ఇప్పటిది కాదు… దాదాపు ఇరవయ్యేళ్ల క్రితం… 2001 జూలై… ఒడిశా రాజకీయాలు… నవీన్ పట్నాయక్ అప్పుడప్పుడే పట్టు సాధిస్తున్నాడు… సొంత ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు… అప్పటికి ఇంకా ముదరలేదు కూడా… జనతాదళ్ పార్టీని చీల్చి, తన తండ్రి పేరుతో పెట్టిన బిజూ జనతాదళ్ పార్టీకి తను అధ్యక్షుడే అయినా… రోజువారీ రాజకీయ వ్యూహాలకు ఒకరిద్దరు ముఖ్యులు, సీనియర్లపై ఆధారపడేవాడు, విశ్వసించేవాడు… తప్పదు, అప్పటిదాకా నవీన్ బతుకుధోరణి వేరు… ఢిల్లీ నుంచి వచ్చి భువనేశ్వర్ రాజకీయాల్లో పడ్డాడు… ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి… ఎన్ని సవాళ్లు ఉంటాయో తెలుసు కదా… పైగా బలమైన ప్రతిపక్షం, తనది బీజేపీతో కలిసి అధికారం… తను బాగా విశ్వసించిన వారిలో ఒకరు నళినీకాంత మొహంతి… ఆయన బిజూ జనతాదళ్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్… అంటే పార్టీలో, ప్రభుత్వంలో ఎంతటి కీలక స్థానమో తెలుస్తోంది కదా… నవీన్ పట్నాయక్ తరువాత ఆయనే పవర్ఫుల్… ప్రభుత్వ పనులు, హౌజింగు, పట్టణాభివృద్ధి మంత్రి ఆయన… అప్పటికి రెండు దశాబ్దాలుగా ఆయన ఎమ్మెల్యే…
సచివాలయంలో ముఖ్యమంత్రి ఆఫీసు ఉన్న ఫ్లోర్ కిందే ఈ మొహంతి ఆఫీసు ఉండేది… ఆరోజు సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్లడానికి రెడీ అవుతూ టీవీ ఆన్ చేశాడు ఎందుకో… లోకల్ టీవీ చానెళ్లు ఓ వార్తను పదే పదే బ్రేకింగ్ న్యూస్ అంటూ ప్రసారం చేస్తున్నాయి… ఆ వార్త సారాంశం ఏమిటంటే..? ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన మంత్రివర్గంలోని ముగ్గురు మంత్రులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నాడు, ఈమేరకు గవర్నర్‌కు లేఖ రాశాడు… ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయమే ఒక ప్రకటనలో తెలిపింది… ఇదీ వార్త… ఆ ముగ్గురు మంత్రుల్లో ఒకరు ఈ నళినీ మొహంతి… పార్టీలో నంబర్ టూ… మోస్ట్ సీనియర్… టీవీలో వార్తలు చూస్తూ అలా చేష్టలు దక్కి నిలబడిపోయాడు… నమ్మలేక కాదు, అంతకు ముందు నవీన్ ఓ కేంద్ర మంత్రిని కూడా వదుల్చుకున్నాడు… కానీ ఈసారి చడీచప్పుడు లేకుండా తనపై వేటు పడటం ఏమిటో అర్థం కాలేదు తనకు… ఇంతగా వాళ్ల నడుమ సంబంధాలు క్షీణించడం ఏమిటో పార్టీ, ప్రభుత్వ వర్గాలకూ అర్థం కాలేదు…
Ads
తనతోపాటు బీజేపికి చెందిన మంత్రులు (సంకీర్ణ ప్రభుత్వం) కమలాదాస్, ప్రశాంత నంద కూడా ఉద్వాసనకు గురయ్యారు… ఇదేమిటి ఈ హఠాత్ నిర్ణయం అనడిగిన విలేకరులకు ‘‘వాళ్లు ముగ్గురూ అవినీతి ఛాయలోకి వచ్చారు, ఈ కఠిన నిర్ణయం తప్పలేదు’’ అని అత్యంత సంక్షిప్తంగా సమాధానం ఇచ్చేసి తన చాంబర్లోకి వెళ్లిపోయాడు ముఖ్యమంత్రి… ఈ మొహంతి ఆఫీసుకు జస్ట్, ఒక అంతస్థుపైనే ముఖ్యమంత్రి ఆఫీసు… ఆ పక్కనే ఉన్న మెట్ల మీదుగా వెళ్లి బోలెడు ప్రభుత్వ, పార్టీ వ్యవహారాల గురించి నవీన్‌తో చర్చించడం అలవాటే… తనే స్వయంగా తలుపు తీసుకుని ముఖ్యమంత్రి టేబుల్ దగ్గరకు వెళ్లి కూర్చునేంత చనువు… తనే సీఎంకు వివరణ ఇద్దామని అనుకున్నాడు… మెట్లు ఎక్కి, సీఎం ఆఫీసు దగ్గరకు ఇంకా చేరనేలేదు… మొత్తం సెక్యూరిటీ పెంచారు అక్కడ… ఎప్పటికన్నా కాస్త ఎక్కువ మంది పోలీసులు కనిపించారు… ఈగల్ని కూడా లోనికి రానివ్వడం లేదు… అనివార్యంగా తను అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది… చేసేదేమీ లేక వెనుతిరిగాడు… అలా వెళ్లిపోయిన ఆయన మళ్లీ ఎప్పుడు సచివాలయానికి రాలేదు..!! కథలో నీతి :: రాజకీయాలు ఎప్పుడూ క్రూరమైనవే… బయటివాళ్లకే కాదు, సొంత పార్టీ వాళ్ల పట్ల కూడా… కాకపోతే టైమ్, టైమింగు తేడా… అంతే… కసుక్కున దిగుతాయి…!!
Share this Article