Nancharaiah Merugumala…………….. కశ్మీర్ ఫైల్స్ ‘పాపం’ టైగర్ నాగేశ్వరరావుతో కడిగేసుకోవచ్చని గుర్తించిన అగర్వాల్స్..? మూడు దశాబ్దాల నాటి కశ్మీరీ పండితుల బలవంతపు వలసలు, ఇంకా తీరని వారి కష్టాలపై సినిమా తీసిన వివేక్ అగ్నిహోత్రి, పల్లవీ జోషీ దంపతులకు పెట్టుబడులు అందించిన అభిషేక్ అగర్వాల్, ఆయన అన్న తేజ్ నారాయణ్ అగర్వాల్ ఇప్పుడు స్టువర్ట్‌పురం పెద్ద దొంగగా మా తరం వారికి సుపరిచితుడైన ‘టైగర్’ నాగేశ్వరరావుపై తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో సినిమా నిర్మిస్తున్నారనే విషయం నిజంగానే వార్తే.
కశ్మీరీ పండితులపై తీసిన సినిమా వివాదంతో విజయవంతమైంది. హిందూ–ముస్లిం గొడవలు, ఇంకా అనేక సంబంధిత అంశాలపై తెంపులేని చర్చలకు దారితీసింది ఈ చలనచిత్రం. 1987లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా పోలీసు ‘ఎన్‌కౌంటర్’లో కన్నుమూసిన టైగర్ నాగేశ్వరరావు అంతిమ యాత్ర ఆ రోజుల్లో నిజంగా తెలుగు పత్రికల్లో పెద్ద వార్త. వేలాది మంది జనం ‘టైగర్’ శవం వెనుక నడవడం, వారు ఆయన మరణంపై కన్నీరు మున్నీరవడం అతని గురించి తెలియనివారికి ‘తీవ్ర దిగ్భ్రాంతి’ కలిగించింది.
Ads
నాగేశ్వరరావు దోపిడీలు, దొంగతనాలు చేసినా ఆ సొమ్ములో చాలా వరకు లేనివాళ్లకు ఇచ్చి ఆదుకోవడం గురించి కథలు కథలుగా నాటి పత్రికల్లో వచ్చాయి. 1970లు, 1980ల్లో టైగర్ పేరు చెబితే పోలీసులు భయపడేవారని అంటారు. ఎరుకల కులంలో పుట్టిన నాగేశ్వరరావు భారీ దోపిడీలు సునాయాసంగా చేసేవాడని పేరు. 1975–76 ప్రాంతంలో మా కాలేజీ నుంచి మా సహవిద్యార్థుల ఎన్ ఎస్ ఎస్ బృందం స్టువర్ట్‌పురం వెళ్లి అక్కడి ఎరుకలతో కొన్ని రోజులు గడిపి వచ్చారు.
నా క్లాస్‌మేట్ నల్లపరెడ్డి కోటిరెడ్డి ఈ బృందం సభ్యుడిగా ఈ మాజీ దొంగల ఊరెళ్లి తన అనుభవాలు ఆసక్తికరంగా చెప్పిన విషయం ఇంకా గుర్తుంది. చిన్న గట్టి పుల్లతో పన్నెండేళ్ల కుర్రాడు ఎలా పెద్ద తాళం తీసిందీ కోటిరెడ్డి వర్ణించిన తీరు మరిచిపోలేని అనుభవం. అనుసూచిత జాతుల్లో (ఎస్టీ) భాగమైన ఎరుకల గురించి పాత పుస్తకాలు తిరగేసి వారి వృత్తులు ఎలా మారిపోయాయో వ్యాసాలు రాశారు. స్టువర్ట్‌పురం దొంగలు, స్టువర్ట్‌పురం పోలీస్ స్టేషన్ అనే తెలుగు సినిమాలు వచ్చినాగాని టైగర్ నాగేశ్వరరావు ‘బయోపిక్’ ఎందుకో రాలేదు.
బెజవాడ ‘వర్గ పోరాటం’, రౌడీయిజం గురించి సినిమాలు తీసిన పెన్మత్స రాంగోపాల్ వర్మ అనే సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ మాజీ విద్యార్థి తన ‘వైభవం’ ముగిసిన చాలా ఏళ్లకు వంగవీటి, దేవినేని అనే రెండు ‘సమరశీల’ కుటుంబాల చరిత్రపై సినిమాలు తీశారు. కాని, ఈ రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు (దేవినేని మురళి, వంగవీటి మోహన రంగారావు) ప్రత్యర్థుల కత్తులకు నేలకొరిగిన ఏడాది ముందే పోలీసుల చేతుల్లో హతుడైన టైగర్ నాగేశ్వరరావు గురించి వర్మకు తెలుసో తెలియదో.
మురళీ, రంగా ఒకే సంవత్సరం (1988)లో 9 నెలల తేడాతో హత్యకు గురైతే, అంతకు ముందు ఏడాది నాగేశ్వరరావు స్టువర్ట్‌పురంలో పోలీసు తూటాలకు బలి అయ్యాడు. మొన్న ఉగాది రోజున టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రారంభ కార్యక్రమంలో మెగాస్టార్ కొ. చిరంజీవి గారు, ‘టైగర్ నాగేశ్వరరావు దొంగ అంటారుగాని, ఆయన పేదలకు ఎంతో మేలు చేశారని విన్నా,’ అంటూ చాలా గొప్పగా మాట్లాడడం వినడానికి చాలా బావుంది.
తోటి రాజుల దర్శకుడు రామూ పట్టించుకోని టైగర్ నాగేశ్వరరావు పాత్రలో మరో సినీ రాజుల హీరో రవితేజ నటించడం కూడా బాగుంది. మొత్తానికి కశ్మీరీ బ్రాహ్మణుల కష్టాలపై సినిమా నిర్మించడంలో కీలకపాత్ర పోషించిన ఉత్తరాది పెద్ద కోమట్లు (అగర్వాల్స్) అభిషేక్, తేజ్ నారాయణ్ –గుంటూరు జిల్లా ఎరుకల వీరుడిపై ఎంతో వ్యయంతో నాలుగు భాషల్లో సినిమా తీయడం మా తరం వారికి నచ్చుతుంది. ఈ సందర్భంగా స్టువర్ట్‌పురానికే చెందిన మరో గజదొంగగా పేరుమోసిన గజ్జెల ప్రసాద్ జీవిత విశేషాలపై కూడా తెలుగులో సినిమా వస్తే ఎలా ఉంటుందో!
ఏదేమైనా మన దేశంలో అగర్వాల్స్ గొప్పోళ్లు. లాభాల వేటకే పరిమితం కాకుండా ‘అందోళన జీవులు’గానూ కీలక పాత్ర పోషించడానికి వారు ఇష్టపడతారు. రాజకీయాల్లో దిగ్గజాలను (నెహ్రూ, ఇందిర, సోనియా, రాహుల్ గాంధీ) ఢీకొని కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించిన డాక్టర్ రామ్ మనోహర్ లోహియా నుంచి అరవింద్ కేజ్రీవాల్ వరకూ అగ్రవాల్స్ చరిత్ర సృష్టించారు. మరి అత్యంత చర్చనీయాంశమైన కశ్మీర్ ఫైల్స్ సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న ఇద్దరు అగర్వాల్స్ ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు సినిమా తీయడంలో ప్రధాన పాత్ర పోషించడం వారి తెలివితేటలకు చక్కటి నిదర్శనం. చల్లటి కశ్మీర్ నుంచి వళ్లు మండించే స్టువర్ట్‌పురం దాకా రావడం మంచి భారతయాత్ర…
Share this Article