అసలు తిరుపతిలోనే కాదు… ప్రతి ప్రముఖ దేవాలయాల దగ్గర కల్యాణకట్టలు ఉంటయ్… జాతరల దగ్గర కూడా చూస్తుంటాం… పురుషులు, మహిళలు, పిల్లాపీచు తలనీలాలు తీయించుకుంటూనే ఉంటారు… గుండు కొట్టించామని చెప్పడానికి నాలుగు వెంట్రుకలు తీసుకెళ్లి హుండీలో కూడా వేస్తుంటారు… ఇక్కడ పురుషులు, మహిళలు అనే తేడా కనిపించదు… కాకపోతే పొడవైన జుట్టు దేవుడికి ఇచ్చేస్తే, మళ్లీ అంత పొడవు పెరగడానికి ఎంతకాలం పడుతుందో అనే సందేహంతో వెనుకాడుతుంటారు కొందరు…
కొందరైతే పాపిష్టి జుట్టు ఉంటే ఎంత..? పోతే ఎంత..? దేవుడి మొక్కుకన్నా ఎక్కువ కాదు కదా అని తీసేయించేస్తారు… బహుశా ఈ తలనీలాల సమర్పణ అనేది దక్షిణాది గుళ్లలోనే ఎక్కువ… ఈ తలనీలాలను ప్రాసెస్ చేయడం, ఎగుమతి చేయడం అనేది ఓ పెద్ద దందా… వందల కోట్ల బిజినెస్సు అట… అయితే ఇవన్నీ ఒక్కసారిగా ఎందుకు గుర్తొచ్చాయంటే ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నర్సింహరావు వీడియో ఒకటి చూడటం తటస్థించింది… మొన్నటి వీడియోనే… అంటే తాజాదే అని అర్థం…
నిజానికి ఆయన సహస్రావధాని కదా… తన ప్రవచనాలు డిఫరెంటుగా ఉంటాయి… శ్లోకాలు, పద్యాలు, పురాణాల్లోని ఉదాహరణలు, వర్తమానంలోని వాస్తవాలకు చమత్కారాన్ని కూడా రంగరించి, శ్రోతల మెదళ్లలోకి బలంగా ఎక్కిస్తాడు… లక్షల మంది తన ప్రవచనాలు వింటుంటారు, చూస్తుంటారు… చాలా విషయాల్లో కుండబద్ధలు కొట్టేస్తుంటాడు… ఉదాహరణకు వాస్తు అనేది పెద్ద దందా కదా… ఎహె, దాన్ని నమ్మడం శుద్ధ దండుగ యవ్వారం అని తేల్చిచెప్పేస్తాడు… మూఢనమ్మకాల్ని పెంచేవి గాకుండా వాటి వెన్ను విరిచే ప్రవచనాలు ప్రజలకు మంచివే… అవసరమే…
Ads
కానీ ఈ తాజా వీడియో ఎందుకు ఆసక్తికరం అనిపించిందంటే… తిరుమలలో మహిళలు గుండు గీయించుకోకూడదు, అది అశుభం అని తేల్చేశాడు… ‘‘గుండు గీసుకోవడం అశుభం… ఆ తప్పు చేయనేకూడదు… పూర్వకాలంలోనూ లేదు… అలా మొక్కేసుకుంటున్నారు, తీసేసుకుంటున్నారు… పోనీ, మూడు కత్తెర్లు ఇవ్వండి… నిజానికి అదీ వేస్టే… ముత్తయిదువ అసలే చేయకూడదు… భర్త ఉన్న స్త్రీ అలా ఎప్పుడూ చేయకూడదు… దీనికి లాజిక్కు ఏమిటీ అనడిగితే ఏం చెప్పగలం..? అన్నీ ప్రయోగశాలల్లోనే రుజువు కావు… కొన్ని యాగశాలల్లో, ఇంకొన్ని యోగశాలల్లో రుజువవుతాయి… సంప్రదాయం సంప్రదాయమే, లక్ష్మిదేవి లక్ష్మీదేవే… ఇంటావిడ లక్ష్మీదేవిలా ఉంటేనే లక్ష్మిదేవి ఇంట్లో ఉంటుంది…’’ తెలుగువన్ చానెల్‌లో ఒకరోజు క్రితం అప్‌లోడ్ చేసిన వీడియోలో చెప్పాడు ఇలా…
ఆయన వ్యాఖ్యలు నిజమో కాదో విశ్లేషించి చెప్పేంత విద్వత్తు, విద్య మనకు లేవు… కానీ టీటీడీ ఏమంటుందో చూడాలని ఉంది… ప్రతి చిన్న విషయానికీ కేసులు పెట్టేస్తాం అని బెదిరించేస్తూ ఉంటుంది టీటీడీ… మరి ఈయనమో శాస్త్రప్రకారం మహిళల గుండ్లు మంచివి కావని ఖండితంగా చెప్పేస్తున్నాడు… ఆయన అసలే ప్రవచన పద్మశ్రీ… కాస్త డొక్క శుద్ధి, వాక్శుద్ధి ఉన్నవాడే… అసలే కేశాల విక్రయంతో బోలెడు ఆదాయం వస్తుంటుంది… మరి దానికి గండి పడదా..? అందుకని ఆస్థాన విద్వాంసవేత్తలు కొందరు ఎప్పుడూ రెడీగా ఉంటారు… వాళ్లతో ‘‘మహిళలు- గుండు పుణ్యం’’ పేరిట ఏమైనా చెప్పిస్తారా..? ఖండన ప్రవచనాల్ని వినిపిస్తారా..? చూడాలి…
అఫ్‌కోర్స్, ఈమధ్య కొన్నాళ్లుగా యువత సన్నాసుల్లాగా బారెడు బారెడు గడ్డాలు పెంచేస్తున్నారు… ట్రెండు అట… అందుకని వాళ్లకు మొక్కడాల్లేవు, గుండ్లు కొట్టించడాల్లేవ్… ఇదొక నష్టం… కాలుష్యం పుణ్యమాని కాస్త వయస్సు పెరిగితే చాలు సహజమైన బట్టతల బంగారు గుండుగా మెరిసి పోతోంది… ఇక మిగిలేది పిల్లలేనా..? ఆ పొట్టి జుట్టుకు మార్కెట్‌లో డిమాండ్ ఉండదు… ప్చ్… ఇలాగైతే దేవుళ్లకు ఆదాయం పడిపోదా..? అసలే గుళ్ల మీద పడి బతకడం తప్ప, పైసా ఇవ్వవు మన ప్రభుత్వాలు… మరెలా…? ఎలా…!?
దీనికి సంబంధం లేదు గానీ గరికపాటి కొన్ని అంశాల్ని ఎలా ఎటకారాన్ని, నిజాన్ని దట్టించి వదులుతాడో చెప్పడానికి ఓ ఉదాహరణ… పెళ్లిళ్లలో అరుంధతీ నక్షత్రం చూపించే ప్రహసనం మీద… ‘‘చూశావా, కనిపించిందా అనడుగుతాడు పంతులు… కనిపించలేదు అంటే, కనిపించేదాకా శోభనానికి పంపించరేమో అనుకుని వరుడు కనిపించిందీ అనేస్తాడు గబుక్కున… కన్యాదాతను అడిగితేనేమో నాకయితే ఆరు లక్షల అప్పు మాత్రం కనిపిస్తోంది అంటాడు… నిజానికి అరుంధతి నక్షత్రం సరిగ్గా కనిపించనే కనిపించదు… ఉత్తర దిక్కున ఉంటుంది, నాలుగు నక్షత్రాలు మంచం కోళ్లలా ఉంటాయి… అందులో ఒక కోడుకు చివర మూడు నక్షత్రాలు ఉంటాయి… మధ్యలో ఉండేది వశిష్టుడు… ఆ పక్కనే మినుకుమినుకు అంటూ ఓ నక్షత్రం ఉంటుంది… అది కనీకనబడనట్టు ఉంటుంది…’’ అని వివరిస్తాడు… అంటే అరుంధతీ నక్షత్రదర్శనం ఉత్త మాయ అని తేల్చేస్తాడు..!!
Share this Article