Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పెళ్లి ఊరేగింపులో పార్టీ జెండాలు..! కస్సుమన్న ఐపీఎస్ వరుడు..!!

December 19, 2024 by M S R

.

వరుడు అసలే అయిపీయెస్సూ… పార్టీ జెండా ఆపిన పెళ్ళి…

“ఏ కల్యాణం కోసం ఇంతటి కల్లోలం?
నీకు తెలియనిదా నేస్తమా!
చెంత చేరననే పంతమా?
ఖండాలుగ విడదీసే జెండాలన్నీ
తలవంచే తలపే అవుదాం…
ఆ తలపే మన గెలుపని అందాం”

Ads

అని కంచె సినిమాలో సిరివెన్నెల చెప్పిన సందర్భం సరిహద్దులో యుద్ధానికి సంబంధించినదే అయినా… సర్వకాల సర్వావస్థల్లో పాటించాల్సిన హద్దులు చెరిపేసే ఏ సందర్భానికైనా అన్వయమయ్యే విశ్వజనీన ఆదర్శమది. ఆదర్శాలెప్పుడూ మాటల్లో గొప్పగా ఆకాశాన్ని తాకుతూనే ఉంటాయి. చేతల్లో ఆ ఆదర్శాలు తరచుగా ఓడిపోతూ పాతాళం అంచులు చూస్తూనే ఉంటాయి.

ఎవరి అజెండా వారిది- ఎవరి జెండా వారిది అయిన రోజుల్లో జెండా పండుగరోజే జెండాకు విలువ ఉంటుందనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇప్పుడు ప్రతిరోజూ, ప్రతిచోటా జెండా ఉండాల్సిందే.

మనిషి ఇప్పుడు సంఘజీవి అయినా కాకపోయినా రాజకీయ జీవి. మెదడున్న ప్రతి మనిషికి ఒక రాజకీయ సైద్ధాంతిక తాత్విక భావజాలం, కార్యాచరణ ఉన్న రోజులివి. అధికార- ప్రతిపక్ష పార్టీలుగా సామాన్య ప్రజలు చీలిపోయి… తాము మౌలికంగా సంఘంలో మనుషులమన్న సామూహిక స్పృహ మరచిపోయిన కాలమిది.

కాబట్టి మనమేమిటో, మన పార్టీ ఏమిటో, మన పార్టీ విధానాలేమిటో తెలిసేలా మన ఇంటి మీద పార్టీ జెండా ఎగరాల్సిందే. మన ఇంటి ప్రహరీ గోడకు పార్టీ గుర్తులు వేయాల్సిందే. పార్టీ రంగులు పులమాల్సిందే. గుమ్మానికి మన పార్టీ అధ్యక్షుడి స్టిక్కర్ అతికించాల్సిందే. చేతికి మన పార్టీ పచ్చబొట్టు పొడిపించుకోవాల్సిందే.

మన కారుముందు బానెట్ పై పార్టీ జెండా రెపరెపలాడాల్సిందే. కారు అద్దానికి పార్టీ స్టిక్కరు అతికించాల్సిందే. ఇళ్ళల్లో పెళ్ళో, చావో జరిగితే పార్టీ జెండాలు కట్టాల్సిందే. పెళ్ళి బరాత్ లో పార్టీ జెండాలు పట్టి కార్యకర్తలు ఊగిపోవాల్సిందే. మెడలో పార్టీ కండువాలు వేసుకున్నవారితో పెళ్ళి పందిరి నిండిపోవాల్సిందే.

పార్టీ నాయకుల, కార్యకర్తల, సానుభూతిపరుల పెళ్ళిళ్ళకు ఆ పార్టీ నాయకుడో, అధికారంలో ఉంటే ముఖ్యమంత్రో వస్తే నిజానికి సామాన్యులకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఆత్మాభిమానమున్నవారికి చాలా అవమానంగా కూడా ఉంటుంది.

సంకల్పం చెప్పి దేవతలను ఆహ్వానించిన పరమ పవిత్ర కల్యాణవేదిక మీదికి బ్లాక్ క్యాట్- నల్ల పిల్లులు; వైట్ డాగ్- తెల్ల కుక్కలు; బాంబ్ స్క్వాడ్- కొండముచ్చులు; స్నిప్పర్ స్క్వాడ్ గ్రామసింహాలు వచ్చి అపవిత్రం చేసి వెళుతున్నా… కల్యాణమంత్రాలను సంప్రదాయానికి విరుద్ధంగా మధ్యలో ఆపుతున్నా… ఎవరికీ పట్టింపు ఉండదు.

ఆ నాయకుడు వచ్చి వెళ్ళాక అక్కడంతా చెల్లాచెదురై పచ్చని పందిట్లో వెచ్చని నిట్టూర్పులు, నిరసనలు ఎవరికీ వినపడవు. కనపడవు. ఇలాంటిచోట్ల చాలాసార్లు పెళ్ళి పార్టీకి జరుగుతోందో, మనుషులకు జరుగుతోందో సామాన్యులకు అర్థం కాదు.

అర్థమయ్యేలోపు పురోహితుడిని పక్కకు లాగేసి… నాయకులు వచ్చి పౌరోహిత్యం చేసి తాళి కట్టించేసి… ఆశీర్వదించి… ఫోటోలు, వీడియోలకు ఫోజులిచ్చి తాళిని ఎగతాళి చేసి వెళ్ళిపోతూ ఉంటారు.

సిద్ధాంతం ఎప్పుడూ గందరగోళంగా అనిపిస్తుంది. ఉదాహరణలతో చెప్తేనే సిద్ధాంతం బలంగా నాటుకుంటుంది. సరిగ్గా అర్థమవుతుంది. “పెళ్ళిలో పార్టీ జెండా సిద్ధాంతం” స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఉపకరించే యథార్థ సంఘటన ఇది. చిత్తగించండి.

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే. ఆయన కూతురు డాక్టర్. గుజరాత్ లో పోస్టింగ్ పొందిన హైదరాబాద్ నగరానికి చెందిన ఐపిఎస్ అధికారితో పెళ్ళి నిశ్చయమయ్యింది. పెద్దలు కుదిర్చిన పెళ్ళి. మరి కాసేపట్లో ముహూర్తం.

పెళ్ళి కొడుకు ఇంటినుండి ర్యాలీగా మంటపానికి బయలుదేరాలని అమ్మాయి తరుపువారికి అనిపించింది. ర్యాలీ అంటే రాజకీయపక్షులకు జెండాలు ఉండాల్సిందే కదా! దాంతో కాంగ్రెస్ జెండాలు చేతపట్టుకున్నారు. “ఒరేయ్ నాయనా! మనం రాహుల్ గాంధీ పబ్లిక్ మీటింగ్ కు ర్యాలీగా వెళ్ళడం లేదు. ఇది నా పెళ్ళి. పైగా నేను ఐపిఎస్ అధికారిని. రేపు నలుగురిముందూ నేను తలెత్తుకుని తిరగలేను. ఇది పద్ధతి కాదు. మర్యాద కాదు. సంప్రదాయం కాదు. అగౌరవం. అసందర్భం. చేతిలో ఆ జెండాలు, మెడలో ఆ కండువాలు తీసేయండిరా!”- అని ప్రాధేయపడ్డాడు పెళ్ళి కొడుకు.

వింటే వారు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎలా అవుతారు? వినలేదు. అబ్బాయి కదల్లేదు. పెళ్ళి ఆగిపోయింది. పెళ్ళి కూతురి తండ్రి కాంగ్రెస్ కండువారహితంగా పరుగు పరుగున వచ్చి అబ్బాయిని ఒప్పించడానికి ప్రయత్నించాడు.

కానీ కాంగ్రెస్ చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదని ఆ పెళ్ళికొడుకు దెబ్బతిన్న మనోభావాలతో తృటిలో మామ కాలేకపోయిన ఆ నాయకుడికి స్పష్టంగా చెప్పాడు. నెత్తిన కాంగ్రెస్ గుడ్డ వేసుకుని వైరాగ్యంతో ఆ మాజీ ఎమ్మెల్యే తిరుగు ముఖం పట్టాడు.

(కడపటి వార్తలందేసరికి ఇంకా రాజీ ప్రయత్నాలు, బుజ్జగింపులు, ప్రాధేయపడడాలు, క్షమాపణలు, వేడుకోళ్ళు జరుగుతూనే ఉన్నాయి కానీ… బీటలువారిన పెళ్ళికొడుకు మనోభావాలు అతుక్కోలేదని తెలిసింది. ఒకవేళ అతుక్కుని అతడు పెళ్ళి పీటలు ఎక్కి ఉంటే సంతోషం)

ఫలశ్రుతి:-

మీ రాజకీయ పార్టీల క్రియాశీలక భాగస్వామ్య ప్రదర్శనకు భావి జీవిత భాగస్వాములు కావాల్సినవారిని బలిపెట్టకండి. లేదా బరాత్ లో వెయ్యి పార్టీ జెండాలు, పెళ్ళిలో రెండు వేల పార్టీ హోర్డింగ్స్, రిసెప్షన్లో మూడు వేల పార్టీ స్లోగన్ బిల్ బోర్డ్స్, అప్పగింతలవేళ నాలుగు వేల పార్టీ మ్యానిఫెస్టో కాపీలు, శోభనానికి అయిదు వేలమంది పార్టీ కార్యకర్తల తోడు ఉంటారని ముందే ఒక మాట అనుకోండి!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • గ్రోక్ కూడా చేతులెత్తేసిన భాష… ఇక ఆక్స్‌ఫర్డ్ టీమ్‌కే సాధ్యమేమో…
  • ఏమైంది అసలు..? చేజేతులా ట్రోలర్లకు చిక్కుతున్న కొండా సురేఖ..!!
  • అడుగుకో పాక్ గూఢచారి… వీళ్ల ఏరివేతే యుద్ధంకన్నా ప్రధానం..,
  • అనవసరంగా వైసీపీ సోషల్ బ్యాచ్‌ను గోకిన భైరవం దర్శకుడు…
  • అత్యంత అసాధారణ కరెంటు బిల్లు… నమ్మడమే కష్టం సుమీ….
  • సొంత ‘బతుకమ్మ’ పేర్చుకుని… తన ఆట తాను ఆడుకోవడమేనా..?
  • ఫక్తు అక్కినేని మార్క్ వన్ ప్లస్ టూ రొటీన్ సినిమా ప్రేమ కథ..!!
  • ఆ సిరివెన్నెల పాటలు… రాసిన అర్థాలు వేరు- వాడుకున్న తీరు వేరు…
  • శరణార్థుల ఆశాసూచిక – భారత రాజ్యాంగంలోని కుబేరుని కళాచిత్రం…
  • కశ్మీర్‌లో యూఎన్ ధర్మసత్రం షట్‌డౌన్… శెభాష్ జైశంకర్… ఇదీ టెంపర్‌మెంట్..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions