Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆర్థికమే అల్టిమేట్… మత శతృత్వాలకు తెర… ఇజ్రాయిల్‌తో పాక్ రాజీ..?!

May 31, 2022 by M S R

పార్ధసారధి పోట్లూరి …….. అంతర్జాతీయ రాజకీయ చిత్రపటం మీద మరో కొత్త చిత్రం ఆవిష్కరించబడబోతున్నది! పాకిస్థాన్ కి చెందిన రెండు వేరు వేరు బృందాలు నన్ను కలిశాయి అంటూ ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హర్జోగ్ [Isaac Herzog] ఒక సంచలన ప్రకటన చేశాడు.

1947 లో ఇజ్రాయెల్ ఒక దేశంగా ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు పాకిస్థాన్ ఇజ్రాయెల్ ని ఒక దేశంగానే గుర్తించలేదు. పాకిస్థాన్ పాస్పోర్ట్ మీద అన్ని దేశాలకి అని అంటూనే, ఒక్క ఇజ్రాయెల్ కి తప్ప అని రాసి ఉంటుంది. అంటే పాకిస్థాన్ పౌరుడు ఎవరయినా తమ పాస్పోర్ట్ మీద అన్ని దేశాలకి వెళ్ళవచ్చు కానీ ఇజ్రాయెల్ కి వెళ్ళడానికి అనుమతి లేదు. గతంలో దక్షిణాఫ్రికా జాతి,వర్ణ వివక్ష చూపిస్తున్నది అంటూ చాలా దేశాలు తమ దేశ పౌరులకి ఇచ్చే పాస్పోర్ట్ ల మీద సౌత్ ఆఫ్రికాకి తప్ప అని రాసేవి. మన దేశ పాస్పోర్ట్ మీద కూడా ఒక్క సౌత్ ఆఫ్రికాకి తప్ప అని ముద్రించి ఉండేది. ఐక్యరాజ్యసమితి దక్షిణాఫ్రికా మీద నిషేధం తీసివేశాక ఈ నిబంధనని అన్ని దేశాలు తీసేసాయి.

అయితే ఇప్పటికీ పాకిస్థాన్ తమ పౌరులకి ఇజ్రాయెల్ వెళ్ళడానికి అనుమతి ఇవ్వటం లేదు అలాగే ఇజ్రాయెల్ ని గుర్తించనూ లేదు. అసలు రెండు దేశాల మధ్య సరిహద్దు లేకపోయినా కేవలం మత పరమయిన శతృత్వం కొనసాగుతూ వస్తున్నది. కానీ ఇలా హఠాత్తుగా పాకిస్థాన్ రాయబారం పంపడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.

Ads

ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హర్జోగ్ [Isaac Herzog]ఒక ప్రకటన చేస్తూ… వారం కిందట పాకిస్థాన్- అమెరికన్లు ఇద్దరు నన్ను కలిశారు. మే 22 న స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ప్రసంగం చేసిన తరువాత ఆ పాకిస్థాన్-అమెరికన్ లు ఇద్దరు నన్ను కలిసి మాట్లాడారు అని పేర్కొన్నారు. అలాగే పాకిస్థాన్ నేషనల్ టెలివిజన్ కి చెందిన ఒక జర్నలిస్ట్ తో పాటు అమెరికాలో స్థిరపడిన పాకిస్తానీ మహిళా వాణిజ్యవేత్త ఒకరు తనతో కలిసి మాట్లాడినట్లుగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హర్జోగ్ చెప్పారు… కానీ పేర్లు తెలియరాలేదు. అమెరికాలో స్థిరపడ్డ మహిళా వాణిజ్యవేత్తకి పాకిస్థాన్ లోని పాకిస్థాన్ ముస్లిం లీగ్ [PMLN] లో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తున్నది.

అసలు ఇజ్రాయెల్, పాకిస్థాన్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే శత్రుత్వం ఉన్న తరుణంలో హఠాత్తుగా చోటుచేసుకున్న ఈ పరిణామం ఆశ్చర్యం కలిగించేదే ! పాలస్తీనా ప్రజలని ఇజ్రాయెల్ వాళ్ళ భూములని లాక్కొని చంపుతున్నది అని మొత్తం అరబ్ ప్రపంచం ఇజ్రాయెల్ తో శతృత్వాన్ని పెంచుకొని, చివరకి అరబ్ దేశాలు అన్నీ కలిసి ఇజ్రాయెల్ మీద దాడి చేసి, యుద్ధం కూడా చేశాయి గతంలో.

కానీ కాలక్రమేణా ఇక ఇజ్రాయెల్ ని ఎప్పటికీ ఓడించలేము అని నిర్ధారణ చేసుకున్నాక మళ్ళీ సంబంధాలు పునరుద్ధరించుకుంటూ వస్తున్నాయి. పోయిన సంవత్సరం సౌదీ అరేబియా ఇజ్రాయెల్ తో దౌత్యసంబంధాలని పునరుద్ధరించింది అలాగే ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం కూడా ఏర్పాటు చేసింది. తరువాత UAE కూడా ఇజ్రాయెల్ తో దౌత్య సంబంధాలని ఏర్పరుచుకుంది. అయితే ఇప్పటికీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ [OIC] లోని దేశాలలో కొన్ని ఇజ్రాయెల్ పట్ల సుముఖంగా లేవు, అలా అని చేసేది కూడా ఏమీ ఉండదు. ఇరాన్, పాకిస్థాన్ దేశాలు ఇజ్రాయెల్ పట్ల శత్రు భావాన్నే కలిగి ఉన్నాయి.

పాకిస్థాన్ ఆర్ధిక పరిస్థితే కారణమా ?

ఒకపక్క FATF గ్రే లిస్ట్ లో కొనసాగుతున్న పాకిస్థాన్ కి అంతర్జాతీయ ఆర్ధిక సంస్థల నుండి అప్పు పుట్టే అవకాశం లేదు. మరోవైపు దేశీయంగా, అంతర్జాతీయంగా దిగజారిన పరపతి.., మరోవైపు చైనాతో అంట కాగుతూ చైనా DEBT వలలో పీకల్లోతు కూరుకుపోయిన ఆర్ధిక వ్యవస్థ… ఇలా సతమతమవుతున్న పాకిస్థాన్ అమెరికాలో అత్యంత శక్తివంతమయిన యూదు లాబీ నుండి మద్దతు కోరే క్రమంలో… ముందుగా ఇజ్రాయెల్ తో సామరస్యంగా వ్యవహరించాలని చేసే ప్రయత్నంలో భాగంగా… ముందస్తుగా ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తుందో చూడాలని చేసిన ప్రయత్నంలో భాగంగా… రెండు విడతలగా రెండు బృందాలని ఇజ్రాయెల్ అధ్యక్షుడితో మాట్లాడడానికి పంపించింది పాకిస్తాన్.

దౌత్య సంబంధాలని నెలకొల్పుకోవాలని చూస్తున్నదా ?

ఎటూ సౌదీ అరేబియా, UAE లు రెండూ ఇజ్రాయెల్ తో దౌత్య సంబంధాలని పునరుద్ధరించుకున్నాయి కనుక పాకిస్థాన్ కూడా అదే పని చేసి ఇజ్రాయెల్ ద్వారా పరపతి పెంచుకోవాలనే వ్యూహం కనపడుతున్నది. అయితే అదంత సులువుగా జరిగే పని కాదు. ఇజ్రాయెల్ ఒప్పుకున్నా పాకిస్థాన్ లోని ఉగ్ర గ్రూపులు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ముందు రాజకీయ పార్టీల నాయకులని టార్గెట్ చేసి చంపేస్తాయి. తరువాత ఏకంగా సైన్యం మీద కూడా దాడి చేసి స్వాధీనం చేసుకోవచ్చు ఆఫ్ఘనిస్తాన్ లోలాగా…!! పాక్ లోని ఉగ్ర గ్రూపులు చాలా వరకు ISI కనుసన్నలలో నడుస్తాయి కానీ ఇజ్రాయెల్ తో సంబంధం అంటే మాత్రం ఇవే ఉగ్ర గ్రూపులు ISI ని లెక్క చెయ్యవు. కాబట్టి పాకిస్థాన్ ప్రయత్నాలు బెడిసికొట్టే అవకాశాలే ఎక్కువ.

సైన్యం + ISI

ఇజ్రాయెల్ అధ్యక్షుడితో పాకిస్థాన్ ప్రభుత్వంతో సంబంధం లేని వ్యక్తులతో రాయబారం నడిపించడం అనేది ప్రభుత్వ ఆలోచన కాకపోయి ఉండవచ్చు… ఎందుకంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకునేది సైన్యంతో పాటు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ అయిన ISI… అవి నిర్ణయం తీసుకొని ప్రభుత్వం చేత అమలు చేయిస్తాయి వెనక ఉండి… ఇప్పుడు చేసింది చిన్న ప్రయత్నమే కానీ విషయం బయటికి పొక్కింది… అంటే అది ఉగ్ర సంస్థల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడడానికి వేసిన ఎత్తుగడగా భావించాలి.

ఏది ఏమయినా దిగజారుతున్న ఆర్ధిక పరిస్థితి శ్రీలంకలోలాగా మారితే అది సైన్యానికి నష్టం కలిగిస్తుంది. ఈ ప్రమాదాన్ని పసిగట్టి నివారించే చర్యలలో భాగంగా పాకిస్థాన్ ఇజ్రాయెల్ తో స్నేహ హస్తం చాస్తున్నది అన్నది స్పష్టం. అయితే భారత్ తో అత్యంత పటిష్టమయిన సంబంధాలని కలిగి ఉన్న ఇజ్రాయెల్ భారత్ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోదు.

ఒకవేళ పాకిస్థాన్ ఇజ్రాయెల్ తో దౌత్య సంబంధాలని పెట్టుకోవాలని చూస్తే, అది పరోక్షంగా పాకిస్థాన్ కి నష్టం భారత్ కి లాభం అవుతుంది. ఇస్లామాబాద్ లో ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం ఉండడం అంటే అది ఆసియాలో మోస్సాద్ కి మరో ప్రధాన కార్యాలయం అయినట్లే భావించాలి. భారత్ కి కలిగే లాభం ఇదే ! చూద్దాం ఏమవబోతుందో !

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!
  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…
  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions