ఎప్పుడో తనకు లెక్కల పాఠాలు చెప్పిన ఓ మాస్టారికి ఓ శిష్యుడు తరువాత కాలంలో 30 లక్షల రూపాయల విలువ చేసే షేర్లను ఇచ్చాడని ఒక పోస్ట్ ఎవరో షేర్ చేశారు… వావ్… కోట్లకుకోట్లు కొల్లగొడుతున్నా లేదా సంపాదిస్తున్నా సరే పిల్లికి బిచ్చం వేయని మహానుభావుల నడుమ బతుకుతున్నాం కదా, ఎడమ ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలని ఈ కాలంలో ఆ గొప్పాయన ఎవరబ్బా అని కాస్త వెతికితే… నిజంగానే ఓ మంచి మనిషి వివరాలు తెలిశాయి… నువ్వు గొప్పోడివి స్వామీ… నీకు ముందుగా అభినందనలు…
వెంబు వైద్యనాథన్… తన సక్సెస్ జర్నీలో తారసపడిన, తనతో ఉన్న అందరికీ ఏదో ఒకరకంగా సాయపడిన చరిత్ర తనది… రెండేళ్ల క్రితం ఈయన ఐడీఎఫ్‌సీ ఆర్థిక సంస్థ సీఈవో… వయస్సు 56 ఏళ్లు… ఇప్పుడు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఎండీ కమ్ సీఈవో… చెన్నై జన్మస్థలం… కేంద్రీయ విద్యాలయ స్టూడెంట్… ఓసారి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరడానికి ఇంటర్వ్యూలో తన కంటిచూపు తగినంతగా లేదని తిరస్కరించబడ్డాడు… తరువాత మెస్రాలోని బిర్లా టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాలి… కానీ రైలు టికెట్టు కొనడానికి తన దగ్గర డబ్బు లేదు…
ఆ సమయంలో తనకు లెక్కల మాస్టర్ గురుదయాళ్ సైనీ 500 రూపాయలు ఇచ్చాడు… విరాళం కాదు, అప్పు అని చెప్పాడు… బాధ్యతను గుర్తుచేయడం కోసం… ఆ అప్పు తీర్చడానికి ఆ గురువు ఆచూకీ కోసం ఈ శిష్యుడు 30 ఏళ్లు వెతికాడు… రుణం తీర్చుకోవడానికి… కానీ ఆచూకీ దొరకలేదు… తరువాత ఐసీఐసీఐ స్టాఫ్ ఆయన్ని ఆగ్రాలో కనుగొన్నారు… ఆయనకు వైద్యనాథన్ 30 లక్షల విలువ చేసే లక్ష షేర్లను ఇచ్చాడు… పాదాభివందనం చేశాడు… ఆ గురువుకు చాలాసేపు నోరు పెగల్లేదు… వావ్… తను అంచెలంచెలుగా బాగా ఎదిగాడు… తరువాత దృష్టిలోపం ఉన్నవాళ్లకు సాయం చేయడం కోసం 10 కోట్లు… తను చదివిన బిర్లా ఇన్‌స్టిట్యూట్‌లో స్కాలర్ షిప్ ప్రోగ్రామ్‌కు, తను స్థాపించిన రుక్మిణి ట్రస్టుకు కోట్ల రూపాయల్ని ఇస్తూనే ఉన్నాడు…
Ads
తన డ్రైవర్, పర్సనల్ ట్రెయినర్, ఆఫీస్ సపోర్టింగ్ స్టాఫ్‌కు మొత్తం 4 కోట్ల రూపాయల షేర్లను ఇచ్చాడు… ఏ గుజరాత్ వజ్రాల వ్యాపారో కోట్ల కొద్దీ వితరణ చేయడం పెద్ద వింతేమీ కాదు, అంతగా వరదలా డబ్బు వస్తుంటే కొంత సమాజానికి ఇస్తున్నారు… అదీ మంచిదే… ఇప్పుడు మనం చెప్పుకునే వైద్యనాథన్ కూడా వాళ్లకు తక్కువేమీ కాదు…
ఐడీఎఫ్‌సీ బ్యాంకు కేపిటల్ పస్ట్‌లో విలీనం అయ్యాక తన వాటా ధనంలో దాదాపు 38 శాతం తను ఎవరికి ఖర్చు చేశాడో తెలుసా..? తన సక్సెస్ జర్నీలో తనకు పరిచయమైన ప్రతి ఒక్కరికీ… పేరుపేరునా గుర్తు ఉంచుకుని, గుర్తు చేసుకుని, గుర్తు ఉండేలా… ఇంత చేస్తాడు కదా, మీడియాకు చెప్పడు, అసలు మీడియా ముందుకే రాడు ఈ విషయాలు చెప్పడానికి… తను హార్వర్డ్ బిజినెస్ స్కూల్ స్టూడెంట్ కూడా… తను ఇప్పుడు ఉండేది ముంబైలో… ముగ్గురు పిల్లలు… నువ్వు గ్రేట్ భయ్యా…
Share this Article