దివాలా తీసిన జీవీకే పవర్ == కర్ణాటకకు చెందిన విజయ్ మాల్య, గుజరాత్ కి చెందిన నీరవ్ మోది లాంటి వాళ్లు వ్యాపారాల కోసం బ్యాంకుల నుండి పెద్ద ఎత్తున రుణాలు తీసుకుని ఆ తదనంతరం వాటిని చెల్లించలేకపోవడం వలన డిఫాల్ట్ అవడమే కాకుండా దేశం విడిచి లండన్ లో తలదాచుకున్నారు. ఇప్పుడు అదేకోవలో ఒక తెలుగువాడు చేరే అవకాశాలు ఉన్నాయా?
తెలుగువాడైన గుణపాటి వెంకట కృష్ణా రెడ్డి (జీవీకే) గ్రూపు సంస్థలలో ఒకటైన జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ రుణ చెల్లింపుల్లో విఫలమైనందుకు సంస్ధ మీద దివాలా చర్యలకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాదు బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఐసీఐసీఐ బ్యాంకు నేతృత్వంలోని రుణదాతల గ్రూపు జీవీకే మీద దాఖలు చేసిన ₹15,576 కోట్ల పిటిషన్ ను విచారించిన బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది.
నిజానికి ఈ రుణం జీవీకే పవర్ కంపెనీ తీసుకున్నది కాదు. దశాబ్దం క్రితం సింగపూర్ లో నమోదైన జీవీకే కోల్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఐసీఐసీఐ బ్యాంకులో తీసుకున్న రుణానికి జీవీకే పవర్ గ్యారంటర్ గా సంతకం చేసింది. 2017 నుండి ఈ రుణం మీద చెల్లింపులు జరుగకపోవడంతో ఐసీఐసీఐ బ్యాంకు 2022లో పిటిషన్ దాఖలు చేసింది. దాంతో జీవీకే పవర్ కంపెనీ మీద దివాలా చర్యలకు ఆదేశిస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది.
Ads
జీవికే గ్రూపు బెంగళూరు, ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాలతో పాటు అనేక మౌలిక వసతులు, విద్యుత్ ప్లాంట్ ల నిర్మాణం చేపట్టింది. అనేకసార్లు బెంగళూరు, ముంబై ఎయిర్ పోర్టుల్లో అడుగుపెట్టినపుడు ఇది మన తెలుగువాళ్ళు నిర్మించినది అని గర్వంగా అనిపించేది. ప్రస్తుతం బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఫెయిర్ ఫాక్స్, ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అదానీ గ్రూప్ సొంతం చేసుకుంది.
భారతదేశంలో మౌలిక వసతుల నిర్మాణం, విద్యుత్ వంటి రంగాలలో గొప్ప వెలుగు వెలిగింది జీవీకే గ్రూప్ నేడు దివాలా తీయడం ఒక తెలుగువాడిగా బాధపడుతున్నాను. ఆఫ్ కోర్స్, జీవీకే గ్రూపుతో నాకెలాంటి ప్రత్యక్ష, పరోక్ష ఆర్థిక ప్రయోజనాలు లేనప్పటికీ తెలుగువాళ్ళు కూడా పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించారు అని చెప్పుకోవడానికి, వచ్చేతరానికి స్ఫూర్తిని కలిగించడానికి ఉదాహరణగా ఉండేవారు…. By – నాగరాజు మున్నూరు
Share this Article