సకాలంలో అందని న్యాయం అసలు న్యాయమే కాదు అంటారు పెద్దలు… నిజం, కారణాలెన్నున్నా సరే, మన న్యాయవ్యవస్థ చాలా అన్యాయం చేస్తోంది… చివరకు చిన్న చిన్న కేసుల్లో కూడా ఇదే పరిస్థితి..! ఒక వార్త చదువుతుంటే చాలా ఆశ్చర్యమేస్తుంది… అప్పట్లో … అంటే 2010లో… పదకొండేళ్ల క్రితం… యంతిరన్ అని రజినీకాంత్ సినిమా వచ్చింది గుర్తుంది కదా… తెలుగులో రోబో… ఓ ఇంజనీర్ అంతులేని మేధస్సు, బలసంపన్నుడైన ఒక రోబోను అచ్చు తనలాగే సృష్టించడం, తీరా అది ఓ దశలో కరప్ట్ అయిపోయి, హీరో ప్రియురాలి మీదే కన్నేయడం, చివరకు ఆ రోబో పలు కారణాల రీత్యా తనను తనే డిస్మెంటల్ చేసుకోవడం, అంటే ‘ఆత్మహత్య’ చేసుకోవడం ఈ సినిమా కథ… రోబోలకు ఆత్మలుండవు కదా అనడక్కండి… దీనికి శంకర్ దర్శకుడు… ఐశ్వర్యారాయ్ హీరోయిన్… హిందీలో కూడా డబ్ చేశారు… రెండు జాతీయ అవార్డులను ప్లస్ విపరీతమైన కలెక్షన్లను సాధించింది ఈ మూవీ… ఇప్పుడు విషయం ఏమిటంటే..?
ఆరూర్ తమిళనాదన్ అనే రైటర్ ఉన్నాడు… 1996లో నేను ఇనియా ఉదయం అనే తమిళ మ్యాగజైన్లో జిగుబా అనే శీర్షికతో ఓ కథ రాశాను… దాన్ని ఎత్తేసి, శంకర్ ఈ యంతిరన్ సినిమా తీశాడు అనేది తన ఆరోపణ… 1957 కాపీ రైట్ ప్రకారం దర్శకుడు శంకర్ శిక్షార్హుడు అంటాడు తను… ఇదే కథను తను 2007లోనూ ధిక్ ధిక్ దీపికా దీపికా అనే పుస్తకంలోనూ పబ్లిష్ చేశాడు… తమిళ మూవీ పెద్దలకు చెప్పాడు… కానీ శంకర్, రజినీలకు వ్యతిరేకంగా పోయేవాడెవడు ఆ ఇండస్ట్రీలో..? అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశాడు… నిర్మాత కళానిధిమారన్, పోలీసులు లైట్ తీసుకున్నారు… దీంతో ఈ రైటర్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు వేశాడు… కోర్టు నోటీసులు పంపించింది నిర్మాతకు, దర్శకుడికి… వాళ్లు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు… హైకోర్టు మేజిస్ట్రేట్ కోర్టు విచారణ మీద స్టే ఇచ్చింది… అంతే, ఇక… ఆ కేసు కదలదు, నడవదు అన్నట్టుగా దాదాపు పదేళ్లపాటు అక్కడే పడుకున్నది… చివరకు 2019 జూన్‌లో ఓ తీర్పు చెబుతూ, సదరు రైటర్ నిర్మాతపై చేసిన అభియోగాలు కరెక్టు కాదని చెప్పింది… అయితే..?
Ads
ఆ రైటర్ రాసిన కథకూ, ఆ సినిమా కథకూ నడుమ 16 పోలికలు సేమ్ ఉన్నట్టుగా కోర్టు అంగీకరించి.., దర్శకుడు, కథా రచయిత శంకర్ మీద విచారణను కొనసాగించాలంటూ మేజిస్ట్రేట్ కోర్టును ఆదేశించింది హైకోర్టు… అంటే ఆ రైటర్ రాసిన కథను ఎంతోకొంత కాపీ చేసినట్టే కదా… ఈ దర్శకుడు ప్రతిసారీ కోర్టుకు విచారణకు వస్తే జనం గుమిగూడే అవకాశం ఉన్నందున, అవసరమైనప్పుడు మాత్రం హాజరైతే చాలునని మినహాయింపు కూడా ఇచ్చింది… హైకోర్టు తీర్పు వచ్చాక తాపీగా, ఒక ఏడాదికి శంకర్ సుప్రీంకోర్టుకు పోయాడు… నో, నో, ఆ కేసును కొట్టేయలేం అంటూ సుప్రీం కూడా శంకర్ పిటిషన్‌ను తోసిపుచ్చింది… ఇంకేముంది..? కథ మళ్లీ ఎగ్మూరు కోర్టుకు వచ్చింది… దా, దా, బిడ్డా, ఒకసారి మొహం చూపించు అన్నట్టుగా కోర్టు నిన్న నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది… వచ్చే 19వ తేదీకి వాయిదా వేసింది… ఒక కథను కాపీ కొట్టి, ఒరిజినల్ రచయితను ముప్పుతిప్పలు పెడుతూ… సుప్రీంకోర్టు దాకా పోయినా సరే, శంకర్ కోర్టు ఎదుట హాజరై విచారణకు సహకరించాల్సిన పరిస్థితి ఇప్పుడు… ఆమధ్య ఏదో ప్రమాదంలో భారతీయుడు-2 సెట్ కాలిపోయి, ఆ సినిమా కూడా ఆగిపోయింది కదా… శంకర్‌కు రోజులు బాగాలేవు..!!
Share this Article