ఎస్… నిత్యామేనన్ ప్లేసులో గీతామాధురిని జడ్జిగా తీసుకోవడం, ఆమె ఏవేవో పిచ్చి వివరణలతో శ్రోతలకు పిచ్చెక్కించడం మాట ఎలా ఉన్నా… ఆహా ఓటీటీలో వచ్చే ఇండియన్ ఐడల్ తెలుగు రక్తికడుతోంది… మొదటి సీజన్‌ను మించి రెండో సీజన్ పాపులర్ అవుతోంది… మెయిన్ స్ట్రీమ్ వినోద చానెళ్లలో వచ్చే మ్యూజికల్ షోలతో పోలిస్తే ఈ ఇండియన్ ఐడల్ నాణ్యత చాలా ఎక్కువ…
ప్రత్యేకించి గ్రూపు డాన్సర్లు, వెకిలి జోకులు, వేషాలు, గెంతులతో జీతెలుగు చానెల్‌లో వచ్చే సరిగమప షో ఓ సంగీత కార్యక్రమమనే సోయి లేకుండా భ్రష్టుపట్టించేశారు… ఈటీవీలో వచ్చే పాడుతా తీయగా కొంత బెటరే… కానీ నాటి బాలు నేతృత్వంలో సాగిన పాడుతా తీయగా షోతో పోలిస్తే హస్తిమశకాంతరం… స్టార్ మాటీవీకి ఎలాగూ భిన్నాంశాలపై రియాలిటీ షోలు చేసే టేస్టు లేదు, చేసే టీమూ లేదు… రీచ్, డబ్బు ఉండగానే సరిపోదు…
డబ్బు ఖర్చు సంగతిని పక్కనపెడితే… ప్రేక్షకుడిని కనెక్ట్ చేసే అంశాలు ముఖ్యం… ఇండియన్ ఐడల్ హిందీ షోలాగే తెలుగులో కూడా పేరొందిన సంగీత దర్శకులు, సినిమా సెలబ్రిటీలను తీసుకొస్తున్నారు… ప్రత్యేకించి ఈ కోణంలో తమన్ పరిచయాలు, సర్కిల్, సంబంధాలే ప్రధానంగా ఆహా యాజమాన్యానికి ఉపయోగపడుతున్నయ్… కోటి, చిత్ర, తాజాగా డీఎస్పీని తీసుకురావడానికి తమనే కారణం… తన కారణంగానే వచ్చారు… చిత్ర, కోటి ఇతర చానెళ్ల షోలకు కూడా వెళ్తుంటారు… కానీ డీఎస్పీ ఓ రియాలిటీ షోకు రావడం తొలిసారి కావచ్చు, విశేషమే…
Ads
ఇటు డీఎస్పీ, అటు తమన్… ఇద్దరూ తెలుగు సినీసంగీతాన్ని ఏలుతున్నారు… టాప్ కంపోజర్స్… వృత్తి వైరం, పోటీ ఎలా ఉన్నా సరే, తెర వెనుక స్పర్థ ఎలా ఉన్నా సరే… ఇండియన్ ఐడల్ షోలో సింగర్ కార్తీక్ సహా హత్తుకున్న తీరు, పరస్పరం కాంప్లిమెంట్ చేసుకున్న తీరు బాగుంది… దేవిశ్రీ ప్రసాద్ అప్రోచ్ కూడా బాగుంది… తన కెరీర్ సంగతులు షేర్ చేసుకుంటూ షోను ఇంకాస్త రక్తికట్టించాడు…
ఫస్ట్ సీజన్‌లో వాగ్దేవి, వైష్ణవి వంటి కొందరికి సినిమా అవకాశాలు వచ్చాయి… ఫస్ట్ సీజన్‌ను చిరంజీవి, బాలయ్యలతో ముగించి గ్రాండ్ ఫినాలేను గ్రాండెస్ట్ ఫినాలేగా ముగించారు… సెకండ్ సీజన్ కూడా అదే రేంజులో సాగుతోంది… ఓ చిన్న ఆర్కెస్ట్రా బృందం ఈ షోకు సరిపడా ఇన్‌స్ట్రుమెంటల్ ఇన్‌పుట్ ఇవ్వగలుగుతోంది… ఎటొచ్చీ గీతామాధురే ఈ షోకు ఓ దిష్టిచుక్క… సెమీ ఫైనల్ దాటేసి ఫైనల్ వెళ్తోంది షో… ఆరుగురు మిగిలారు… అందరూ అందరే…
ప్రత్యేకించి సౌజన్య ఆల్‌రెడీ గెలిచినట్టే అనిపిస్తోంది… ప్రతి పాటకు జడ్జిల అభినందనలు పొందింది తప్ప ఒక్క రిమార్కూ రాలేదు ఆమెకు… నిజంగానే మెరిటోరియస్ ఆమె… పెళ్లయ్యాక చాన్నాళ్లు మ్యూజిక్ ఆపేసినా, తిరిగి ఫీనిక్స్ పక్షిలా ఉవ్వెత్తున ఎగిసిన ఆమె కెరీర్ అభినందనీయం… అమెరికా నుంచి వచ్చిన శృతి నండూరి పేరు కూడా చెప్పుకోవాలి… పాటల ఎంపిక వైవిధ్యంగా ఉంది, గొంతు బాగుంది… వీళ్లకు దీటైన పోటీ సిద్దిపేట లాస్యప్రియ… ఈ సెమీ ఫైనల్ ఎపిసోడ్‌లో జడ్జిలు అయ్యన్ ప్రణతి పాట తీరు పట్ల ఒకింత నిరాశను కనబరిచినా, పర్లేదు, నెక్స్ట్ పర్‌ఫామెన్స్‌కు రెడీ అయిపో అనే తమన్ వ్యాఖ్యల్ని బట్టి ఆమె స్టిల్ పోటీలో ఉన్నట్టే భావించాలా..? లేక స్పాట్ పెట్టేశారా ఆమెకు..? పైగా సెమీ ఫైనల్ నుంచి ఫైనల్‌కు ఎవరు వెళ్లాలో జడ్జిల మార్కులే నిర్దేశించబోతున్నాయి కూడా… సో, ఈ టాప్ ఆరుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తిని రేకెత్తించడంలో షో సక్సెసయింది…
Share this Article