.
సాధారణంగా సగటు భారతీయుడు పెట్టుబడులకు సంబంధించి చాలా సింపుల్ ఫార్మాట్‌లో ఆలోచిస్తాడు… ధనికులు వేరు… కానీ మధ్య, దిగువ మధ్య తరగతి వాళ్లయితే…
సొంతంగా స్థోమతకు తగినట్టు ఇల్లుండాలి… అది ఫ్లాట్ కావచ్చు, ఇల్లు కావచ్చు… ఇంట్లో ఎంతోకొంత బంగారం ఉండాలి… అది ఆభరణాల కోసమే కాదు, ఆర్థిక భరోసా…
Ads
ఊళ్లో కాస్త పొలం ఉండాలి… ఉన్నది కాపాడుకోవాలి… సిటీల్లో ఉంటున్నాసరే, ఎవరికైనా కౌలుకు ఇచ్చయినా సరే సొంతంగా పొలం ఉండాలి… నగదు చేతిలో ఉంటే బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ చేసుకోవాలి… ఎవరినీ నమ్మలేం… డబ్బు కారణంగా ఎవరినీ దూరం చేసుకోలేం… లేదంటే బంగారం కొని భద్రపరుచుకోవాలి…
వీటికితోడు బీమా ధీమా కోసం ప్రీమియమ్స్… ఇవే కదా… ఉద్యోగులైతే భవిష్యత్తు కోసం ప్రావిడెంట్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు… స్థూలంగా ఇదే భారతీయుడి పెట్టుబడి, ఆర్థిక మార్గం…
ఓ సర్వే చార్ట్ కనిపించింది… సరిగ్గా ఇదే చెబుతోంది… అదే ఇది…
11.1 ట్రిలియన్ డాలర్ల ఆస్తులకు సంబంధించి ఉజ్జాయింపుగా పెట్టుబడుల ధోరణిని క్రోడీకరించిన ఆ సర్వే 50.7 శాతం రియల్ ఎస్టేట్‌లోనే ఉన్నట్టు చెబుతోంది… అంటే ప్లాట్లు మాత్రమే కాదు, పొలాలు కూడా..! 15.5 శాతం బంగారం మీద ఉంది సగటు భారతీయుడి సంపద…
సేమ్, బ్యాంకుల్లో 14 శాతం ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో ఉండగా… బీమా పథకాల్లో 5.9 శాతం, పెన్షన్ ఫండ్లలో 5.8 శాతం, మరో 3.4 శాతం ఎవరినీ నమ్మకుండా నగదుగానే ఉంచుకోవడం… ఆసక్తికరమైన సమీకరణాలు…
నిజానికి కొన్నాళ్లుగా స్టాక్ మార్కెట్ మీద కూడా భారతీయుల ఆసక్తి పెరుగుతోంది… జూదంలాగా మారిన స్టాక్స్ కొనుగోలు, విక్రయాలకన్నా… ఎస్ఐపీ, ఎస్‌డబ్ల్యూపీల మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు… డబ్బు రెడీగా ఉంటే ఎస్‌డబ్ల్యూపీ… నెలనెలా కొంత రికరింగ్ డిపాజిట్ తరహాలో అయితే ఎస్ఐపీ…
మొత్తానికి బ్యాంకుల్నే కాదు… ప్రైవేటు ఆర్థిక సంస్థలను కూడా నమ్ముతున్నారు ఈమధ్య… ఐనాసరే, 4.7 శాతం దాటడం లేదు ఈ పెట్టుబడులు… నమ్మకం లేకపోవడం, రిస్క్ ఎందుకనే భావనతో స్టాక్స్‌కు దూరంగా ఉంటున్నారు ఈరోజుకూ భారతీయులు… నిజానికి ఇది సరైన ఆలోచనా ధోరణి కూడా..!
కొంతకాలంగా మరో ధోరణి కూడా కనిపిస్తోంది… రియల్ ఎస్టేట్‌లో మోసాలు పెరిగాయి… ఆడపిల్లల పెళ్లిళ్ల కోసమో, పిల్లల ఉన్నత చదువుల కోసమో డబ్బు జాగ్రత్తపరచాలి అనుకునే తల్లిదండ్రులు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఎస్ఐపీల మీద డిపెండ్ అవుతున్నారు… రియల్ ఎస్టేట్‌ను నమ్మడం లేదు…
నిజానికి ఫిక్స్‌డ్ డిపాజిట్లు… పోస్టాఫీసు పథకాలతో సహా… వచ్చేది అరకొర వడ్డీ… మహా అయితే 7-9 శాతం మధ్యలో… అదీ సీనియర్ సిటిజెన్లు, ఎక్కువ కాలవ్యవధి అయితే 9 శాతం వరకూ… పైగా టీడీఎస్ కత్తిరింపు సరేసరి… ఐనాసరే, మనవాళ్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీదే గురి, ఆసక్తి… ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు, చేతిలో డబ్బు ఉన్నట్టే అనే భావన…
కొన్నిసార్లు రియల్ ఎస్టేట్ కుప్పకూలుతుంది… ప్రస్తుతం తెలంగాణ మార్కెట్ అదే… అవసరానికి అమ్మలేం, సమయానికి డబ్బు చేతికి రాదు, కొనేవాళ్లే ఉండరు అనే భావన కూడా ఉంది… సంస్థాగత చిట్‌ఫండ్లలో గతంలో పొదుపు ఉండేది… ఇప్పుడదీ తగ్గింది… ప్రైవేటు చిట్టీలను బాగానే నమ్ముతుంటారు, ఎన్నో దివాలా కేసులు, నష్టాలు తెలుస్తున్నా సరే…
ఇదీ స్థూలంగా ఒక సగటు ఇండియన్ ఇన్వెస్ట్‌మెంట్ తీరు..!! నిజానికి ఇండియన్ ఎకానమీని నిలబెట్టేది కూడా ఈ ధోరణే… ఆమధ్య ప్రపంచమంతా డిప్రెషన్, రెసిషన్‌లో పడిపోయినప్పుడు కూడా మనల్ని ఏ ప్రభావమూ పడకుండా నిలబెట్టిందీ ఇదే పోకడ..!!
Share this Article