ఒక తాజా సినిమా పోస్టర్ ఆసక్తికరంగా అనిపించింది… వాల్స్ మీద పోస్టర్ల కాలం పోయింది కదా, ఫేస్‌బుక్ వాల్స్ మీద కనిపించిన పోస్టరే… సినిమా పేరు సిందూరం… దానికి ఓ ట్యాగ్ the reinterpretation of the revolution అని ఉంది… అంటే విప్లవానికి పునఃబాష్యం… కాస్త సరళంగా చెప్పాలంటే విప్లవానికి పునర్వివరణ… ఇప్పటిదాకా చెప్పబడిన విప్లవ నిర్వచనాలు, వివరణలు వేరు… ఈ దర్శకనిర్మాతలు కొత్త వివరణ ఏదో ఇస్తారన్నమాట… గుడ్… (చాలా ఏళ్ల క్రితం కూడా సిందూరం పేరుతో ఓ సినిమా వచ్చింది తెలుగులో…)
పోస్టర్ చూడగానే… ఆ స్థూపం, అయిదు తుపాకులు, కాస్త దూరంలో ఊరు, స్థూపం మీద శాంతిపావురం… అకస్మాత్తుగా విరాటపర్వం గుర్తొచ్చింది… అంటే స్మారకస్థూపం చూడగానే అని కాదు… ఆ సినిమాకు కూడా ఇలాంటిదే ఓ ట్యాగ్ ఉంటుంది… revolution is act of love… ఆ ఫిలాసఫీ ఏంటో జనానికి ఎక్కలేదు… వెరసి సినిమా ఎన్‌కౌంటరైపోయింది… సరే, ఓ అమాయక ఇన్‌ఫార్మర్‌లాగే హతమారిపోయింది… అవునూ, హఠాత్తుగా విప్లవానికి ఇలా రకరకాల బాష్యాలు చెప్పే పనిలో పడ్డారెందుకో మరి తెలుగు దర్శకులు..? నక్సలిజం కూడా సినిమాలకు సేల్ పాయింట్ అయిపోతోందా..?
Ads
వాళ్లు చెప్పే ఫిలాసఫీలోని లోతు, గాఢత మనకు అర్థం కావు గానీ… పోస్టర్ మాత్రం బాగుంది… బహుశా కొన్నాళ్లు ఈ సినిమాకు బ్రిగిడా సాగా (పవి) సేల్ పాయింట్ అవుతుంది… ఆమె ఎవరు అంటారా..? ఈమధ్య తమిళంలో హిట్టయిన ఇరవిన్ నిఘల్ సినిమాలో బరిబాతల నటించింది… ఆమె సిందూరంలో నటిస్తోంది… నిజానికి ఆ సినిమాలో ఆమె వివస్త్రగా కనిపించినా, దానికి కథలో పెద్ద ప్రాధాన్యం లేదంటారు… హీరో, దర్శకుడు పార్తీపన్ దాన్నొక సేల్ పాయింటుగా తీసుకున్నాడు… (పార్తీపన్ అంటే తెలుసు కదా… నటి సీత మాజీ మొగుడు)…
ఆ సినిమాకు ఓ విశిష్టత ఉంది… ఒకే షాట్‌లో సినిమాను పూర్తిచేసేశారు… అదొక రికార్డు… సినిమా కథ, కథనం ఎలా ఉన్నా పార్తీపన్ వైవిధ్యం కోసం ప్రయత్నించాడు… అసలు తమిళ దర్శకులంటేనే ప్రయోగాలు కదా…! 20 కోట్ల దాకా ఖర్చు చేస్తే 80, 90 కోట్ల దాకా కలెక్ట్ చేసింది… ఇంకేముంది..? తెలుగులో కూడా తీసుకొస్తారేమో… అదేదే మ్యూజిక్ ప్లాట్‌ఫామ్ మీద ఓ పాట తాలూకు పోస్టర్ కనిపించింది… ఏఆర్‌రెహమాన్ సంగీతం కదా, కాస్త డిమాండ్ ఉంటుంది… పనిలోపనిగా కన్నడ, మలయాళం, హిందీల్లో డబ్ చేసిపారేస్తే సరి… పాన్ ఇండియా అయిపోతుంది…
సినిమా పేరు అంటారా..? భలేవారే ఇరవిన్ నిఘల్ అనే పెట్టేస్తారేమో… అంటే తెలుగులో చీకటి నీడ (Shadow of the Night) అని అర్థం… రాత్రికి లేదా చీకటికి నీడ ఉంటుందా..? అబ్బా… సినిమా టైటిళ్లకు కవి హృదయాలు ఉంటాయి తప్ప అర్థాలు ఉండవండీ బాబూ… పైగా ఇప్పుడు ట్రెండ్ తమిళ, మలయాళ టైటిళ్లను అలాగే తెలుగులోనూ పెట్టేయడం… వలిమై గుర్తుంది కదా… సేమ్, మాయోన్, కడువా… వెబ్ సీరీస్ అయినా అంతే… సుడల్ అని వచ్చిందిగా… త్వరలో వల్లి మయిల్ అని మరో టైటిల్ వస్తోంది… ఐనా మనకు కూడా పొరుగు భాష రుచి కదా… ఈ ట్రెండ్ కొన్నిరోజులు… కానివ్వండి…
సిందూరం సినిమాకు వద్దాం… ఈ బ్రిగిడకు కాస్త నాలుక యాక్టివ్… ఇరవిన్ సినిమాలో స్లమ్ భాష మీద ఏవో వ్యాఖ్యలు చేసింది… దుమారం లేచింది… దాంతో క్షమాపణ చెప్పుకుంది… తనతోపాటు పార్తీపన్ కూడా చెప్పుకోవాల్సి వచ్చింది… అలాగే ‘‘నేనెందుకు బట్టల్లేకుండా నటించానంటే…’’ అని పదే పదే ఇంటర్వ్యూల్లో చెప్పుకుంటోంది… ప్రమోషన్ కోసం అదొక సేల్ పాయింట్ అని చెప్పుకున్నాం కదా… ఇక విరాటపర్వం విడుదలకు ముందు సాయిపల్లవి మతహింస వ్యాఖ్యల వివాదం తెలిసిందే కదా… సో, సిందూరం కూడా విరాటపర్వం బాటలోనే ఉండబోతోందన్నమాట… ట్యాగులు, విప్లవం, కొత్త బాష్యాలు, తుపాకుల వంటి హీరోయిన్ల చురుకు నాలుకలతో సహా..!!
Share this Article