Insurance- Assurance: బీమా ఉంటే ధీమాగా ఉండవచ్చు అని బీమా కంపెనీలు చెప్పుకుంటాయి. కోట్ల మంది బీమా లేకపోవడం వల్లే ధీమాగా ఉండగలుగుతున్నారు అన్నది గిట్టనివారి వాదన. జీవిత బీమా, ఆరోగ్య బీమా, వాహన బీమా, పంటల బీమా, పరిశ్రమ బీమా, పరికరాల బీమా…చివరికి ఆవిష్కరణలకు కూడా బీమా సదుపాయాలున్నాయి.
బీమా బలంగా ఉండాలనుకుని లేని ఒత్తు పెట్టి భీమా అని కూడా రాస్తూ, పలుకుతూ ఉంటారు. నిజానికి తెలుగువారికి బీమా ఉన్నా, తెలుగు భాషలో బీమా లేదు. పదమూడు, పద్నాలుగో శతాబ్దాల్లో పర్షియా మీదుగా ఉర్దూలోకి వెళ్లి, అటునుండి హిందీలోకి వచ్చి…ఆపై అన్ని భారతీయ భాషల్లోకి బీమా ప్రవేశించినట్లుంది.
కొన్ని దశాబ్దాల క్రితం వరకు…ఏ పనీ దొరక్కపోతే ఎల్ఐసి ఏజెంటు అవతారం ఎత్తేవారు.
“నీ ఇంటి పక్కనే ఉన్న ఎల్ఐసి ఏజెంటు నిన్ను ఒక్కసారి కూడా పాలసీ తీసుకోమని అడగలేదంటే…నువ్ ఎందుకూ పనికిరానివాడివి అని అర్థం!” అని బాపూ సినిమాలో ముళ్లపూడి నిర్వచనాత్మక జోక్.
Ads
ఇప్పుడు ప్రయివేటు ఇన్సూరెన్స్ కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఎల్ ఐ సి పునాదులు కూడా కదులుతున్నాయి.
వ్యాపారంలో భాగంగా నిత్యం ఇన్సూరెన్స్ కంపెనీలతో నాకు పని ఉంటుంది. పదిహేనేళ్లుగా ఇన్సూరెన్స్ కంపెనీలతో నా అనుభవాలివి.
తెలంగాణా ఉద్యమం తీవ్రస్థాయిలో ఉండగా నల్గొండలో ఒక ప్రభుత్వ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారానికి వెళ్లిన మా వాహనాన్ని ఉద్యమకారులు పచ్చడి పచ్చడి చేశారు. పోలీసు కేసు పెట్టి…ఇన్సూరెన్స్ వారి చుట్టూ రెండు నెలలు తిరిగాం. నష్టం మూడు లక్షలు. ఇన్సూరెన్స్ క్లైయిమ్ వచ్చింది అరవై వేలు. పగిలిన గ్లాసుకు, విరిగిన మనసుకు క్లెయిమ్ రాదని వారి లెక్కలేవో వారు చెప్పారు. నేను సైతం తెలంగాణా ఉద్యమానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అనుకుని సర్దుకుపోయాను.
మా అపార్ట్ మెంట్ గేటు దాటుతుండగా మా ఇన్నోవాను మలుపులో చూడకుండా వచ్చి వేగంగా ఓ బుల్లి కారు గుద్దేసింది. ఇన్నోవా పెద్దది…ఆ కారు చిన్నది కావడం వల్ల…ఆ కారు బాగా డ్యామేజ్ అయ్యింది. వెంటనే మా డ్రైవర్ కాలర్ పట్టుకుని లాగి, మా ఇన్నోవా తాళాలు తీసుకుని…నష్టపరిహారం ఇస్తేనే వదులుతామని సున్నితంగా చెప్పారు. ఆ కారుకు ఇన్సూరెన్స్ లేదట. నడిపినవాడికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదట. కానీ వాడి కండ బలం, గుండె బలం ముందు మా డ్రైవర్ గౌతమ బుద్ధుడయి మౌనంగా ధ్యాన ముద్రలోకి వెళ్లాడు. వాడి బండి రిపేరి ఖర్చులు భరించి…వాడి చెరనుండి మా డ్రైవర్ ను అత్యంత ప్రజాస్వామిక సంప్రదింపులతో విడిపించుకున్నాను. మా ఇన్నోవాకు అయిన డ్యామేజ్ కు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి వీల్లేదు…అది మీ పూర్వ జన్మల కర్మల ఫలం అన్నారు. కర్మ సిద్ధాంతాన్ని నమ్మే నాకు ఇందులో కర్త కర్మ క్రియ అన్నీ నేనే కావడం స్పష్టంగా కనిపించి…ఊరుకున్నాను.
కాలదోష ఖర్మ
కొందరికి ఆటలు వెన్నతో పెట్టిన విద్య. అలా అందరితో ఆడుకునే ఒక ఏజెన్సీ క్రికెట్ పోటీలు పెడితే కెమెరాలు అద్దెకిచ్చాను. పెను గాలులు వీచి రెండు కెమెరాలు కింద పడి పగిలిపోయాయి. నష్టం 32 లక్షలు. ఆ ఏజెన్సీ అద్దె ఇవ్వలేదు. నాలుగేళ్లు దాటిన ఎలెక్ట్రానిక్ పరికరాలకు…సంవత్సరానికి 25 శాతం డిప్రిసియేషన్ చొప్పున నాలుగేళ్లలో దాని వ్యాల్యూ గుండు సున్నా అని ఇన్సూరెన్స్ వాడు నాకు సున్నా విలువ పాఠం చెప్పి వెళ్లిపోయాడు. సున్నా విలువ తెలిసింది కదా అని శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాను.
బీమా రోగం
ఒకసారి నా ఖర్మ కాలి కిడ్నీ పని చేయడం మానేసింది. ఒకానొక కార్పొరేట్ ఆసుపత్రిలో స్పృహలేని స్థితిలో చేరితే…స్పృహ వచ్చే సరికి పదిరోజులు పట్టింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన డిస్ ఛార్జ్ ముహూర్తం రానే వచ్చింది. ఆసుపత్రి బిల్లు చూసి…మళ్లీ స్పృహదప్పుతుంటే మా ఆవిడ గట్టిగా పట్టుకుంది. ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఈ పర్టిక్యులర్ కిడ్నీకి ఎందుకు పనికిరాదో ఆసుపత్రి వారు చక్కగా వివరించారు. ఆసుపత్రి గేటు దాటితే చాలు అనుకుని లక్షలు కట్టి..బయటపడి…ఊరుకున్నాను.
బీమా యజ్ఞం
ఒక ఆశ్రమ పీఠాధిపతి శివరాత్రి పూట ఏదో యాగం చేస్తున్నారు. మా కెమెరాలను బుక్ చేసుకున్నారు. హోమ కుండంలో నెయ్యి వేస్తే భగ్గుమన్న అగ్ని కీలల దృశ్యాన్ని దగ్గరగా షూట్ చేయబోతే…కెమెరా లెన్స్ మాడి మసై పోయింది. నష్టం 25 లక్షలు. కెమెరా లెన్స్ మా ఇన్సూరెన్స్ కంటికి కనపడదు పొమ్మన్నారు. మళ్లీ అదే కవిత. నేను సైతం శివరాత్రి పూట యాగంలో లెన్సు ఒక్కటి ఆహుతిచ్చాను…అనుకుని…ఊరుకున్నాను.
బీమా అద్వైతం
ఎవరూ పట్టించుకోరు కానీ బీమా భావనలో అంతులేని వైరాగ్య జ్ఞానం, అద్వైతం దాగి ఉంది. మీరు పొతే…మీ వారికి ఈ పాలసీ అంటే ఎవరూ ఉండేవారు కాదు…ఖచ్చితంగా పోతారు అని. ఇంకా ముందే పోవడానికి మీకు మీరు సిద్ధంగా ఉండండి అని. ఈ దేహం శాశ్వతం కాదని. రోగాలు, ప్రమాదాలు మీకోసం ఎదురు చూస్తున్నాయని.
బీమా కంపెనీలకు ధీమా
సగటున సంవత్సరానికి వాహనాలు, పరికరాలు, ఆరోగ్యాలు, జీవితాలు అన్నిటికి కలిపి పెద్ద మొత్తాల్లో ఇన్సూరెన్స్ కట్టే నా వల్ల ఇన్సూరెన్స్ కంపెనీలు ధీమాగా ఉన్నాయి కానీ…ఏ ఆపదలోనూ కట్టిన, కడుతున్న ఇన్సూరెన్స్ లు నన్ను ఆదుకోలేదు. ఇదే విషయం మా ఆడిటర్ ను అడిగితే…ఇన్సూరెన్స్ క్లయిములు రాబట్టుకోవడం దానికదిగా ఒక విద్య. అది అందరికీ అబ్బదు అన్నాడు. ఈ వయసులో కొత్త విద్యలు ఇక ఏమి నేర్చుకోగలను?
ఈ జన్మకు ఇన్సూరెన్సు కంపెనీలను పోషించాలని రాసి పెట్టి ఉంది. ఎవరి ఖర్మకు ఎవరు బాధ్యులు?
మహారాష్ట్రలో రోడ్డు మీద వెళుతున్న వాహనం టైరు పేలింది. ఆ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి చనిపోయాడు. ఆ బండికి, ఆయనకు ఇన్సూరెన్స్ ఉంది. ఆయన బంధువులు తగిన డాక్యుమెంట్లన్నీ సమర్పించి బీమా క్లెయిమ్ కు అభ్యర్థన పెట్టుకున్నారు. ఓ మై గాడ్ సినిమాలోలా టైర్ పేలడం “దైవ ఘటన- యాక్ట్ ఆఫ్ గాడ్)”. ప్రమాద బీమా, జీవిత బీమా ఏదీ ఇవ్వడం కుదరదు అన్నారు ఇన్సూరెన్స్ కంపెనీ వారు. కేసు ట్రిబ్యునల్ దాటి హై కోర్టు దాకా వెళ్లింది. ఇన్సూరెన్స్ కంపెనీల నిర్లక్ష్యాన్ని, చేతులు దులుపుకోవడాన్ని కోర్టు దులిపి పారేసింది. ఉతికి ఆరేసింది. కోటి పాతిక లక్షల రూపాయల బీమా పరిహారం ఇవ్వాల్సిందేనని ఆదేశించింది.
ఇలా ఎందరు కోర్టు మెట్లెక్కి పోరాడగలరు? దాంతో బీమా కంపెనీలు ఆడింది ఆట- పాడింది పాట!
(పాత కథనానికి మహారాష్ట్ర తాజా కేసు జోడింపు)
-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com
Share this Article