Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తమిళ స్టాలిన్‌ను చూసి మన తెలుగు పాలకులు ఏం నేర్చుకోవాలి..?

January 8, 2025 by M S R

.

తమిళనాడులో ఎక్కడో సింధూ నాగరికత ఆనవాళ్ళు తాజాగా దొరికితే ఆ రాష్ట్ర ప్రభుత్వాధినేతగా స్టాలిన్ తక్షణ స్పందనను చూసి తెలుగువారు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. రెండున్నర, మూడు వేల సంవత్సరాల క్రితమే ఉత్తర-దక్షిణ భారతాల మధ్య సంబంధ బాంధవ్యాలున్నాయనడానికి తమిళనాడులో దొరికిన కొన్ని పురాతన వస్తువులు ఆధారమవుతున్నాయి.

అయితే ముఖ్యమంత్రి స్టాలిన్ కానీ, తమిళ ప్రజలు కానీ కోరుకుంటున్నది ఉత్తర- దక్షిణ సత్సంబంధాల గురించి పురాతన ఆధారాలు మాత్రమే కాదు. అంతకు మించి. ఈ దొరికిన వస్తువులమీద ఉన్న లిపికి ప్రస్తుత తమిళ లిపికి కానీ, అందులో ప్రస్తావించిన విషయాలకు ఇప్పటి తమిళప్రాంతాలకు ఏవైనా సంబంధాలు కానీ ఉంటే అంతకుమించిన ఆనందం వారికి మరొకటి ఉండదు.

Ads

తెలుగుతో తెలుగు ప్రభువులకు, తెలుగు సమాజానికి ఇలాంటి పులకింత, తాదాత్మ్యం, అమ్మ పేగు బంధం లేవని బాధపడడం కంటే తమిళులకు తమిళంతో అలా ఉన్నందుకు సంతోషించాలి. వారిని మనసారా అభినందించాలి. తమిళ గడ్డమీద అచ్చ తెలుగులో మాత్రమే కీర్తనలు రాసి… పాడిన వాగ్గేయకారుడు త్యాగయ్యకు గుండెల్లో, బయటా గుడికట్టి తరతరాలుగా ఆరాధిస్తున్న తమిళులకు శిరసు వంచి నమస్కరించాలి.

తమిళనాడు పురావస్తు శాఖ దాదాపు 140 ప్రాంతాల్లో కొంతకాలంగా జరుపుతున్న తవ్వకాల్లో సింధూ లోయ నాగరికత కాలం (దాదాపు మూడు వేల సంవత్సరాల క్రితం)నాటి వస్తువులు బయటపడ్డాయి. అందులో ఉన్న లిపి ఏమిటో, ఆ లిపిలో ఉన్న విషయమేమిటో కనుక్కునే పరిశోధకులకు, సంస్థలకు ఎనిమిది కోట్ల రూపాయల నజరానా ఇస్తామని ప్రకటించారు స్టాలిన్. బహుశా అందులో ఏ తమిళసంబంధమో ఉంటే ఇంకా ఎక్కువ కూడా ఇస్తారు. ఇవ్వాలి కూడా.

# తమిళ లిపి అత్యంత పురాతనమని చెప్పడానికి ఇందులో సాక్ష్యం దొరకచ్చు.

# తమిళ చరిత్రకు వేనవేల ఏళ్ళనాటి రుజువులు దొరకచ్చు.

# సింధూ లోయ నుండి వర్తకులు మూడు వేల ఏళ్ళక్రితమే తమిళనాడుకు వచ్చారనడానికి ఇప్పటికే సాక్ష్యాలు దొరికాయి.

# లేని ఆర్యద్రావిడ సిద్ధాంతం పుట్టించి దక్షిణాది వారిని చిన్నచూపు చూసిన గుడ్డి మేధావులకు, చరిత్రకారులకు కనువిప్పు కలిగించే సాక్ష్యాలు దొరకచ్చు.

# రెండు, మూడు వేళ్ళ కిందటి ద్రవిడ దేశ భాష, చరిత్ర, విస్తృతి, లోతు, సంస్కృతికి సంబంధించి తిరుగులేని సాక్ష్యాలు దొరకచ్చు.

ఇందులో ఏమి బయటపడుతుందన్నది వేరే సంగతి. తమిళ మూలాలను కనుక్కోవాలన్న తపనను, ప్రయత్నానికి తగిన ప్రోత్సాహమివ్వడాన్ని మెచ్చుకోవాలి.

వారు రెండు వేలు దాటి మూడు వేల సంవత్సరాల కిందటి తమిళ చారిత్రక ఆధారాలను తవ్వుకుంటున్నారు. మనం కనీసం యాభై, డెబ్బయ్ ఏళ్ళ కిందటి-
# ఖండవల్లి లక్ష్మీరంజనం, ఖండవల్లి బాలేందు శేఖరం
“ఆంధ్రుల చరిత్ర- సంస్కృతి”
# మల్లంపల్లి సోమశేఖర శర్మ
“ఆంధ్రదేశ చరిత్ర”
# సురవరం ప్రతాపరెడ్డి
“ఆంధ్రుల సాంఘిక చరిత్ర”
# భద్రిరాజు కృష్ణమూర్తి
“తెలుగు భాషా చరిత్ర”
# బూదరాజు రాధాకృష్ణ
“తెలుగు భాషా స్వరూపం”
# బిరుదురాజు రామరాజు
“తెలుగు జానపదగేయ సాహిత్యం”
లాంటి పుస్తకాలనైనా తవ్వుకుంటే కనీసం వెయ్యేళ్ళకు పైబడ్డ తెలుగు భాష, సంస్కృతి, చరిత్ర తెలిసేవి.

ఎర్ర చందనం స్మగ్లర్ కథ పుష్ప2లో చిత్తూరు యాస ప్రపంచవ్యాప్తంగా రెండువేల కోట్ల రికార్డు వసూళ్ళు ఎలా చేసిందన్న విషయంపై ఉన్న ఆసక్తి తమిళ ప్రభావంతో ఏర్పడ్డ చిత్తూరు యాసలో ఉన్న అందం అన్న భాషావిషయంపై ఉండదు. మన నాటు పాట అంతర్జాతీయ ఆస్కార్ అవార్డును తెచ్చుకుంటుంది కానీ…మన నీటు తెలుగు భాష అంతర్జాతీయ సాహిత్య అవార్డును తెచ్చుకోలేదు.

ఒక్క ఖండవల్లి, ఒక్క సురవరం, ఒక్క బిరుదురాజు, ఒక్క భద్రిరాజు, ఒక్క బూదరాజు తవ్వి తీసిన తెలుగు చరిత్ర ఎంతో మనకు తెలుసా? వారి పేర్లన్నా గుర్తున్నాయా?

స్టాలిన్ గారూ!
ఇంకో ఎనిమిది కోట్లు మీరే ఉదారంగా ప్రకటించి…ఏ తమిళనాడు క్రిష్ణగిరి దగ్గరో తవ్వకాలు జరపమనండి! మా తెలుగు చరిత్ర కూడా కచ్చితంగా ఎంతో కొంత దొరకకపోదు. పైగా ఆరోజుల్లో మనం కలిసే ఉన్నాం. మేమిక్కడ సినిమా బెనిఫిట్ షో, టికెట్ల రేట్ల పెంపు, ఊపిరాగే అభిమానుల మధ్య ఉక్కిరిబిక్కిరి బిజీగా ఉన్నాము.

తెలుగు ప్రేక్షకుల జేబుల్లో చేతులుపెట్టి మొదటి ఆటకే వెయ్యి కోట్లు లాగేసే అధికారిక దోపిడీ పనుల్లో తీరికలేకుండా ఉన్నప్పుడు… తెలుగు భాషకో, తెలంగాణాకో వెయ్యేళ్ల చరిత్ర ఉంటే మాకేమిటి? రెండువేల ఏళ్ళ చరిత్ర ఉంటే మాకెందుకు? అదేమన్నా మాకు కూడు పెడుతుందా? గూడు కడుతుందా? కనీసం ఒక్క సినిమా బెనిఫిట్ షో టికెట్ అయినా సంపాదించిపెట్టగలుగుతుందా?

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆమెపై హానీట్రాప్… పడిపోయింది… మన రహస్యాలన్నీ చెప్పేసింది…
  • పురూలియా…! అదొక పెద్ద మిస్టరీ… జవాబుల్లేవు… ఆశించడమూ వేస్ట్..!!
  • అందరూ రాజ్‌పుష్పలు కాలేరు పుష్పా… అనవసర ప్రయాస, అగౌరవం…
  • సాక్షిలో చైనా సరుకు..! ఈ కరణ్ థాపర్ ఘొప్ప వ్యాసం చెప్పేది ఇదే..!
  • ఒక ధర్మబద్ధ ఫ్యూడల్ నియంత..! ఒక బొబ్బిలి బ్రహ్మన్న పాత్ర…!
  • ఓ ధూర్త శతృవు… ఓ మూర్ఖ ప్రధాని… ఈ తరం చదవాల్సిన కథ…
  • ఎద్దులతో ఓ జంట అనుబంధం…! తమిళ సినిమాకు కాదేదీ కథకనర్హం..!
  • ఈ సైకో రేపిస్ట్ ఎన్ని హత్యాచారాలు చేస్తేనేం… ఇంకా బతికే ఉన్నాడు…
  • గ్రోక్ కూడా చేతులెత్తేసిన భాష… ఇక ఆక్స్‌ఫర్డ్ టీమ్‌కే సాధ్యమేమో…
  • ఏమైంది అసలు..? చేజేతులా ట్రోలర్లకు చిక్కుతున్న కొండా సురేఖ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions