సుబ్రహ్మణ్యస్వామి… మనిషి అంతుచిక్కడు… అతి పెద్ద లిటిగెంటు… పెద్ద బుర్ర… మనసులో ఏదైనా పెట్టుకుంటే ఇక వదలడు, వెంటపడతాడు… చాలా ఉదాహరణలుంటయ్… వాజపేయి మీద కోపం పెట్టుకుని, జయలలితను ఉసిగొల్పి, ఆ ప్రభుత్వాన్ని పడగొట్టిన వైనం నుంచి నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌లను ఈడీ కేసు దాకా పట్టుకొచ్చిన వైనం దాకా… స్వామి ఎప్పుడు ఏ ఇష్యూలో వేలు పెడతాడో, వాటిల్లో స్వప్రయోజనాలు ఉంటాయో, ప్రజాప్రయోజనాలు ఉంటాయో కూడా అంత వేగంగా తేల్చిచెప్పలేం…
రామసేతు అలియాస్ సేతుసముద్రం షిప్పింగ్ కెనాల్ ప్రాజెక్టు కథ కూడా అంతే… ఎన్నేళ్లుగానో ఆ ప్రాజెక్టు వెంటపడుతున్నాడు… సుప్రీంకోర్టు దాకా వెళ్లాడు… తాజా వార్త ఏమిటంటే..? రామసేతును జాతీయ వారసత్వ చిహ్నంగా ప్రకటించాలని స్వామి పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీం విచారణకు స్వీకరించింది… ఒక్కసారి దాన్ని జాతీయ వారసత్వంగా గుర్తిస్తే ఇక సేతుసముద్రం ప్రాజెక్టూ లేదు, మూసేసిన ఆ ఫైళ్లను మళ్లీ తెరిచేదీ లేదు…
ఇంకాస్త వివరాల్లోకి వెళ్దాం… ఇండియా శ్రీలంకల నడుమ శ్రీరాముడు వేల ఏళ్ల క్రితమే వంతెనను వానరసైన్యం సాయంతో కట్టాడని రామాయణం చెబుతోంది… కోట్ల మంది భారతీయులు విశ్వసిస్తారు… కానీ ఇండియాలో హైందవ విశ్వాసాలకు ప్రభుత్వాలు అస్సలు విలువనివ్వవు కదా… నాస్తికత్వమే సిద్ధాంతంగా ఉన్న డీఎంకే ఒత్తిడి మేరకు అప్పట్లో, అంటే 2005లో మన్మోహన్ సింగ్ ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడు… హైందవ సంఘాలు ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదు…
Ads
చకచకా ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు… రుణప్రయత్నాలు చేశారు… కరుణానిధికి అమితమైన ప్రేమ ఈ ప్రాజెక్టు మీద… ఏ రాజకీయ నాయకుడికైనా ఒక ప్రాజెక్టు మీద అమితమైన ప్రేమ ఎందుకు ఉంటుందో తెలుసు కదా…! ఏడెనిమిదేళ్ల క్రితం ఈ ప్రాజెక్టు కాస్ట్ 24,700 కోట్లు… ఈజీగా ఇప్పుడు లెక్కేస్తే 30 వేల కోట్ల దాకా చేరి ఉండవచ్చు… నిజానికి రామసేతును ధ్వంసం చేసి, వాణిజ్య నౌకలు సాఫీగా వెళ్లిపోయేందుకు ఓ మార్గం క్రియేట్ చేయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం…
కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మూర్ఖంగా ముందుకు పోయిందంటే… 2008లోనే పచౌరి కమిటీ వేసింది… కాస్ట్ ఎఫెక్టివ్, ఆల్టర్నేట్స్, ఇతర నష్టాల మీద రిపోర్టు అడిగింది… అది 2013లో రిపోర్టు ఇచ్చింది… ఈ ప్రాజెక్టు వల్ల జలజీవసంపదకు, పర్యావరణానికి నష్టమని తేల్చింది… సునామీ వంటి విపత్తుల్లో ప్రమాదతీవ్రత పెరుగుతుందనీ చెప్పింది… అంతేకాదు, ఆ ప్రాజెక్టు కాస్ట్‌కు తగిన ప్రయోజనం వాణిజ్యపరంగా లేదని లెక్కకట్టింది… ఆల్టర్నేట్స్ సూచించింది… ఆ రిపోర్టును అటకమీద పారేసి మన్మోహన్ పాత ప్రతిపాదనలకే సై అన్నాడు…
మోడీ ప్రభుత్వం వచ్చింది… 2020లో రామసేతుకు నష్టం వాటిల్లని రీతిలో, తక్కువ ఖర్చుతో పంబన్ పాస్ ప్రత్యామ్నాయాన్ని చేపట్టాలనే ఆలోచన చేసింది… కానీ అంతకుముందే స్వామి సుప్రీంలో కేసు వేసి కొట్లాడుతున్నాడు… సుప్రీంకోర్టు కూడా పర్యావరణ నష్టాల్ని పరిగణనలోకి తీసుకోవాలని చెబుతోంది… స్టాలిన్ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాజెక్టు మీద మళ్లీ కదలిక మొదలైంది… పార్టీ నాయకుడు టీఆర్ బాలు దాని పైరవీలు స్టార్ట్ చేశాడు…
డీఎంకే కలల ప్రాజెక్టు కదా… శ్రీలంక మీద చైనా పెత్తనం పెరుగుతోందనీ, అది అడ్డుకోవాలంటే ఇలాంటి ప్రాజెక్టులతో ఏరియా డెవలప్‌మెంట్ మీద దృష్టి పెట్టాలనే దాకా డీఎంకే వెళ్లిపోయింది… ప్రత్యామ్నాయం తప్ప ఈ పాత ప్రాజెక్టు అవసరం లేదని 2021 మార్చిలో సేతుసముద్రం ప్రాజెక్టునే క్లోజ్ చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది… కథ ముగిసింది… కానీ తను బీజేపీ పార్టీయే అయినా సరే, స్వామి ఎవరినీ నమ్మడు కదా… ఈ కథకు అల్టిమేట్ ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏం చేయాలనే మథనంలో పడ్డాడు…
అందుకే ఇక ఏ ప్రభుత్వం వచ్చినా రామసేతు జోలికి పోకుండా ఉండాలంటే ఏం చేయాలి..? ఆలోచించి జాతీయ వారసత్వం అనే పాయింట్ పట్టుకున్నాడు… అదీ ఈ కేసు కథ… నిజానికి బీజేపీ వైపు నుంచి రావల్సిన ప్రతిపాదన అది… ఎలాగూ రామసేతుకు నష్టం లేకుండా ప్రత్యామ్నాయ మార్గం అనేది బీజేపీ పొలిటికల్ లైన్ అయినప్పుడు… జాతీయ వారసత్వంగా ప్రకటిస్తే, దాని జైశ్రీరాం పాలసీకి అనుగుణంగా ఉండేది… ఆ పని స్వామి చేస్తున్నాడు…!! ఎప్పుడో 1938 నుంచే ఈ రామసేతును పలగ్గొట్టి, వాణిజ్య నౌకల ప్రయాణానికి వీలుగా లోతు చేయాలనే ప్రయత్నాలు, ఆలోచనలు సాగాయి… బోలెడు ప్రాజెక్టులు ఆలోచించారు… కానీ రెండు శతాబ్దాలు కావస్తున్నా ఆ రామసేతులోని ఒక్క ముక్కను కూడా ధ్వంసం చేయలేకపోయారు ఎవరూ… ఏ శక్తి కాపాడుతోంది దాన్ని..?!
Share this Article