నిజమే… నమస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ సొంత ఆస్తి… తను పబ్లిష్ చేసే కాగితాలే కాబట్టి తన కీర్తనలు, తన భజనలే ఉంటాయి… సహజం, వేరే వాళ్లను మెచ్చుకుంటే అది తనకుమాలిన ధర్మం అవుతుంది కదా… అందుకని పత్రికకన్నా కరపత్రికగానే నడిపిస్తారు దాన్ని… చదివేవాడికీ అదే క్లారిటీ ఉంది… పైగా కేసీయార్ కీర్తికాంత ప్రియుడు కాబట్టి కీర్తనలను మహా ఇష్టపడతాడు…
బీఆర్ఎస్ శ్రేణులు చేసే పాలాభిషేకాల దగ్గర్నుంచి స్తుతిస్తోత్రాల దాకా ఎంజాయ్ చేస్తాడు… సరే, అదంతా ఆయనిష్టం… కానీ నమస్తేలో ఈరోజు వచ్చిన ఓ ఫోటో వార్త నవ్వు తెప్పించలేదు… ఆశ్చర్యాన్ని, జాలిని కలిగించింది… అతికే అతి నేర్పేంత అతి అవసరమా అనిపించింది… ఆ వార్త ఇదుగో ఇలా ఉంది చదవండి…
Ads
ఉద్ధండాపూర్ జలాశయం వద్ద పనులు జరుగుతున్నాయి కదా, పేజీల్లో మస్తు ధూంధాం కవరేజీ ఇచ్చారు… గుడ్… అంతకుమించిన కర్తవ్యం సదరు పాత్రికేయులకు లేదు, ఉండబోదు ఫాఫం… అక్కడ ఓ ఆసక్తికర సీన్ కనిపించిందట… ఏమిటయ్యా అంటే సర్జిపూల్ లోపల రాతిగోడపై నీటిబిందువులన్నీ జారిపడుతూ కేసీయార్ ప్రతిరూపాన్ని ఆవిష్కరించాయట… సర్జిపూల్ చుట్టూ రాతిపలకలున్నా సరే ఆ ఒక్కచోటే ఈ బొమ్మ సాక్షాత్కరించిందట…
అచ్చు కేసీయార్‌లా ఉండటంతో సాక్షాత్తూ పెద్ద సారే అక్కడికి రోజూ వచ్చి పనులు పర్యవేక్షిస్తున్నాడనే ఆనందాతిశయంతో వర్కర్లు మురిసిపోతూ, ఉప్పొంగిపోతూ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారట… కేసీయార్ ప్రతిరూపం సాక్షిగా వేగంగా వర్క్ సాగుతోందట… చదువుతుంటే ఒక్కసారిగా దిమ్మతిరిగిపోయినట్టు అనిపిస్తోందా..? నీళ్ల చుక్కలతో కేసీయార్ ప్రతిరూపం ఏర్పడటం ఏమిటి..? అదొక అబ్బురంగా ఈ వార్త రాయడం ఏమిటి..?
ఐనా బొమ్మ చూస్తుంటే అది నిజంగానే కేసీయార్ బొమ్మలాగే ఉందా అని గందరగోళంలో, అయోమయంలో పడిపోకండి… తల సరే, మరి తలకింద భాగం బక్కపల్చగా ఉండాలి కదా, అలా లేదేమిటని సీరియస్‌గా ఆలోచించకండి… రాసింది నమస్తే కాబట్టి కేసీయారే ఐఉంటాడు… అవునూ, అసలు మనిషి పోలికలే లేవు కదా, మరి కేసీయార్ బొమ్మ అని ఎలా నిర్ధారించారు..? అదేనండీ, భక్తి, అభిమానం, ప్రేమ… అవి మది నిండా పుష్కలంగా ఉంటే కలం దానంతట అది ఇలాగే రాసేస్తుంది… మీ ఇష్టం, మీరు కావాలనుకుంటే ఆ బొమ్మలో రేవంత్‌ను చూస్కొండి, జగన్‌ను చూసుకొండి, చంద్రబాబును చూసుకొండి… పోనీ, మోడీని చూసుకొండి… రాజకీయ నాయకుల్ని మాత్రమే దర్శించండి… సరేనా…
ఐనా ఈ బొమ్మ చూస్తుంటే ఓచోట పెద్ద ముక్కులా కనిపిస్తోంది… అంతే, ఇక కేసీయార్ అని ఫిక్స్ కావడమేనా..? ఒక నిజం చెప్పుకుందాం… మేఘాలు, నీటితో ఏర్పడే ఆకారాల్లో మనకు ఇష్టమొచ్చినవి చూసుకోవచ్చు… యద్భావం తద్భవతి… అది కేసీయార్ బొమ్మే అని బలంగా మనసులో అనుకుంటే ఆ బొమ్మలాగే కనిపిస్తుంది… ఈమాత్రం దానికి పెద్ద సారు స్వయంగా రోజూ వస్తున్నాడు, పర్యవేక్షిస్తున్నాడు, అందువల్లే సిబ్బంది వేగంగా ఉత్సాహంగా పనిచేస్తున్నాడు అనే విశ్లేషణలు అవసరమా..? మరీ ఇలా ‘భజన చేసే విధము తెలియండీ జనులారా మీరు’ అనే రేంజ్ రాతలు అవసరమా..? కేసీయార్‌ను నిజంగానే సీరియస్‌గా పొగడటానికి వేరే మార్గాలు, అవకాశాలు, విధానాలే తోచడం లేదా..? పైగా ఇది కేసీయార్ ఉద్దండ ప్రతిరూపమట..!!
Share this Article