బ్రిటిషోడు ఇండియాను పాలించెను… అవును, చిన్నప్పటి నుంచీ టీచర్లు ఇదే మస్తుసార్లు చెప్పారు… క్లాసుల్లో చెప్పారు, బట్టీ పట్టించారు, వాయిల్ బరిగెలతో కొట్టి మరీ చదివించారు… ఇప్పుడు ఇంకోరకంగా రాసుకో రాధికా… భారతీయుడు బ్రిటన్‌ను పాలించెను… సరే, ఫ్యూచర్ టెన్స్ కదా, అప్పుడే పాస్ట్ టెన్స్‌లో రాయడం దేనికి..? భారతీయుడు బ్రిటన్‌ను పాలించును… పాలించనుండెను… ఇలా రాసుకో… ఆఁ ఇప్పుడు పర్‌ఫెక్ట్ టెన్స్… ఈ టెన్స్ ఏందో, ఈ టెన్సన్ ఏందో, ఎహె, భారతీయుడు బ్రిటన్‌ను పాలించడమేందో సమజైతలేదా రాధికా నీకు..? అయితే చదువు…
అన్ని దేశాలకూ ఉన్నట్టే బ్రిటన్‌లో కూడా ఓ ప్రధాని ఉన్నాడు… పేరు బోరిక్ జాన్సన్… కాస్త తిక్క మనిషి… ఈమధ్య మస్తు వివాదాలు నెత్తికి చుట్టుకున్నయ్… ఫోఫోవయ్యా, కుర్చీ దిగి, ఇంకేదైనా కొలువు చూసుకోఫో అనేశారు అక్కడి పెద్దమనుషులు… తప్పలేదు, కుర్చీ వదిలేస్తా, కొత్తాయన వచ్చాక అప్పగించి, నా మానాన నేను పోతా అనేశాడు… అదే జాతిరత్నాలు సినిమాలో ఓ కమెడియన్ ఫేమస్ డైలాగ్ ఉంది కదా… ‘‘నా వల్లనే ప్రాబ్లమైతే ఎల్లిపోతరా ఈడికెంచి..!’’ సేమ్…
మరి కుర్చీ ఎక్కేది ఎవరు..? చాన్స్ ఉన్నది ఎవరికి..? ఓ భారతీయుడికి…!! అంటే ఇది గ్రాఫిక్ మౌళి వక్రకథలో చూపించినట్టు ఆ భారతీయుడు ఓడల నిండా జంతువులను బోన్లలో తీసుకుపోయి, టైమ్ రాగానే లండన్ వీథుల్లోకి విడిచేసి, అడ్డొచ్చిన వాళ్లందరినీ ఉచకోత కోసేసి కుర్చీ ఎక్కడం కాదు… అలా ఊహించుకోకండి… ఇప్పుడు రాజ్యసభ కూడా దక్కింది కాబట్టి ఆ జోష్‌తో ఈ కథ రాసే చాన్స్ కూడా విజయేంద్రప్రసాద్‌కే ఇద్దాం…
Ads
రిషి సునాక్… వాడెవడో దరిద్రుడు యూట్యూబ్ చానెల్‌లో రుషి శునక్ అని తెగవాగేస్తున్నాడు… ఒరే నాయనా… శునక్ అంటే కుక్క… సో, దురర్థం వచ్చు ప్రమాదం కలదు… జాగ్రత్త… ఆయన పేరు సునాక్… రుషి కూడా కాదు, రిషి… భారతీయుడేనా అని డౌటొస్తున్నదా..? అంటే… మరీ… భారతీయ మూలాలున్నవాడు అని చెప్పడం కరెక్టు… ఎందుకంటే..? ఈయన తండ్రి యశ్‌వీర్ కెన్యాలో పుట్టాడు… జనరల్ ఫిజిషియన్… తల్లి ఉష టాంజానియాలో పుట్టింది… ఫార్మసిస్ట్…. వీళ్ల రూట్స్ పంజాబ్… అంటే భారతీయ మూలాలున్న విశ్వమానవుడు సునాక్…
ఈయన పెళ్లి చేసుకున్నది ఎవరినో తెలుసా..? ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి బిడ్డను… పేరు అక్షత మూర్తి… సునాక్ పుట్టింది బ్రిటన్‌లోని సౌథాంప్టన్‌లో… చదువూసంధ్యా అన్నీ అక్కడే… అనగా సాంకేతికగా బ్రిటన్ పౌరుడు… కానీ భార్య అక్షతకు మాత్రం భారతీయ పౌరసత్వం అలాగే ఉంది… సునాక్ వయస్సు 42 ఏళ్లు… ప్రాక్టీసింగ్ హిందూ… ఎంతగా అంటే… 2017లో హౌజ్ ఆఫ్ కామన్స్‌లో భగవద్గీత మీద ప్రమాణస్వీకారం చేశాడు… మద్యవ్యతిరేకి… ఇద్దరు బిడ్డల పేర్లనూ తన మతాన్ని సూచించేలాగే పెట్టుకున్నాడు… అనుష్క, కృష్ణ… 2014లో రాజకీయాల్లో అడుగుపెట్టిన సునాక్ ప్రస్తుతం ఆర్థికమంత్రి… (ఛాన్స్‌లర్ ఆఫ్ ఎక్స్‌చెకర్)… ఇప్పుడు ప్రధాని రేసులో ఉన్నాడు… అన్నీ అనుకూలిస్తే… ఎస్… భారతీయుడు బ్రిటన్‌ను పాలించును…!! ఎన్నిరోజులపాటైనా సరే, అదొక ఆత్మతృప్తి…!!
Share this Article