Suma Bala ……… #jamuna ……. వెండితెర సత్యభామ – ముక్కుమీద నీడ… ఏబీఎన్ లో పనిచేస్తున్న రోజులు.. ఓ ప్రోగ్రాం కోసం అలనాటి నటి జమున ఇంటర్వ్యూ కోసం వెళ్లాం. అక్కడ జరిగిన ఓ చిన్న సంఘటన ఇది.. చిన్నప్పటి నుంచి పాత సినిమాలు చూడడం బాగా అలవాటు. అది మా నాన్నద్వారా అబ్బిందని చెప్పాలి. ఆయన పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూడడమే కాదు. వినేవాడు కూడా. అంటే ఇంట్లో ఆ సినిమాల టేప్ రికార్డ్ క్యాసెట్లు ఉండేవి. వాటిల్లోనే ఎన్నోసార్లు శ్రీకృష్ణపాండవీయం, మాయాబజార్, గుండమ్మకథ, మూగమనసులు.. లాంటి ఎన్నో పాత సినిమాలు చాలాసార్లు వినేవాళ్లం. వారానికి ఒక్కసారైనా అవి వినాల్సిందే.
నాన్న పెట్టడమే కాదు.. ఆయన చేసిన అలవాటు వల్లేమో.. బోర్ కొడితే అవి స్వయంగా పెట్టుకుని వినడం అలవాటయ్యింది. ఆ తరువాత టీవీలో ఆ సినిమాలు చూసినప్పుడు తెగ ఆశ్చర్యపోయేదాన్ని.. టేప్ రికార్డ్ లోని నటుల వాయిస్ కి… తెర మీది వారి యాక్షన్ మ్యాచ్ చేసుకుని.. సంబరపడేది. అలాంటి నటుల్లో.. మీరజాలగలడా.. అని ఓ అలవిమాలిన ఆభిజాత్యం, నన్ను దాటిపోలేడన్న చిన్న నవ్వు.. కలిపిన ఓ అందమైన ఎక్స్ ప్రెషన్ సొంతమైన ఓ అద్భుతమైన అలాంటి నటిని కలవడం అంటే మాటలా చెప్పండి..
ఆమె దగ్గరికి వెళ్లడానికి క్వశ్చన్స్ చాంతాడంత తయారు చేసుకుని వెళ్లాను. ఎలా అడగాలి.. ఏం మాట్లాడాలి.. సాధారణంగా అప్పటికే కొంత పెద్దవాళ్లను.. ముఖ్యంగా సినిమా లెజెండ్స్ ను ఇంటర్వ్యూ చేసిన అనుభవం కాబట్టి.. వారితో ఎంత జాగ్రత్తగా ఆచీతూచీ మాట్లాడాలి. లేకపోతే చీవాట్లు తప్పవు అన్న విషయం తెలుసు కాబట్టి.. అన్నీ మననం చేసుకుంటూ వెళ్లా.. నాతో పాటు నా టీమ్ వేణు, ఇంకొకరు కూడా వచ్చారు. ఇంటర్వ్యూ మొదలుపెట్టాలి.. కెమెరా సెట్ చేస్తున్నాం..
Ads
అప్పటికే ఆమెకు 70 యేళ్లు ఉండొచ్చు. అది 2009-10 సమయంలో చేసిన ఇంటర్వ్యూ. ఆమె కెమెరాలు గమనిస్తున్నారు. కాసేపు మాతో పిచ్చాపాటి మాట్లాడి మమ్మల్ని ఫ్రీ చేశాక.. ఇక షూటింగ్ మొదలెడదాం అన్నప్పుడు ఆమె చెప్పిన మాట మేము ఆశ్చర్యపోయాం.. ‘కెమెరా అక్కడ పెడితే.. షాడో నా ముక్కుమీద పడుతుంది. యాంగిల్ మార్చండి’ అన్నారు. అందరం ఒక్కసారి సైలెన్స్. అది త్రీ కామ్ సెటప్.. సో ఒక్కటి మారిస్తే సరిపోదు. దీంతో కెమెరామెన్లు విసుగు.. చాదస్తం అంటూ సణుక్కోవడం సన్నగా వినిపిస్తుంది.
కానీ, నాకు మాత్రం తెగ ఆశ్చర్యమేసింది. ఈ వయసులో కూడా ఆమెకు కెమెరా ఎక్కడ పెడితే.. ఎక్కడ లైటింగ్ వస్తుంది.. దానివల్ల తాను ఎలా కనపడతానన్న శ్రద్ధ.. వార్నీ అనిపించింది. అందుకే కదా ఆమె లెజెండ్ అనుకున్నాను. ఈ నిక్కచ్చితనమే కదా.. ఇండస్ట్రీలో ఆమెకు అహంకారి అన్న బిరుదును ఇచ్చినా, ఎన్టీఆర్, ఏఎన్నార్ తమ సినిమాల్లో బ్యాన్ పెట్టినా.. తనేంటో నిలబడేలా చేసింది అనిపించింది.
అంతకుముందు ఇంటర్వ్యూకు వెళ్లేముందే కొంతమంది చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. మరీ ఛాదస్తం.. సతాయిస్తుంది.. నచ్చకపోతే తిట్టేస్తుంది.. జాగ్రత్త.. ఇలాంటివి కానీ నాకయితే.. అది ఆమె డిజర్వ్ అనిపించింది. అక్కడికి వెళ్లాక ఆమె గురించి తెలియని విషయాలు కొన్ని కొత్తగా తెలుసుకున్నా… సినిమాల్లో ఉండేవాళ్ల జీవితం అంత కలర్ ఫుల్ గా ఉండదు. తామే దిద్దుకోవాలి. ఆమె సినిమారంగంతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. పిల్లలు కూడా సినిమాలకు దూరంగానే పెరిగారు. ఓ మంచి ఎడ్యుకేటెడ్, సంప్రదాయ కుటుంబంలా తన వ్యక్తిగత జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారు.
మాటల సందర్బంలో మహానటి సావిత్రి గురించి కూడా చెప్పుకొచ్చారు. తమ ఇంటిపక్క స్థలం చూపిస్తూ.. ఇది సావిత్రక్కదే.. చేతికి ఎముక లేకుండా దానాలు చేసి పోగొట్టుకుంది అని చెప్పుకొచ్చారు. అప్పటికి నాకు సావిత్రి ఎలా చనిపోయిందిలాంటి విషయాలేమీ తెలియవు. అలా ఆమెతో ఆఫ్ ది రికార్డ్ కూడా చాలాసేపు మాట్లాడి బయటపడ్డాం.. ఈ రోజు ఆమె లేరన్న విషయం వినగానే బాధతో ఇది గుర్తొచ్చింది. ఆ రోజు ఆమెతో మేము తీసుకున్న ఈ చిన్న జ్ఞాపకం.. https://www.youtube.com/watch?v=ztbjxibVFYU
Share this Article