ఈమధ్య కాలంలో తెలుగు దినపత్రికల్లో పబ్లిషైన అన్ని వార్తల్లోకెల్లా అత్యంత బాధ్యతారహితమైన వార్త ఇది… కనీసం దీని దిగున ADVT అని రాసుకున్నా కాస్త ఓ రీతిగా ఉండేది… సుగర్ వ్యాధిగ్రస్తులకు ఇతర బియ్యంకన్నా తెలంగాణ సోనా అనే బియ్యం బెటర్ అని చెప్పడం వేరు… ఏకంగా దీన్ని సుగర్ వ్యాధిగ్రస్తులకు ఔషధం అని ప్రమోట్ చేసేవాళ్లందరూ ఈ సొసైటీకి వ్యతిరేకులే… చాలా నీచమైన ప్రమోషన్ ఇది…
నమస్తే తెలంగాణ పత్రిక ఏకంగా ఇది షుగర్ ఫ్రీ అనీ, దివ్యౌషధం అని రాసిపారేసింది… ఎక్కడో ఏ మూలో ఇంకా అడుగూబొడుగూ పత్రిక లక్షణాలుంటే, వాటికీ తిలోదకాలు ఇచ్చేసింది… ఇది పక్కా ఓ బ్రాండ్ పేరుతో బియ్యం అమ్ముకునే వ్యాపారులకు ప్రమోషన్ ఆర్టికల్… అదీ అబద్ధాలతో…!
Ads
మధుమేహం లేనివాళ్లు తింటే వ్యాధి రాకుండా ఉపయోగపడుతుందనే వాక్యం మరీ పాతాళస్థాయి పాత్రికేయం… నిజం ఏమిటంటే..? ఇతర బియ్యం రకాలతో పోలిస్తే ఇందులో జీఐ తక్కువ… అంతే తప్ప, కార్బొహైడ్రేట్స్ ఉండవని కాదు, సుగర్ ఫ్రీ అనేదీ అబద్ధం… ధర తక్కువేమీ కాదు, ఈ ఫ్రీ, ఔషధం వంటి ప్రచారాలతో ధరలు కుమ్మేయడమే… దానికి ఒక పత్రిక (?) ప్రచారం…!! సరే, ఒక ప్రభుత్వ యూనివర్శిటీ ఈ వెరయిటీ డెవలప్ చేసింది, గుడ్, కానీ ఈ డెక్కన్ ముద్రకే ఎందుకు ఇచ్చినట్టు..? అది రాయల్టీ చెల్లిస్తుందా..? అన్నింటికీ మించి ఈ వార్తలోని డెక్కుల్లో ఈ బియ్యం కావాలా అంటూ ఫోన్ నంబర్ ఇవ్వడం ఈ పాత్రికేయ పైత్యానికి పరాకాష్ట… మార్కెట్ లో ప్రస్తుతం మంచి నాణ్యమైన పాత సన్న బియ్యం కిలో నలభై నుంచి యాభై… ఈ బియ్యం 140 అట… బాస్మతి నయం…
ఇది చదివారు కదా… నీలోఫర్ దవాఖానాలో డాక్టర్ అట… షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ రైస్ తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పాడట… ఆ డాక్టర్ వృత్తికే అవమానకరం… షుగర్ వ్యాధిగ్రస్తులతోపాటు ఇతరులు తిన్నా మంచి ప్రయోజనం ఉంటుందట… జాలేస్తుంది… ఈ సారుకు డాక్టర్ పట్టా, సర్కారీ హాస్పిటల్‌లో కొలువు ఎవరిచ్చారో వాళ్లకు నమో నమహ… ఒక రైతు నాకు మంచి ధర వస్తోంది, పండిస్తున్నాను అని చెబితే వోకే… ఓ మార్కెటింగ్ ప్రతినిధి దానికి అనుకూలంగా డప్పు కొట్టుకుంటున్నాడు అంటే వోకే… కానీ ఒక డాక్టర్ ఐఉండీ… ఫాఫం… ఈ అపర ధన్వంతరి..!! But థాంక్ గాడ్… ఇమ్యూనిటీ పెంచుతుంది, రక్తహీనత తగ్గిస్తుంది, రక్తపోటుకు పరమౌషధం అని రాసుకోలేదు… హమ్మయ్య…!!
Share this Article