మన చదువులు దేనికి..? దండుగ..! అవి బతకడాన్ని నేర్పించలేవు… బతికి సాధించడాన్ని నేర్పించలేవు… అసలు సిలబస్‌లో బతుకు సూత్రాలు పాఠం ఉంటే కదా, పిల్లలు నేర్చుకోవడానికి, బుర్రలోకి ఎక్కించుకోవడానికి..! ఎన్నెన్నో ఆశలు పెట్టుకుని, పెంచుకుని, మురిపెంగా చూసుకునే తల్లిదండ్రులకు ఎంత గుండెకోత… ఎవడైనా ఆలోచిస్తే కదా… ఈ చదువులు పాడుగాను…
ఏమవుతుంది..? ఒక ఏడాది గ్యాప్ వస్తే ఏమవుతుంది..? కొంపలు మునిగిపోతాయా..? మరో ఏడాది పరీక్షలు రాయలేరా..? ఐనా అదీ పాస్ కాకపోతే ఏమవుతుంది..? బతకలేకపోతారా..? చదువులు లేనివాళ్లను ఈ భూమాత సహించడం లేదా..? బతకొద్దు అంటోందా..? బతకడానికి ఎన్ని వృత్తులు లేవు..?
అన్ని వృత్తులూ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈక్వేషన్స్ అడుగుతున్నాయా..? బోటనీ, జువాలజీ పాఠాలు అప్పగించమంటున్నాయా..? చేసే పని మీద గౌరవం, బతకడానికి ఓ వృత్తి సరిపోవా..? ఎంతసేపూ చూపు కెనడా, అమెరికాలపైనేనా..? అందరూ అటు వెళ్లాల్సిందేనా..? వెళ్లలేనివాడు బతకడానికి పనికిరాడా..? ఏమిటీ పిరికితనం..? ఇదేనా మీ చదువులు మీకు నేర్పించిన జీవనపాఠం..?
Ads
ఇంటర్ పాస్ కాలేదని, మార్కులు తక్కువ వచ్చాయని ఒకేరోజు తొమ్మిది మంది ప్రాణాలు తీసుకున్నారని ప్రాథమిక వార్తలు… రేపు పత్రికలు చదివితే గానీ అసలు ఫిగర్ తెలియదు… ఇదొక జాఢ్యం… మాస్ హిస్టీరియాలాగా పటపటా రాలిపోతుంటారు పిల్లలు… ఎంత దారుణం..? దిక్కుమాలిన ప్రభుత్వాలకు ఏమీ పట్టదు, మన సిలబస్‌తో బతుకు పాఠాలు ఎలాగూ ఉండవు… మీడియాకు ఇలాంటివేమీ పట్టవు… చదువు లేకపోయినా బతకడం ఏమిటో చెప్పాలి…
చదువుల్లేకపోయినా ఉద్దండపిండాలుగా ఎదిగిన సక్సెస్ స్టోరీలు చెప్పబడాలి… ఎలాగూ సిలబస్ రూపకర్తలకు ఇవి పాఠ్యాంశాల్లో చేర్పించాలనే బుద్ధి లేదు… ఇకపై రాదు, ఉండదు… సో, ఇక సొసైటీయే దిక్కు… పిల్లలు మానసికంగా దెబ్బతినకుండా ఊరడించాలి… భరోసాగా నిలవాలి… మొండిగా బతుకు బండిని ఎలా లాగొచ్చో నేర్పించాలి… ఉదాహరణలు చూపించాలి… అమెరికా డాలర్లు సంపాదించేవాడే మనిషి కాదు… ఉన్నచోటే కాలరెత్తుకుని, చిరునవ్వుతో నిలబడేవాడే మొనగాడు…
చిత్తూరు జిల్లాలో అనూష, బాబు, అనకాపల్లిలో తులసీ కిరణ్, శ్రీకాకుళం జిల్లా తరుణ్, విశాఖ జిల్లా అఖిలశ్రీ, బోనెల జగదీష్, అనంతపురం జిల్లా మహేష్, ఎన్టీయార్ జిల్లా షేక్ జాన్ సౌదా, చిల్లకల్లుకు చెందిన రమణ రాఘవ…. రాష్ట్రంలో ప్రతిచోటా… ఏ తేడా లేదు… ఆత్మహత్యలు కాదు, ఆత్మవిశ్వాసాన్ని నేర్పే ఒక్క పాఠమూ స్కూల్ సిలబస్‌లో కనిపించదు… మరెలా..?
స్కూళ్లు, కాలేజీలకు ప్లే గ్రౌండ్స్ ఉండవు… పది మందీ కలిసి ఆడుకునే వెసులుబాట్లు లేవు… ఎంతసేపూ సెల్ ఫోన్లు, పిచ్చి గేమ్స్… టీవీ సీరియళ్లు, సినిమాల నిండా పనికిమాలిన కంటెంట్… ఇక ఓటీటీల్లో అయితే చెప్పనక్కర్లేదు… తల్లిదండ్రుల బాధ్యత లేదా..? ఉంది… ర్యాంకులు, మార్కులు, ఎనలేని ఆశలు, తద్వారా ఒత్తిడి… పటేలున పగులుతున్న మెదళ్లు… ఎవరు బాధ్యులు, ఎవరు దొంగలు అని కాదు… ఇప్పుడు కావల్సింది కుంగిన హృదయాలకు, తల్లడిల్లే మనస్సులకు ఊరట, ఊరడింపు… మీమీ సర్కిళ్లలో ఎవరైనా పిల్లలుంటే కాస్త పలకరించండి… భుజంపై తట్టి, డోన్ట్ కేర్ అనే పదాన్ని ఎక్కించండి… చాలు…
Share this Article