆధారపడి ఉండేది.
బియ్యం, గోధుమలు, మందులు, పెట్రోల్, డీజిల్ భారత్ నుండి దిగుమతి చేసుకునేది. దరిమిలా మాల్దీవుల రాజధాని మాలేలో మన దేశ కరెన్సీ నోట్లను తీసుకునేవారు. మాల్దీవులు ఎక్కువగా కేరళ మీద ఆధారపడి దిగుమతులు చేసుకునేది. శ్రీలంక, భూటాన్, బాంగ్లాదేశ్, నేపాల్ తో పాటు పాకిస్థాన్ లోని కరాచీ, లాహోర్ లలో మన రూపాయలని తీసుకునే వారు. కానీ 2000 వ సంవత్సరం నుండి క్రమేణా మన రూపాయలని తీసుకోవడం తగ్గిపోయింది.
1984 లో నేను సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ తమిళలు నిర్వహించే షాపులలో మన కరెన్సీని తీసుకున్నారు. కానీ ఇంటర్నెట్ విప్లవం తరువాత మార్పు వచ్చింది.
*********
1984 లో ప్రజలు మాల్దీవులు వెళ్లి రావడం వలన ఆ పేరు తెలిసింది నాకు. కానీ 1984 తరువాత 1988 లో ఆసియాలో మాల్దీవుల పేరు వెలుగులోకి వచ్చింది. 1988 లో అప్పటి మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్ గయూంని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించినప్పుడు సహాయం కోసం మొదట శ్రీలంక, పాకిస్థాన్, సింగపూర్ లని కోరాడు కానీ ఆ మూడు దేశాలు ప్రతిస్పందించలేదు.. దాంతో అమెరికా సహాయం కోరాడు కానీ అమెరికా డిగోగార్షియాలో ఉన్న తమ సైనిక స్థావరం నుండి మాల్దీవులు చేరుకోవడానికి రెండు రోజులు పడుతుంది అని చెప్పడంతో బ్రిటన్ ని సహాయం కోరాడు. అప్పటి బ్రిటన్ ప్రధాని మార్గరెట్ థాచర్ మీకు దగ్గరలోనే ఉన్న ఇండియాని సహాయం అడగండి అని సలహా ఇవ్వడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో భారత్ ని అభ్యర్థించాడు.
*********
ఆపరేషన్ కాక్టస్ – Operation Cactus 🌵!
1. మాల్దీవులుకి చాల చిన్న మిలటరీ ఫోర్స్ ఉంది. అదే మిలిటరీ ,అదే పోలీసు పాత్ర పోషిస్తుంది.
2.శ్రీలంకకి చెందిన 80 మంది సాయుధ రెబెల్స్ (PLOTE )తో పాటు మాల్దీవుల పోలీసుల నుండి కొంతమంది కలిసి అధ్యక్షుడు అబ్దుల్ గయూమ్ ని బంధించి అధికారం చేజిక్కించుకోవాలని చూసారు.
3.అప్పట్లో దీనిని సైనిక కుట్రగా ప్రచారం చేశారు కానీ 2,50,000 మంది జనాభా కలిగిన చిన్న దీవి కోసం ఎంత సైన్యం ఉంటుంది? అధికారం కోసం కుట్ర పన్నడంలో లాజిక్ కనిపించలేదు. కానీ పత్రికలలో ప్రచారం జరిగింది. చివరికి అది నిజమే అని తేలింది.
4. అబ్దుల్లా లుతుఫీ (Abdullah Lutufi) మాల్దీవులతో పాటు శ్రీలంకలో వ్యాపారాలు ఉన్నాయి. అబ్దుల్ గయూమ్ ని దించేసి తాను అధ్యక్షుడు అవాలనే ఆశ తో శ్రీలంక తమిళ వేర్పాటువాద సంస్థ ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్గనైజేషన్ తమిళ్ ఈలం’ (PLOTE) తోడ్పాటుతో కుట్రకి పాల్పడ్డాడు.
5. అబ్దుల్ గయూమ్ అభ్యర్థన మేరకు అప్పటి ప్రధాని రాజీవ్ 500 మంది ఆర్మీ పారాట్రూపర్లని మాలే కి పంపించాడు. దీనికి ఆపరేషన్ కాక్టస్ అని పేరు పెట్టారు. మాలే చేరుకున్న రెండు గంటలలోపే భారత పారాట్రూపర్లు రాజధాని మాలే ని తమ అదుపులోకి తీసుకున్నారు.
6. ఒక ఇంట్లో తలదాచుకున్న అబ్దుల్ గయూమ్ ని తిరిగి అధ్యక్షస్థానానికి చేర్చింది భారత ఆర్మీ.
********
ఈ సంఘటన వలన తెలుస్తున్నది ఏమిటంటే 80వ దశకం నాటికే మన దేశం పక్కనే ఉన్న చిన్న దేశాలతో మనకి పెద్దగా సత్సంబంధాలు లేవు అని. అబ్దుల్ గయూమ్ మొదట శ్రీలంక, పాకిస్థాన్ లని సహయం అడిగాడు తరువాత సింగపూర్, అమెరికాలని కోరాడు. చివరగా బ్రిటన్ ని అడిగాడు తప్పితే భారత్ ని అడగలేదు.
బ్రిటన్ ప్రధాని మార్గరెట్ థాచర్ మీకు దగ్గరలోనే ఉన్న ఇండియాని సహాయం అడగండి అన్న తరువాతే మన సహాయం కోరాడు. 1988 లో జరిగిన కుట్ర మూడోది. అంతకు ముందు 1980 లో ఒకసారి, 1983లో రెండోసారి అబ్దుల్ గయూమ్ మీద కుట్ర ప్రయత్నాలు జరిగాయి. మూడు సార్లు కుట్ర జరిగింది అధ్యక్షుడుగా ఉన్న అబ్దుల్ గయూం మీదనే. ఒక్క 1988 లో మాత్రమే గతి లేక మన సహాయముర్ధించాడు…
********
భారత ప్రధాని మోడీ భారత్ పక్కనే ఉన్న దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పడంలో విఫలం అయ్యారు అనే విమర్శ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు ముందు చరిత్ర తెలుసుకోవాలి! ప్రస్తుతం మాల్దీవులతో మన దేశానికి ఎందుకు చెడింది అన్నదాన్ని రెండో భాగంలో వివరిస్తాను…… పోట్లూరి పార్థసారథి…
Share this Article