రేపు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము వస్తోంది… తెలంగాణలో ఘనంగా రిసీవ్ చేసుకుని, ర్యాలీ కూడా తీయాలని తెలంగాణ బీజేపీ ప్లాన్ చేస్తోంది… కేసీయార్ పార్టీ విపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హాను మొన్న నెత్తి మీద మోసి, ర్యాలీ తీసి, వ్యూహాత్మకంగా వ్యవహరించింది కదా… సో, ఆమెకు ఘన స్వాగతం గట్రా బీజేపీ ప్లాన్… మరి ఏపీ..?
ఏపీకి కూడా వస్తోంది… వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలున్నారు… 43,674 వోట్లకు సమానం వాళ్లు… మొత్తం రాష్ట్రపతికి పడాల్సిన వోట్లలో నాలుగు శాతం… చాలా ప్రాధాన్యమున్న వోట్లు… కానీ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తాజా వ్యాఖ్యలు అసందర్భంగా, అమర్యాదగా, అర్థరహితంగా, అనాలోచితంగా ఉన్నాయి… ఏమైంది ఈ బీజేపీ నేతలకు..?
‘‘మేం వైసీపీ మద్దతు అడగలేదు… మాకు అది అంటరాని పార్టీయే… మేం బీజేపీతో ఉన్నామనే భ్రమల్ని కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు వైసీపీ నాయకులు’’ అనే వ్యాఖ్యలు నిజంగా జగన్‌ను అవమానించినట్టే… ఒకవైపు బీజేపీ అభ్యర్థి ద్రౌపది వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిసి వోట్లడగబోతోంది… జగన్ ఇంట్లో తేనీటి విందుకు హాజరవుతోంది… ఆల్‌రెడీ ఓసారి థాంక్స్ చెప్పింది… ఈ సందర్భంగా ఈ అర్థరహిత వ్యాఖ్యలు ఏమిటి..?
Ads
మేమేమీ మద్దతు అడగలేదు, మీ తీటకు మీరే మద్దతు ఇస్తున్నారు అన్నట్టుగా వ్యాఖ్యానించడం, అదీ పార్టీ జాతీయ కార్యదర్శి నోటి ద్వారా ఆ వ్యాఖ్యలు రావడం విచిత్రం… అలాంటప్పుడు ఆమె ఏపీకి రావడం దేనికి..? వాళ్లను వోట్లు అభ్యర్థించడం దేనికి..? మరెందుకు ఈ అసందర్భ ప్రేలాపనలు..? కావచ్చు, మీరు అడక్కపోయినా జగన్ తన కేసుల భయంతో, మీరు వద్దూవద్దంటున్నా సరే, మీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నాడనే అనుకుందాం… మీకు అలుసైపోయాడనీ అనుకుందాం… మరీ ఆమె వోట్లు అడగడానికి వస్తుంటే, ఇప్పుడీ వ్యాఖ్యలు ఏరకమైన రాజకీయ సంస్కారం..? ఆమె నామినేషన్ల మీద వైసీపీ నేతల సంతకాల్ని ఎందుకు అనుమతించినట్టు మరి..? అసలు ఏపీబీజేపీలో ఎవరేమిటో, ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అంతుపట్టదు… అంతా గందరగోళం…
ఇదిలా ఉంటే… ఫాఫం చంద్రబాబుది మరో దురవస్థ… ఒకప్పుడు రాష్ట్రపతుల్ని, ఉపరాష్ట్రపతుల్ని ఖరారు చేసిన నాయకుడు… ఇప్పుడు ఆయన మద్దతు కోరేవాళ్లే లేరు… జగన్‌కు ఇష్టం ఉండదు కాబట్టి ద్రౌపది ముర్ము ఏపీకి వచ్చినా తెలుగుదేశాన్ని పట్టించుకునే అవకాశాలే కనిపించడం లేదు… ‘‘మళ్లీ అల్లూరి అనుభవమే’’… జంపర్లు పోగా 16, 17 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఉన్నారు కాబట్టి, ఆ వోట్లకూ ఎంతోకొంత విలువ ఉంటుంది… కానీ అటు యశ్వంతుడు అడగటం లేదు, ఇటు ద్రౌపదీ అడగటం లేదు… పేరుకు బీజేపీ మిత్రపక్షమైన జనసేనను కూడా ఈ సందర్భంగా లైట్ తీసుకుంటున్నారు… అఫ్‌కోర్స్, ఆ పార్టీకి వోట్లు లేవనేది వేరే సంగతి…
ఫాఫం, సాక్షిది మరో దౌర్భాగ్యం… 11న ఆమె రాక అంటాడు… వార్తలో మంగళవారం అని రాస్తాడు… ఆమె ఎప్పుడొస్తుందో, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎప్పుడు కలుస్తుందో, జగన్ ఇంటికి ఎప్పుడు వెళ్తుందో సాక్షి మీడియాకే తెలియదు… వీళ్లకు పోటీ ఇంకో మీడియా ఉంది… ఇది టీవీ9 వార్త… నేడే ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము రాక అని రాసిపారేశారు… హేమిటో…
Share this Article