పెళ్లి చేసుకుంటానన్నాడు… లైంగిక సంబంధం పెట్టుకున్నాడు… కొన్నాళ్లు గడిచాయి… ఒల్లనుపో అన్నాడు… నీతో పెళ్లి కుదరదు, వద్దన్నాడు… అయితే అది అత్యాచారం కిందకు వస్తుందా..? దీన్ని జస్ట్, ఓ మోసంలాగే చూడాలా..? ఓ మహిళ మనసుతో, జీవితంతో ఆడుకున్నందున లైంగిక అత్యాచారంగా పరిగణించాలా..? చాన్నాళ్లుగా ఈ చర్చ నడుస్తోంది…
సహజీవనంలో సాగే లైంగిక సంబంధాల్ని అత్యాచారంగా పరిగణించలేమని గతంలో సుప్రీంకోర్టు చెప్పింది… సరే, సహజీవనంలో (Live In Relationship) లేకుండా పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక సంబంధం పెట్టుకుని, తీరా కొన్నాళ్లకు మొహం చాటేస్తే దాన్ని ఎలా చూడాలి..? చట్టంలోని అత్యాచారం సెక్షన్లు ఈ విషయంలో వర్తిస్తాయా..?
సరే, ఇదంతా చట్టపరమైన సంక్లిష్టతల మీద చర్చ… ఒక్కో కేసులో ఒక్కోరకంగా ఉండొచ్చు… ఇప్పుడు విషయం ఏమిటంటే..? ఇది మధ్యప్రదేశ్ కేసు… ఒక యువతి హైకోర్టుకు వచ్చింది… పెళ్లిచేసుకుంటాను అన్నాడు, నమ్మించాడు, మూడేళ్లయ్యాక మోసగించాడు, వద్దుపొమ్మంటున్నాడు, మూడేళ్లుగా లైంగికంగా వాడుకున్నాడు అనేది ఆ యువతి ఆరోపణ… ఇది అత్యాచారమే అంటోంది ఆమె…
Ads
ఎన్డీటీవీ కథనం ప్రకారం… ఈ కేసులో నిందితుడు ఏబీవీపీ లీడర్… ప్రైవేటుగా నా నొసటన కుంకుమ పెట్టాడు, తాళి కట్టాడు… బహిరంగంగా మాత్రం అంగీకరించడు, గర్భం ధరించింది, విధిలేక తొలగించుకోవాల్సి వచ్చింది… ఇది బాధితురాలి తరఫు వాదన… పరస్పర అంగీకారంతో మూడేళ్లు లైంగిక సంబంధం పెట్టుకున్నాం, అది అత్యాచారం ఎలా అవుతుందీ అంటాడు నిందితుడు… హైకోర్టు దాకా వచ్చిన ఈ కేసులో గత నవంబరులో నిందితుడికి బెయిల్ వచ్చింది… (సెప్టెంబరులో అరెస్టయ్యాడు)…
ఈలోపు ఎవరో నిందితుడు నివసించే ప్రాంతాల్లో ఫ్లెక్సీయో, పోస్టరో పెట్టారు… భయ్యా ఈజ్ బ్యాక్… అన్నొచ్చిండు… తను కావాలని అలాంటివి పెట్టించుకోడుగా, ఎవరో స్నేహితులో, ఫాలోయర్సో పెట్టి ఉంటారు… సరిగ్గా ఇలాంటి అతి పోకడలే కొత్త సమస్యల్ని క్రియేట్ చేస్తాయి… ఇక్కడా చేశాయి… భయ్యా ఈజ్ బ్యాక్ అనే స్లోగన్ సొసైటీకి ఎలా అర్థమవుతుందీ అంటే… అన్న మళ్లీ డ్యూటీ ఎక్కాడు అన్నట్టుగా కనిపిస్తుంది… ఒక తప్పుడు సంకేతం…
సరిగ్గా బాధితురాలు ఈ పాయింట్ పట్టుకుంది… హైకోర్టు తన కేసు పట్ల సీరియస్‌గా లేదనీ, భయ్యా ఈజ్ బ్యాక్ వంటి నినాదాలు భయాందోళనకు కారణమవుతున్నాయని, సో, హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు వచ్చింది… నిన్న ఈ కేసులో విచారణ జరిగింది…
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ కూడా ఉన్న ధర్మాసనం ఈ భయ్యా బ్యాక్ హోర్డింగు మీద సీరియస్ అయిపోయింది… ‘‘దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి..? ఈ హోర్డింగు సమాజానికి ఏం చెబుతోంది..? బెయిల్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్నారా ఇలా..?’’ అని వ్యాఖ్యానించడమే కాదు… డిఫెన్స్ లాయర్‌ను ఉద్దేశించి ‘‘మీ భయ్యాను ఓ వారంపాటు జాగ్రత్తగా ఉండమనండి’’ అని హెచ్చరించింది… సో, బెయిల్ రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నయ్… కేసంతా ఒక ఎత్తు… ఎవరో పెట్టిన ఓ వెల్‌కమ్ హోర్డింగ్‌తో కేసు మలుపు తీసుకోవడమే కాదు, ఓ ఇంట్రస్టింగ్ కేసు కాస్తా రప్చర్ అయిపోయింది ఇలా…
ఓ వివాహితపై కన్నేసి, ఆ కుటుంబం నిలువునా తగులబడిపోవడానికి కారకుడైన ఖమ్మం జిల్లా యువనేత, కాలకేయుడికి ఆ కేసులో బెయిల్ వచ్చింది ఆమధ్య… బెయిల్ వచ్చిన వెంటనే తండ్రి ఎమ్మెల్యే ‘‘ఒక్కొక్కరి బండారం బయటపెడతా, కుట్రలు పన్నారు, అసలు కేసే నిలవదు’’ అని వివాదాస్పద వ్యాఖ్యలకు దిగాడు… చాలామంది నిందితుడి వద్దకు వెళ్లి పరామర్శలు చేశారు… ఈ ‘‘భయ్యా ఈజ్ బ్యాక్’’ వార్త చదువుతూ ఉంటే అవే గుర్తొస్తున్నయ్..!!
Share this Article