Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సెట్లు లేవ్… మేకప్పుల్లేవ్… విగ్గుల్లేవ్… పాటల్లేవ్… బీజీఎంలో మూడే వాయిద్యాలు…

May 22, 2022 by M S R

ఈ చిత్రంలో సెట్లు లేవు… కర్నాటకలో, శృంగేరీ పీఠం పరిధిలోని వైకుంఠపురం ఓ బ్రాహ్మణ అగ్రహారంలో తీశారు… తీసేటప్పుడు కథాంశం ఎవరికీ తెలియదు కాబట్టి అందరూ సహకరించారు… తెలిసి ఉంటే గ్రామంలోకి రానిచ్చేవాళ్లు కాదేమో… అది 1970… సెట్లు లేవు… ఏ నటుడికీ మేకప్ లేదు… ఏ పాత్రకైనా గడ్డం కావల్సి ఉంటే సహజంగా పెరగాల్సిందే, పెట్టుడు గడ్డాలు, విగ్గులు గట్రా లేనేలేవ్… పాటల్లేవు… కేవలం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్… ఈ సినిమా నేపథ్య సంగీతంలో కేవలం మూడే వాయిద్యాలను వాడారు…

ఈ చిత్రంలో చిన్నచిన్న పాత్రలు ధరించిన వారిలో చాలామంది విద్యావంతులు, జర్నలిస్టులు, రచయితలు ఉన్నారు… మొత్తం సినిమాకు అయిన ఖర్చు 90 వేల రూపాయలు… తీరా రిలీజ్ చేసే సమయానికి బ్రాహ్మణవర్గాలు కస్సుమన్నాయి… సినిమాపై బ్యాన్ పెట్టేశారు… ఎలాగోలా తిప్పలు పడి రిలీజ్ చేశాక… అభినందనల వర్షం… జాతీయ ఉత్తమ చలనచిత్రంగా అవార్డు… ఆసక్తికరంగా ఉంది కదా… ఆ సినిమా పేరు సంస్కార… (అంటే సభ్యతసంస్కారం బాపతు సంస్కార కాదు… అంతిమ సంస్కారంలోని సంస్కార…)

samskara

Ads

ఇంకొన్ని వివరాలు సీనియర్ జర్నలిస్ట్ Bharadwaja Rangavajhala…  మాటల్లో… పఠాభి… కన్నడంలో సంస్కార, చండమారుత లాంటి సినిమాలు తీసి నవ్య సినిమా ఉద్యమానికి దక్షిణాదిన శంఖం పూరించిన తిక్కవరపు పట్టాభిరామిరెడ్డిదీ ఫొటో… చిత్రంలో ఉన్నది స్నేహలత… అసలు అతను సినీయానం ప్రారంభించింది తెలుగులోనే. దిగ్ధర్శకుడు కె.వి.రెడ్డి ప్రారంభించిన జయంతి పిక్చర్స్ లో పట్టాభిరామిరెడ్డి కూడా భాగస్వామి. వీళ్లిద్దరూ శ్రీనివాసన్ అనే మరో మిత్రుడితో కలిసి పెళ్లినాటి ప్రమాణాలు, శ్రీ కృష్ణార్జున యుద్దం. భాగ్యచక్రం చిత్రాలు తీశారు. ఆయన పేరు ఆ చిత్రాల టైటిల్స్ లో టి.పి. రామరెడ్డి అని పడుతుంది. ఈ చిత్రాల నిర్మాణంలో డబ్బులు పెట్టడం వరకే తప్ప మిగిలిన విషయాలన్నీ కె.వి రెడ్డి ఇష్టప్రకారమే జరిగేవి…

పట్టాభిరామిరెడ్డి పుట్టింది నెల్లూరులో… ఆ తర్వాత ఠాగూరు శాంతినికేతన్ లో చదువు. అక్కడ నుంచీ చైనా, జపాన్, అమెరికా లాంటి విదేశాల్లో కొంతకాలం గడిపారు. ఫిడేలు రాగాల డజన్ తో తెలుగు కవిగా జండా ఎగరేశారు. నవకవులు తప్పక చదవాల్సిన కవిత్వంగా అప్పట్లో ఆ పుస్తకానికి ఇంట్రో రాసిన శ్రీశ్రీ ప్రకటించారు. ఆ తర్వాత జ్యోతిలో పఠాభి పన్చాంగము రాశారు. కయిత నాదయిత కూడా ఆయన రాసినదే. భావకవిత్వం మీద తిరుగుబాటుగానే పఠాభి కవిత్వం సాగిందనేది అభిప్రాయం.

కె.వితో స్నేహం కుదిరిన సమయంలో ఆయన మద్రాసులో ఉన్నారు. అక్కడే ఆయన నటి, నర్తకి స్నేహలతా పావెల్ ని వివాహమాడారు. స్నేహలత సోషలిస్టు. దీంతో ఆమెకు జార్జ్ ఫెర్నాండెజ్ తో స్నేహం ఉండేది. ఆ స్ఫూర్తితోనే పట్టాభితో కలసి యమర్జన్సీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనేది. 1970లో పట్టాభి డైరక్షన్ లో వచ్చిన జాతీయ పురస్కార గ్రహీత సంస్కార చిత్రంలో స్నేహలత నటించారు.

స్నేహలత మీద సోషలిస్టు నాయకుడు రామ్ మనోహర్ లోహియా ప్రబావం ఉండేది. లోహియా మ్యాన్ కైండ్ పత్రిక సంపాదక వర్గంలోనూ పనిచేసింది. పట్టాభితో కలసి పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వ్యవస్థాపక సభ్యురాలయ్యింది. వీటికి తోడు ఫెర్నాండెజ్ తో ఉన్న స్నేహం కారణంగా స్నేహలతను బరోడా డైనమైట్ కేసులో చివరి లిస్టు ముద్దాయిల్లో ఒకరుగా అరెస్ట్ చేశారు. బెంగుళూరులో జైలు జీవితం గడిపారు. ఫెర్నాండెజ్ కు ఆమె ఆశ్రయం కల్పించారనేది ఎలిగేషను.

జైలు పరిస్థితుల కారణంగా తీవ్రమైన ఆస్మాతో బాధపడుతున్న స్నేహలతను ప్రభుత్వం పెరోల్ మీద విడిచిపెట్టింది. పెరోల్ మీద విడుదలైన నాలుగైదు రోజుల్లోనే స్నేహలత చనిపోవడం జరిగింది. పఠాభి జీవితంలో ఇదో చేదు అనుభవం. 2006 మే 13 న పట్టాభి మన్ని వీడి వెళ్లారు. కవిగానూ సినిమా దర్శకుడుగానూ ఆయనది కొత్తశైలి. దక్షిణ భారతంలో సమాంతర చిత్ర నిర్మాణానికి ఆయనే ప్రారంభకుడు. సంస్కార చిత్రానికి మూలం యు.ఆర్.అనంతమూర్తి నవల సంస్కారయే…

సంస్కార

నారాయణప్ప అనే బ్రాహ్మణుడు సకల వ్యసనాలకూ లోనై చనిపోతాడు. అతనికి అంత్యక్రియలు ఎలా చేయాలనేది సమస్య. ఈ విషయంలో ఒక నిర్ణయం ప్రకటించమని బ్రాహ్మలంతా కలసి పండితుడైన ప్రాణేశాచార్యను కోరుతారు. ఒక వ్యక్తి … వ్యక్తిత్వం మీద ఇంకో వ్యక్తికి ఎంత వరకూ హక్కు ఉన్నది? గ్రంధాలూ పుస్తకాలూ తిరగేసినా అతనికేమీ పాలుపోదు. ప్రాణేశాచార్య వైవాహిక జీవితం కూడా అంత సవ్యంగా సాగదు. అతని భార్య పెళ్లైన నాటి నుంచీ వ్యాధులతో బాధపడుతూంటుంది. దీంతో అతనికి సంసారసుఖం ఉండదు.

నారాయణప్ప మృతదేహానికి ఎలా దహన సంస్కారాలు నిర్వహించాలనే మీమాంస అలా ఉండగానే, అతను ఉంచుకున్న వెలయాలుతో ప్రాణేశాచార్య పడకసుఖం పొందుతాడు. ఈ సంఘటనతో అతను కదలిపోతాడు. నారాయణప్ప బహిరంగంగానే అన్నీ చేసేవాడు. తాను మాత్రం దొంగచాటుగా అన్నీ చేస్తూ … పైకి మాత్రం ధర్మ రక్షకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఈ హిపోక్రసీ అతనిలో గందరగోళం రేపుతుంది. అలా ధర్మశాస్త్రాలు వల్లిస్తూ నీతులు చెప్పడం సంస్కారం కాదని తెలుసుకుంటాడు. నారాయణప్పకు అంత్యక్రియలు జరపాలని నిర్ణయించుకుంటాడు.

ఈ కథ గురించి పట్టాభికి చెప్పింది లోహియానే. ఒకసారి పట్టాభి స్నేహలతల ఆతిథ్యం స్వీకరించడానికి వచ్చిన లోహియా మాటల సందర్భంలో సంస్కార గురించీ, రచయిత అనంతమూర్తి గురించీ ప్రస్తావించడం జరిగింది. అప్పటికే వాస్తవిక వాద చిత్ర నిర్మాణం గురించి ఆలోచనలు చేస్తున్న పట్టాభిని ఈ కథ ఆకర్షించింది. మెడ్రాస్ ప్లేయర్స్ అంటూ స్నేహలత ప్రారంబించిన సంస్ధలోని సభ్యులతోనే ఈ సినిమా చేయాలనుకున్నారు. గిరీష్ కర్నాడ్ అక్కడ నుంచీ వచ్చినవాడే. అతన్నే హీరోగా తీసుకున్నారు.

గిరీష్ ప్రాణేశాచార్య పాత్ర పోషించడమే కాదు … స్క్రీప్ ప్లే , డైలాగ్స్ కూడా రాశాడు గిరీష్… అప్పటికే నీతి నిజాయితీ తీసి దర్శకుడైన కె.వి రెడ్డి అసిస్టెంటు సింగీతం శ్రీనివాసరావును పిల్చి సహకార దర్శకుడుగా ఉండమని కోరారు పట్టాభి. వీరిద్దరికీ జయంతి రోజుల్లో బాగా పరిచయం. సంస్కార చిత్రానికి టామ్ కోవన్ అనే ఆస్ట్రేలియన్ కెమేరా బాధ్యతలు చూశారు. బ్రాహ్మణ కులానికి సంబంధించిన కథతో తీసిన సినిమా అంటూ దీన్ని నిషేదించడం జరిగింది. సుమారు ఏడాది పాటు సినిమా విడుదల కోసం అనేక పద్దతుల్లో ప్రయత్నం చేశారు పట్టాభి. ఈ ప్రయత్నంలో అప్పట్లో పార్లమెంట్ సభ్యుడుగా ఉన్న సినీ నటుడు జగ్గయ్య ఆయనకి సహకారం అందించారు. పార్లమెంటులో ఈ సినిమా మీద జరిగిన చర్చలో జగ్గయ్య మాట్లాడి సభను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. జగ్గయ్య చొరవతో , అప్పటి సమాచార శాఖ మంత్రి గుజ్రాల్ సహకారంతో సినిమా విడుదలయ్యింది…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions