ట్రిపుల్ ఆర్ సినిమాపై ఓ విమర్శ… రాంచరణ్ పోర్షన్ ఎక్కువ చేసి, ప్రాధాన్యం అధికంగా ఇచ్చి, జూనియర్ పాత్రను తక్కువ చేశారని..! సరే, ఆ విమర్శల్ని జూనియర్ లైట్ తీసుకున్నాడు, అది వేరే సంగతి… కానీ ఈ మల్టీ స్టారర్ అంటేనే ఈ సమస్య… కథ ప్రకారం గాకుండా, ఫ్యాన్స్ మనోభావాలు, ఇమేజీలను బట్టి కథనం నడిపించడం ప్రతి దర్శకుడికీ కత్తిమీద సాము… ఎందుకొచ్చిన గొడవ అనుకుని హీరోలు, దర్శకులు మల్టీ స్టారర్ల జోలికి పోరు…
ఆమధ్య గోపాల గోపాల అనే సినిమా వచ్చింది… వెంకటేష్, పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలు… కథ ప్రకారమే సినిమా వెళ్తుంది… అంతేతప్ప, కావాలని ఇద్దరికీ సమస్థాయిలో డిష్యూం డిష్యూంలు, పాటలు, స్టెప్పులు గట్రా ఏమీ ఉండవు… ఆ కోణంలో ఆ ఇద్దరినీ మెచ్చుకోవచ్చు… ఎక్కడా ఫాల్స్ ఇగోల జోలికి పోలేదు… హఠాత్తుగా మరో పాత సినిమా గుర్తొచ్చింది… అది చాణక్య చంద్రగుప్త…
అప్పుడెప్పుడో 1977 నాటి సినిమా… అందులో ఎన్టీయార్, ఏఎన్నార్ ఉంటారు… సినిమా ప్లాన్ చేసింది ఎన్టీయార్… అప్పటికే ఈ ఇద్దరు అగ్రహీరోల మధ్య ఇగోలు భగ్గుమంటున్నాయనే విమర్శలు ఉన్నాయి ఇండస్ట్రీలో… వాటికి చెక్ పెట్టడంతోపాటు ఓ మంచి కథను తెరకెక్కించాలని ఎన్టీయార్ భావించాడంటారు… ఎన్టీయార్ సొంత బ్యానర్… అందులో చంద్రగుప్తుడి పాత్ర ఎన్టీయార్ పోషిస్తే, చాణక్యుడి పాత్రను ఏఎన్నార్ చేశాడు… నిజానికి అందులో బాగా హైలైట్ అయ్యేది ఏఎన్నారే… ఐనాసరే, ఎన్టీయార్ పెద్దగా పట్టించుకోలేదు… కథ చెప్పినట్టుగా వీలైనంతవరకూ ఎవరి పాత్ర ఎంతో అంతకే పరిమితమయ్యారు… సినిమా బాగుంటుంది కూడా…
Ads
ఈ సినిమాలో చేసినందుకు ఏఎన్నార్ డబ్బులేమీ తీసుకోలేదట… దాంతో ఏఎన్నార్‌కు ప్రతిఫలంగా ఏఎన్నార్ బ్యానర్‌కు ఓ సినిమా చేసిపెడతానని ఎన్టీయార్ చెప్పాడు… ఏఎన్నార్ జగపతి రాజేంద్రప్రసాద్‌తో పెట్టుబడి పెట్టించి, అన్నపూర్ణ స్టూడియోస్ ప్లస్ జగపతి పిక్చర్స్ బ్యానర్ కింద రామకృష్ణులు అనే సినిమా ప్లాన్ చేశారు… ఎన్టీయార్ అప్పటికే అడవిరాముడుతో బిజీ… ఇక ఎన్టీయార్ కాల్షీట్లు వాడుకోవడానికి హడావుడిగా జగపతి రాజేంద్రప్రసాద్ అమితాబ్ బచ్చన్ నటించిన హెరాఫెరీ నుంచి కొంత కథను తీసేసుకుని, ఎడాపెడా మార్పులు చేసుకుని, రీళ్లు చుట్టేశాడు…
ఆత్రేయ తలుచుకుంటే బూతు పాటలు ఎంతసేపు..? అసలు కేవీ మహదేవన్ ఆ పాటలకు ఎలా అంగీకరించాడనేదీ ప్రశ్నే… అంతకుముందు స్టార్ హీరోల సినిమాల్లో ఉన్నట్టే… స్టెప్పులు, పాటలు, ఫైట్లు అన్నీ సమపాళ్లలో ఉండటానికి నానా తిప్పలూ పడ్డాడు రాజేంద్రప్రసాద్… మరి ఆ చాణక్య చంద్రగుప్త స్పూర్తి ఏమైందో అర్థం కాదు… ఏదో ఎన్టీయార్‌కు గ్యాప్ దొరికినప్పుడు సినిమా పూర్తి చేసేసి, ప్రేక్షకుల మీదకు వదిలారు… జయప్రద, జయసుధలతోపాటు కాంతారావు, సత్యనారాయణ, జగ్గయ్య, రాజబాబు, మోహన్‌బాబు ఎట్సెట్రా చాలామంది తారాగణం… వెరసి ఆ కథ, ఆ ట్రీట్‌మెంట్ తీరుకు జనం ఏవగించుకున్నారు…!! మా మొహాలు తెర మీద కనిపిస్తే చాలు, సినిమా సూపర్ నడిచేస్తుంది అని ఏ పెద్ద స్టార్ అనుకున్నా సరే, అది పొరపాటు అని చెప్పడానికి ఆ సినిమా ఓ ఉదాహరణ అన్నమాట…!!
Share this Article