#sudigalisudheer… తన మీద ఎంతమంది ఎన్నిరకాల పంచులు వేసినా సరే, దులుపుకుని, తుడుచుకుని, నవ్వుతూ లైట్ తీసుకుంటాడు… దాంతో మరీ అందరికీ అలుసైపోయినట్టున్నాడు… అనగా చీపైపోయినట్టున్నాడు… పైగా ఇన్నేళ్లు ఈటీవీ కోసం, మల్లెమాల కంపెనీ కోసం గాడిద చాకిరీ చేశాడు కదా… ఒక్క ప్రోగ్రాం కోసం మాటీవీకి వెళ్లొస్తే మరీ అంత ఘోరంగా వెకిలి చేయాలా..? పైగా ఇక్కడ పొగబెడుతూ, అవమానిస్తుంటేనే కదా తను పక్క టీవీ స్టూడియోకు వెళ్తున్నది..? ఐనా వెటకారం చేయించాలా మల్లెమాల కంపెనీ..? సుధీర్ మీద మరీ అంత పగేమిటో…!!
కాస్త వివరంగా చెప్పుకోవాలంటే… గతంలో ఈటీవీ కాకులేవీ ఇతర టీవీ ఆఫీసుల మీద వాలడానికి వీల్లేదు… పైగా కాగితాలు, అగ్రిమెంట్లు, జరిమానాలు, బాండ్లు గట్రా… అచ్చం బాండెడ్ లేబర్… ఈమధ్య కాస్త సడలింది… అందరూ అటూఇటూ తిరుగుతూ షోలు చేస్తున్నారు… ఆది ఎలాగూ ఈటీవీకి కట్టిబడేయబడిన కేరక్టర్… సుధీర్‌ది కూడా ఏ ఇతర టీవీ వైపు కన్నెత్తి కూడా చూడని పాతివ్రత్యమే ఇన్నాళ్లూ.,.
కానీ కొంతకాలంగా సుధీర్‌ను పరాభవిస్తున్నారు, పొమ్మనలేక పొగబెడుతున్నారు… పోతేపోరా అన్నట్టు వ్యవహరిస్తున్నారు… తాజాగా ఒక హోలీ స్పెషల్ షో కోసం సుధీర్, రష్మి మాటీవీకి వెళ్లొచ్చారు… వాళ్ల ఎపిసోడ్ బాగా హిట్టయ్యింది కూడా… ఒకే రాత్రి ఆరేడు పాటల్ని నేర్చుకుని, తనకు చేతనైనంత వరకు బాగానే పాడాడు… అసలు ఆ లిరిక్స్ గుర్తుంచుకోవడమే పెద్ద టాస్క్…
Ads
అందులో రష్మి సుధీర్ చెంప మీద తన కాటుకతో దిష్టి చుక్క పెట్టి, నీ కెరీర్‌కు దిష్టి తగలకుండా పెట్టాను అంటుంది… బాగుంది… వాళ్లిద్దరి స్పెషల్ ఫ్రెండ్ షిప్ అందరికీ తెలిసిందే కదా… కానీ తన కంటి కాటుకతో తన ఫ్రెండ్‌కు దిష్టి చుక్క పెట్టడం అనేది ఇప్పటి టీవీ చానెళ్ల వెగటు ట్రెండ్స్ నడుమ కాస్త నచ్చేలా కనిపించిన ఓ సెంటిమెంట్ టచ్…
ఇదంతా చూసిన ఈటీవీ జబర్దస్త్ టీంకు మళ్లీ కన్నెర్ర… ఎక్కడో మండినట్టుంది… అప్పటికప్పుడు సుధీర్‌ను, ఈ దిష్టి చుక్క ఎపిసోడ్‌ను వెకిలి చేస్తూ ఓ స్కిట్ రాయించారు… పరదేశి అని ఓ కమెడియన్ ఉంటాడు కదా… ఏదీ సరిగ్గా పలకలేడు, కదల్లేడు… తనకు సుధీర్ అనే బోర్డు మెడలో తగిలించి, సుధీర్ వేషం వేయించారు…
రష్మితో, విష్ణుప్రియతో, మొన్నామధ్య తేజస్వినితో సుధీర్‌కు ఉత్తుత్తి పెళ్లిళ్లు నిశ్చితార్థాలు జరిగాయి కదా, అవన్నీ వెక్కిరిస్తూ తాజాగా జబర్దస్త్‌లో ఈ స్కిట్ చేయించారు… ఈ దిష్టి చుక్కను కూడా వెక్కిరించారు… అంతేకాదు, నూకరాజుతో ‘‘తను మాత్రం కనిపించిన ప్రతీ అమ్మాయిని తగులుకోవచ్చు గానీ దిష్టి మాత్రం తగలకూడదా?’’ అనిపించారు… మరీ చిల్లర డైలాగ్… మాటీవీలో ఒక షో చేస్తే మరీ ఇంత పగ, పరాభవం, ప్రతీకారం అవసరమా..? ప్రదీప్, శ్రీముఖి, అనసూయలు ఎన్ని టీవీలు తిరగడం లేదు..? సుధీర్-రష్మిల మీదే ఈ పగలు దేనికి..?!
విశేషం ఏమిటంటే… సుధీర్ సొంత స్కిట్లో కూడా తన మీద పంచులు రాయించుకున్నాడు… గెటప్ సీను శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో సుధీర్ యాంకరింగు మీద సెటైర్లు వేశాడు… అది పర్లేదు, సరదాగా ఉంది… హేమిటో ఫాఫం సుధీర్… ఫైట్లు, డాన్సులు, కామెడీ, మేజిక్కు, తాజాగా సాంగ్స్… సినిమాల్లో హీరో… తాజాగా కాలింగ్ సహస్ర సినిమా ట్రెయిలర్ కూడా రిలీజైంది… ఐనా సరే, చివరకు పరదేశి కూడా పంచులు వేసేవాడయ్యాడు…!!
Share this Article