గ్రామీణ విలేఖరుల వ్యవస్థ అంటేనే… అది ఒక భయంకరమైన శ్రమదోపిడీ..! అందరికి తెలిసీ సాగే వెట్టిచాకిరీ… కాకపోతే సమాజంలో ఓ ఎన్లైటెన్ పని ప్లస్ కాస్త పలుకుబడి అనే ఆశతో విలేఖరులు అలా కొనసాగుతూనే ఉంటారు… ప్రజలపై పడిపోతూ, ఏదోలా బతికేస్తుంటారు… పోనీ, అదేమైనా నాలుగు రోజులు స్థిరంగా ఉండే పనా..? కానే కాదు… పైనున్న పెద్దలు తలుచుకుంటే ఠకీమని ఊడిపోతుంది… అత్యంత అభద్రత, చాకిరీ, ఒత్తిడి, మన్నూమశానం… సరే, ఈ కథంతా అందరికీ తెలిసిందే… జర్నలిస్టు సంఘాలు కూడా గ్రామీణ విలేఖరుల జీతాలపై, స్థితిగతులపై పోరాడేది ఏమీ ఉండదు… అయితే ఈనాడు మీద ఓ గ్రామీణ విలేఖరి వేసిన కేసు కాస్త ఇంట్రస్టింగుగా అనిపిస్తోంది… జర్నలిస్టు సర్కిళ్లకు ఆసక్తికరమైన కేసు ఇది… సోషల్ మీడియా సమాచారం మేరకు… (Subject to corrections)… వనపర్తి జిల్లా, పెబ్బేరు మండలంలో 29 సంవత్సరాలుగా ఈనాడులో రమేష్ అనే విలేఖరి పనిచేస్తున్నాడు… ఆయన్ని గత సెప్టెంబరులో తీసేశారు… ఇదీ నేపథ్యం…
నిజానికి ఈనాడులో గ్రామీణ విలేఖరిగా 30 ఏళ్లు పనిచేయడం అంటే గ్రేటే… ఇన్నేళ్లు కొనసాగించిందీ అంటేనే ఒకింత పద్దతిగా ఉండే విలేఖరే అనుకోవాలి… రాష్ట్ర ప్రభుత్వం జిల్లా స్థాయిలో ఇచ్చే ఉత్తమ జర్నలిస్టు అవార్డు కూడా పొందాడు… హఠాత్తుగా తనను తీసేయడం మీద కోర్టుకెక్కాడు… అయితే తను ఈనాడులో పనిచేస్తున్నట్టుగా ఆధారాలు చూపించినా సరే, పార్ట్ టైమర్‌గా చేసే పని కాబట్టి, రెగ్యులర్ ఎంప్లాయీ కాదు కాబట్టి, జర్నలిస్టులకు వేజ్ బోర్డులు చెప్పిన పేమెంట్స్ వర్తించవు… అందుకని ఇలాంటి కేసుల్లో జర్నలిస్టులు గెలిచిన దాఖలాలు లేవు… సో, రమేష్ పరువు నష్టం, సమాజంలో మర్యాద కోల్పోయాను అనే పాయింట్ మీద ఈనాడు మీద న్యాయపోరాటానికి రెడీ అయ్యాడు… ఎలాగంటే..?
Ads
- నోటీసులు లేకుండా నన్ను తొలగించారు…
- చెప్పాపెట్టకుండా కొలువు తీసేయడంతో కుటుంబం ఇబ్బందుల పాలయింది…
- సమాజంలో పరువు కోల్పోయాను…
- ఈ అవమానం కారణంగా తీవ్ర మనోవేదనకు గురయ్యాను…
- సో, 20 లక్షల పరిహారం ఇవ్వాలి
ఉద్యోగం నుంచి తీసేయడానికి చాలా కారణాలుంటయ్… ప్రైవేటు సంస్థల్లో తీసేయడాలు, నియమించుకోవడాలు కామన్… పైగా ఇది రెగ్యులర్ ఉద్యోగం కూడా కాదు… ఉద్యోగం తొలగింపు వల్ల పరువు కోల్పోతే ప్రైవేటు సంస్థ ఎలా బాధ్యత వహిస్తుంది..? మంచిగా పనిచేస్తేనే కదా ఇన్నేళ్లు కొనసాగించింది, అలాగే పనిచేస్తే కొనసాగించేవాళ్లమే కదా..! ఇవీ ఈనాడు వైపు కొన్ని సమర్థనలు… కానీ 30 ఏళ్లు పనిచేసిన ఓ విలేఖరిని హఠాత్తుగా తీసేస్తే… తనేమైపోవాలి..? ఇదీ ప్రశ్నే కదా… వాళ్లదేం పోయింది..? ఈయన కాకపోతే మరో వ్యక్తి ఎవరో ఈ కంట్రిబ్యూటర్ అనబడే ఓ గిలెటిన్లో తలపెట్టుకోవడానికి పరుగెత్తుకొస్తాడు… ఇదొక నిరంతర శ్రమదోపిడీ యవ్వారం… సరే, ఈ డిబేట్ మాటెలా ఉన్నా… వనపర్తి జూనియర్ సివిల్ కోర్టు ఈ కేసును విచారణకు స్వీకరించి ఏప్రిల్ 20న కోర్టుకు రావాలని ఈనాడు చీఫ్ ఎడిటర్ (రామోజీరావు కాదు), ఉషోదయ ఎండీ, న్యూస్‌టుడే ఎండీలను ఆదేశించింది… కౌంటర్ దాఖలు చేయాలంది…!!
Share this Article