.
సాగరసంగమం సినిమాలో బోలెడు సీన్లు పదే పదే గుర్తొస్తుంటాయి… ఏక్‌సేఏక్… ఐతే కమలహాసన్ కోణంలో, అంటే తను బాగా నటించిన కొన్ని సీన్లు చూస్తే…
రిక్షావాడిని తన చెప్పుల్ని తన వైపు విసిరేయమనడం… శైలజకు డాన్సులు చేసి చూపిస్తుంటే కాలు తగిలి అటెండర్ పట్టుకున్న ట్రేలోని గ్లాసులు ఎగిరిపడి, ఒకటి శైలజ కాళ్ల దగ్గర డాన్స్ చేయడం, శైలజ ఫియాన్సీని చెంపదెబ్బ కొట్టడం, ఆఫీసు నుంచి వెళ్తుంటే అటెండర్ నమస్తే సార్ అనడం…
Ads
ఖైరతాబాద్ గణుషుడి ఎదుట డాన్స్… తన ఆర్టికల్ చూశాక గది నిండా ఆ క్లిప్పింగులు అతికించి శరత్‌బాబుతో కలిసి కేకలు వేస్తూ ఎగరడం, అమ్మ శవం దగ్గర డాన్స్, జాతీయ నాట్యోత్సవం ఆహ్వానపత్రికలో తన ఫోటో చూసి జయప్రద చేతిని ముద్దాడటం, జయప్రదను తన భర్తతో పంపించడానికి ముందు బీచులో డాన్స్, బావి అంచుల మీద డాన్స్,.. ఇలా ఎన్నని..? ఎన్నెన్నని..?
ఐతే పదే పదే మన చూపు ఒక సీన్ దగ్గర ఆగిపోతుంది… అది కమలహాసన్ పాత్ర చిత్రణలో విశేషం అనిపిస్తుంది…
కారులో కమల్‌హాసన్, జయప్రద వెళ్తుంటారు… తనను సెక్రటరీగా వేసుకోమని జయప్రద అంటే- ‘‘మీరెప్పుడూ నా పక్కనే ఉంటారా?’’ అనడుగుతాడు కమల్… ‘‘ఓ ష్యూర్! వై నాట్? ఐ విల్ బీ ఆల్వేస్ విత్ యూ’’ అంటుంది జయప్రద… ‘‘నిజంగా?’’ అంటే ‘‘ప్రామిస్’’ అంటుందామె…
అప్పుడు కారు ఆపమనీ, చిన్న పనుందనీ అక్కడికక్కడే దిగిపోతాడు కమల్… రోడ్డు పక్కనే ఉన్న చిన్న కొండ అంచున ఏకాంతంగా కూర్చుని తనలో పొంగిపొరలే సంతోషాన్ని ఆస్వాదిస్తాడు… భిన్నమైన వ్యక్తీకరణ కదా…
ఇక్కడ అతడికి ఆనందం జయప్రద పలుకుల వల్లనే… కానీ దాన్ని ప్రేమాంగీకారంగా భావించి, ఆ భావనను మనస్ఫూర్తిగా అనుభూతి చెందటానికి మాత్రం ఆమె ఉనికినీ, సామీప్యాన్నీ గాకుండా ఒంటరితనాన్ని కోరుకోవడం ఓ వైచిత్రి!
ప్రేమించిన వ్యక్తి వల్ల పుట్టిన సంతోషాన్ని సంపూర్ణంగా ఆకళింపు చేసుకోవటానికి ఆ ప్రేమికురాలి నుంచి ఒంటరితనం కోరుకోవటం…! ఇలాంటి కథానాయకుడు మనకు ఇంకేదైనా సినిమాలోనైనా మీకు తారసపడ్డాడా…?
ఒక్కో మనిషి తత్వం ఒక్కో తీరు… ఇక్కడ కమలహాసన్ మనస్తత్వాన్ని విశ్వనాథ్ భిన్నంగా ఆలోచించి, ఆవిష్కరిస్తాడు… జయప్రద ఇంటికి వెళ్ళగానే పబ్లిక్ బూత్ నుంచి ఫోన్ చేసి, మరోసారి అదే ప్రశ్నను అడిగి, అదే జవాబు చెప్పించుకుని, ‘‘థాంక్యూ , థాంక్యూ వెరీమచ్’’ చెప్తాడు… మళ్ళీ వెంటనే ఫోన్ చేసి, ‘‘ఐ లవ్ యూ’’ చెప్తాడు…
అనేకానేక సీన్లలో ఇది కాస్త భిన్నంగా, చిత్రంగా తోస్తుంది… నిజానికి ఈ పాత్ర చేయడానికి కమల్ హాసన్ తొలుత నిరాకరించాడు… ఒకసారి ముసలి పాత్ర వేస్తే ఇక తరువాత అన్నీ అలాంటి పాత్రలే వస్తాయనే భయం… ఇండస్ట్రీలో అంతే కదా మరి…
కానీ ఆ పాత్రను కాస్తో కూస్తో శాస్త్రీయ నృత్యంలో ప్రవేశం ఉన్న కమలహాసన్‌తోనే వేయించాలని నిర్మాత నాగేశ్వరరావు ఐదారు నెలలు వెంటబడి మరీ ఒప్పించాడు… నిజానికి విశ్వనాథ్ దర్శకత్వం కాబట్టి అంగీకరించి ఉంటాడు…
అంతేకాదు, ముసలి పాత్రే కాదు, బ్యాక్ గ్రౌండ్‌లో యంగ్ రోల్ ఉంటుందని చెప్పి ఒప్పించి ఉంటారు… జయప్రద పాత్ర కూడా అంతే కదా… పలుసార్లు వితవుట్ మేకప్… ఐనా సహజమైన అందం కాబట్టి ఎలా చూపించినా అందంగానే కనిపించింది… బాత్‌రూం సీన్ సహా…
నిజానికి ఆమె ఈ పాత్రకు ఫస్ట్ చాయిస్ కాదు… జయసుధ అనుకున్నారు… కానీ ఈ సినిమాలో ఈ పాత్ర స్వతహాగా డాన్సర్… జయసుధ డేట్స్ లేవు, పైగా డాన్సర్ పాత్రకు శాస్త్రీయ నృత్యంలో ప్రవేశం ఉన్న జయప్రదే కరెక్టు అనుకున్నారు తరువాత… విశ్వనాథ్ సినిమా అనేసరికి ఆమె కళ్లు మూసుకుని డేట్స్ ఇచ్చేసింది… పర్‌ఫెక్ట్ జంట…!!
Share this Article