ముందుగా ఓ కథ చెప్పుకుందాం… జయలలిత కొన్ని అంశాల్లో తింగరిదే గానీ… ఒకసారి కమిటైతే ఇక తన మాట తనే వినదు… ఓరోజు సిటీ పోలీస్ కమిషనర్‌ను పిలిచింది… సాధారణంగా డీజీపీని గానీ, హోం సెక్రెటరీని గానీ పిలిచి చెబుతుంటారు సీఎంలు ఎవరైనా, ఏదైనా… ఏకంగా తననే పిలిచేసరికి, పొద్దున్నే వెళ్లి, వణుకుతూ నిలబడ్డాడు… ఆమెకు ఎదురుగా నిలబడి, తొట్రుపాటు లేకుండా జవాబులు చెప్పడం చాలా పెద్ద టాస్క్… ఆమె ఓసారి తేరిపారచూసి అడిగింది…
జీవజ్యోతి భర్త మర్డర్ కేసు ఎక్కడి దాకా వచ్చింది..?
మేడమ్, ప్రధాన నిందితుడు శరవణన్ హోటళ్ల ఓనర్ రాజగోపాల్…
Ads
మరెందుకు ఇంకా వెయిట్ చేస్తున్నారు..?
మరీ, అదీ, మేడం, మరేమో… వీవీఐపీ కదాని…
నాన్సెన్స్… వాడు బయట కనిపించకూడదు… అసలు కనిపించకపోయినా పర్లేదు… అర్థమైందా..? నీదే బాధ్యత… మళ్లీ నాతో చెప్పించుకోకు, సరేనా..? ఎవడైనా ఇన్వాల్వ్ అయినా పట్టించుకోకు…
1979 నుంచీ శరవణన్ హోటళ్లు అంటేనే ఓ ట్రెండ్… శుచి, శుభ్రత, నాణ్యత… తమిళనాడులోనే కాదు, ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోనూ విస్తరించాయి అవి… అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా సహా 20 దేశాల్లో శరవణభవన్‌కు ఓ బ్రాండ్ ఇమేజ్ ఉంది… దాని ఓనర్ మీద మర్డర్ కేసు… అసలు ఏమిటీ ఈ మర్డర్…
నిజానికి కొందరు వ్యక్తుల బతుకుల్ని సక్సెస్ స్టోరీలుగా చెప్పుకుంటాం… స్పూర్తిగాథలుగా మీడియాలో ఎడాపెడా రాసేస్తాం… కానీ కొన్నిసార్లు మాత్రమే ఆయా వ్యక్తుల వికృతరూపాలు బయటికి కనిపిస్తాయి… ఈ రాజగోపాలుడి కథ కూడా అదే… మొదట్లో హోటళ్లలో టేబుళ్లు క్లీన్ చేసి, కిరాణా షాపుల్లో పనిచేసిన రాజగోపాల్ తరువాత ఎంత సంపాదించాడో తనకే లెక్క తెలియదు… తన దగ్గరే రామస్వామి అనే వ్యక్తి తన హోటళ్లలోనే అసిస్టెంట్ మేనేజర్‌గా చేసేవాడు… ఆయనకు జీవజ్యోతి అనే బిడ్డ… 1999 ప్రాంతంలో ఆమె 12వ తరగతి చదువుతోంది… ఓరోజు ఓ దరిద్రపు జ్యోతిష్కుడు ఆమెను చూసి… వాడికేం అనిపించిందో మరి… ఈమెను పెళ్లి చేసుకో, అన్ని దోషాలూ తొలగి, ఇంకా ఎదుగుతావు, లేకపోతే దెబ్బతింటావు అని చెప్పాడు…
రాజగోపాల్‌కు నమ్మకమైన జ్యోతిష్కుడు తను… కానీ తనకు అప్పటికే రెండు పెళ్లిళ్లయ్యాయి… రెండో భార్య కృత్తికకు ఆల్‌రెడీ పెళ్లయితే, భర్తతో విడదీసి మరీ పెళ్లిచేసుకున్నాడు… ఇక ఈ జీవజ్యోతి మీద కన్నుపడింది… ఆమె తండ్రి ఎలాగూ పేదవాడు, తన దగ్గరే ఉద్యోగి, బెదిరించి ఆమెను మూడో పెళ్లి చేసేసుకుందాం అనుకున్నాడు, ప్రయత్నించాడు… అప్పటికే తనకు అమ్మాయిల పిచ్చి… మనసు పడితే చాలు మంచం ఎక్కాల్సిందే… ఈ జోస్యాల పైత్యం సరేసరి… బెదిరించాడు, ప్రలోభపెట్టాడు, కానీ ఆమె వినలేదు… అప్పటికే ప్రిన్స్ శాంతకుమార్‌ను ప్రేమించింది, ఇక రాజగోపాల్ వదిలేట్టు లేడని గ్రహించి, రామస్వామి బిడ్డను తీసుకుని సొంతూరుకు వెళ్లిపోయాడు… నిజంగానే రాజగోపాల్ వదల్లేదు…
9 మంది ముఠాకు డబ్బులిచ్చాడు… సినిమాల్లోలాగే 2001లో జీవజ్యోతి భర్తను హత్య చేయించాడు… డబ్బుంది కదానే బలుపు… మొదట్లో కేసు కదల్లేదు… జీవజ్యోతి ఏడుపు ఎవరికీ పట్టలేదు… కానీ మీడియా పట్టుకుంది… వెంటబడింది… హైప్రొఫైల్ నిందితుడు కదా… పైగా పిచ్చి జోస్యాల లింకు కూడా ఉంది… అలా జయలలిత వద్దకు చేరింది సమాచారం… వాడు ఎవడైతేనేం..? ఓ పట్టుపట్టండి అని పోలీసులకు చెప్పింది… మొరాయిస్తే అసలు కనిపించకుండా పోతావని హింట్ అందింది రాజగోపాల్‌కు… లొంగిపోయాడు… అదీ స్టోరీ…
కేసు విచారించిన కోర్టు పదేళ్ల జైలు శిక్ష వేసింది… కొన్నాళ్లకు బెయిల్ తెచ్చుకున్నాడు… కానీ పోలీసులు వెంటబడ్డారు… 2009లో హైకోర్టు ఆ పదేళ్ల జైలు శిక్షను కాస్తా యావజ్జీవ శిక్షగా మార్చింది… సచ్చింది గొర్రె… సుప్రీంకోర్టు వెళ్లాడు… అపెక్స్ కోర్టు కూడా హైకోర్టు నిర్ణయం సరైందే అని తీర్పు చెప్పింది… ఇక దిక్కులేక కోర్టులో లొంగిపోయాడు… ఆరోగ్యం దెబ్బతింది… చికిత్స కూడా ఎదురుతన్నింది… జైలుశిక్ష ప్రారంభమైన పదిరోజులకే చచ్చిపోయాడు…
సొంతూరుకు వెళ్లి, ఓ చిన్న హోటల్ పెట్టుకుంది జీవజ్యోతి… అది ఆమె తల్లి చూసుకునేది… తనేమో టైలరింగ్ షాపు పెట్టుకుంది… వధువుల డ్రెస్సులు కుట్టేది ఎక్కువగా… 18 ఏళ్లు పోరాడింది ఈ కేసులో… కోట్ల డబ్బును ఇస్తాను, కేసు విత్‌డ్రా చేసుకో, కోర్టులో మేం చెప్పినట్టు చెప్పు అని అడిగించాడు రాజగోపాల్ పలుసార్లు… లేకపోతే నిన్నూ ఖతం చేయిస్తాను అని బెదిరించాడు… ఆమె వినలేదు… వాడు చనిపోయి కూడా మూడేళ్లు అవుతోంది… మరి ఈ కథ ఇప్పుడెందుకు అంటారా..?
జైభీమ్ సినిమా తీసి ప్రశంసలు అందుకున్న జ్ఞానవేల్ తెలుసు కదా… ఇప్పుడు తను జీవజ్యోతి కథను తెరకెక్కిస్తున్నాడు… అదీ తమిళంలో కాదు… హిందీలో… సినిమా పేరు దోశా కింగ్… సూపర్… నిజంగానే ఆమె కథ బియాండ్ సినిమా కథ… అన్నిరకాల ఎమోషన్స్ ఉన్నాయి… తల్వార్, రాజీ సినిమాల నిర్మాణాల్లో భాగస్వాములైన జంగ్లీ పిక్చర్స్ ఈ జీవజ్యోతి సినిమాను నిర్మిస్తోంది… ఈ కేసుపై తమిళంలో, ఇంగ్లిషులో కొన్ని వందల కథనాలు వెలువడ్డాయి… కథ రాసుకోవడం పెద్ద కథేమీ కాదు… జరిగిన కథ జీవజ్యోతే చెబుతుంది… నిరుపమ సుబ్రహ్మణ్యన్ “Murder on the Menu” పేరిట ఓ పుస్తకం కూడా రాసింది… గుడ్… జ్ఞానవేల్, ఆల్‌దిబెస్ట్…!!
Share this Article