మనం ఎప్పటి నుంచో గణాంకాలు, ఉదాహరణలతో సహా చెప్పుకుంటున్నాం కదా… టీవీక్షణం తగ్గిపోతోందని… ప్రత్యేకించి ఎంత సూపర్ హిట్ సినిమాలైనా సరే, తోపు హీరోల సినిమాలైనా సరే, టీవీల్లో చూడటానికి పెద్దగా ఎవడూ ఇష్టపడటం లేదు… కారణాలు అనేకం… కాకపోతే మీడియాలో ప్రింట్ మీడియా (పత్రికలు) దెబ్బతిన్నట్టే, క్రమేపీ టీవీ ప్రోగ్రామ్స్ కూడా దెబ్బతింటున్నాయి… ఇంకా తినబోతున్నాయి… ప్రధాన కారణం ఓటీటీలు… సేమ్, థియేటర్లను దెబ్బతీస్తున్నట్టే ఓటీటీలు టీవీలనూ దెబ్బతీస్తున్నాయి…
థియేటర్లలో సరిగ్గా ఆడని సినిమాలను టీవీ బ్రాడ్‌కాస్టర్లు కొని ప్రసారం చేసినా పెద్దగా ఎవరూ చూడటం లేదు… చాలా మంది చూస్తారని ఎక్కువ డబ్బు ఇచ్చి కొనుగోలు చేసినా ఎవరూ చూడటం లేదు… కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ వంటి అధిక వసూళ్ల సినిమాలు సైతం టీవీల్లో పెద్దగా రేటింగ్స్ సాధించలేదు… ఇప్పుడు టీవీ బ్రాడ్‌కాస్టర్లకు సోయి కలుగుతోంది… అడ్డగోలు డబ్బు పెట్టడానికి ఇప్పుడు వెనకాడుతున్నారు… టీవీ ఇండస్ట్రీకి ఇది సంధికాలం… లేదా రాబోయేది మరింత నష్టదాయక కాలం…
టీవీలో మూవీ చూడాలంటే… అది వచ్చే టైమ్‌కు టీవీ ముందే కూర్చోవాలి, మధ్యలో ప్రకటనలు చావగొడతాయి… కానీ ఓటీటీలో అదే సినిమా చూస్తే… మనం ఇష్టం వచ్చినప్పుడు ఆపొచ్చు, వెనక్కి రీవైండ్ చేసి, నచ్చిన సీన్ మళ్లీ మళ్లీ చూడొచ్చు, ప్రకటనలు పెద్దగా ఉండవు… ఇదీ సౌలభ్యం… అన్నింటికీ మించి ఓటీటీ ఓపెన్ చేస్తే నాణ్యమైన ఇతర భాషా చిత్రాలను సైతం ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో ఎంచక్కా ఎంజాయ్ చేయవచ్చు…
Ads
నిజానికి టీవీక్షణం కోవిడ్ సమయంలో బాగా పెరిగిందని అందరూ భ్రమపడ్డారు… కానీ అది పొంగు మాత్రమే… అప్పటికే ఓటీటీ జోరు స్టార్టయిపోయింది… బాక్సాఫీసును మెప్పించలేకపోయిన పలు సినిమాల్ని బ్రాడ్ కాస్టర్లు కొనుగోలు చేయడానికి కూడా ఇష్టపడలేదు… సో, ఎంతోకొంత ధర, సినిమా రిలీజుకు ముందే టీవీ రైట్స్ అమ్మేసుకోవడం బెటర్ అనుకుంటున్నారు నిర్మాతలు… ఐనా నిర్మాతలు వెనకాముందాడుతున్నారు… టీవీలకు ప్రకటనల ఆదాయం పడిపోయింది… ప్రకటనల ఆదాయం 40 శాతం తగ్గిందని మింట్ రిపోర్టు చెబుతోంది… ఇది ఇంకా తగ్గబోతోంది…
మనం సాధారణంగా సినిమా వార్తలు చదువుతున్నప్పుడు శాటిలైట్ టీవీ రైట్లు ఇంత భారీ ధరలకు అమ్ముడుబోయాయని చదువుతుంటాం… కానీ కరెక్టు కాదు… కోవిడ్‌కన్నా ముందు కాలంతో పోలిస్తే ఇప్పుడు ఆ రేట్లు సగానికి సగం పడిపోయాయి… పాపం శమించుగాక… రాబోయే రోజుల్లో నిర్మాతలు శాటిలైట్ టీవీ రైట్స్ ద్వారా పెద్దగా ఆశించకూడదు… పల్లీబఠానీ రేట్లకన్నా అధ్వానం కాబోతున్నయ్… కుటుంబసభ్యుల అభిరుచులు మారుతున్నయ్… అందరూ ఒకేచోట కూర్చుని ఒకే షో, ఒకే సినిమా చూడటం అరుదు… ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చదు… రాజీపడరు… ఒక చానెల్‌కు కమిటైపోరు… సో, ఎవరి పరికరం వాళ్లదే… మొబైల్, ట్యాబ్, ల్యాపీ… ఎవరికి నచ్చిన ప్రోగ్రాం వాళ్లు చూస్తారు… ఎటొచ్చీ టీవీకే నిరాదరణ… ఇంట్లో వృద్యాప్యం మీదపడినట్టుగా…!!
Share this Article