.
స్టార్ హీరోలు అప్పుడప్పుడూ నోరు చేసుకుంటుంటారు తమ సినిమా పాటల్లో… అభిమానులకు అదొక ఆకర్షణ అంతే… అందులో ఏ సంగీత ప్రమాణాలూ ఉండవు, పైగా ఖూనీ అవుతుంటాయి అవి…
ఎహె, సినిమా పాటల్లో సంగీతం ఏమిటి..? సాహిత్యం ఏమిటి అంటారా..? నిజమే… అగ్రీడ్… కానీ ఏ శాస్త్ర ప్రమాణాలు లేకపోయినా సరే, కనీసం ఓ ఫోక్ వాల్యూ ఉట్టిపడేలా ఉండాలి కదా…
Ads
మొన్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ ఏదో పాడిండు… టెక్నికల్లీ, ప్రాక్టికల్లీ, లాజికల్లీ అంటూ… సరే, ఏదో ఓ మాస్ బీట్… సంగీత దర్శకుడు భీమ్స్ కాస్త రక్తికట్టేలా ట్యూన్ కట్టాడు… పర్లేదు, నడిచిపోయింది…
కానీ పవన్ కల్యాణ్ హీరోగా చేస్తున్న హరిహర వీరమల్లు సినిమా కోసం ఓ పాట పాడిండు… తనకు పాడటం కొత్తేమీ కాదు… ఈ పాట లిరికల్ సాంగ్, అదీ సగం సగం రిలీజ్ చేశారు… కాకపోతే ఈ పాట చూస్తుంటే ఆశ్చర్యం వేసింది… ఇది కీరవాణి పాటా అనేదే ఆ ఆశ్చర్యం…
వెరీ పాపులర్, క్రియేటివ్ కంపోజర్ మరీ ఇలా మారిపోయాడేమిటి అనిపించింది… పైగా పవన్ కల్యాణ్ రేంజు అంటే ఆ పాట ఎలా ఉండాలి..? మొన్నామధ్య తెలంగాణ అధికారిక గీతాన్ని అడ్డదిడ్డంగా, ఏ మాత్రం జోష్ లేకుండా కంపోజ్ చేసిన కీరవాణి పెంచల్‌దాస్ రాసిన ఈ గీతాన్ని ఖూనీ చేసినట్టే అనిపించింది… నాట్ ఇంప్రెసివ్… పవన్ దీన్ని అంగీకరించకుండా ఉండాల్సింది… కీరవాణిలో సరుకు నిండుకుంది…
పైగా అందులో ‘ఏం గుడాయించి చూస్తన్నవ్’ అంటూ రెండు మూడు వాక్యాలు తెలంగాణ యాసలో పలికించారు… గుడాయించి చూడటం ఏమిటో పలికించిన కీరవాణికి, పలికిన పవనుడికి తెలియాలి… ఆ రెండు మూడు వాక్యాలు తప్ప మిగతా పాటంతా మామూలు సినిమా భాషే… ఇదేందబ్బా అని ఆరా తీస్తే…
ఆ సినిమా కథే ఓ రాబిన్‌హుడ్ టైప్ పాత్ర అట… ఔరంగజేబుతో పోరాడిన పేదల విప్లవకారుడు అట… ఇంకాస్త ఆరా తీస్తే అది పండుగ సాయన్న కథ అట… అంటే, సర్వాయి పాపన్న వంటి పాత్ర… ఎవరు ఈ సాయన్న..? ఎందుకోగానీ తెలంగాణ చరిత్రలో ఎక్కువ పాపులర్ కాలేదు గానీ…
1860 ప్రాంతంలో భూస్వాములు గ్రామాల్ని చెప్పుచేతుల్లో పెట్టుకుని పాలన చేస్తుండే వారు… పండుగ సాయన్న కుటుంబ భూమిని ఆక్రమించుకున్నారు… మొదటిసారి సాయన్న భూస్వాములను పొలంలో నాగళ్లు కట్టిన సమయంలో వారిని ఎదిరించాడు…
భూస్వాములు దాడులు చేసి ఆ కుటుంబాన్ని మరింత భయానికి గురిచేయాలని సాయన్న చిన్నమ్మపై లైంగిక దాడి చేశారు… అజ్ఞాతంలో ఉన్న సాయన్న భూస్వాములపై దాడికి పథకాలు చేస్తూ తరుచూ దాడులు చేయటం మొదలు పెట్టాడు… కొందరు అనుచరులను సమీకరించుకుని దాడులకు దిగేవాడు… పలుమార్లు నిజాం పోలీసుల బలగాలతో సాయన్న కోసం వేట సాగించారు… సాయన్న నిజాం పోలీసులను అడవులు వెంట తిప్పి వారిని తరిమివేసేవాడు…
సాయన్న నిజాం బలగాలకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న తరుణంలో చాలా గ్రామాలు ఆకలితో ఆలమటించేవి… చలించిన సాయన్న గ్రామాలకు తిండి పెట్టాలని ఆలోచించి, ఊర్లకు ఊర్లను ఒక చోట చేర్చి, వారికి కావాల్సిన ఆహారధాన్యాలు దోపిడి చేసి తీసుకుని వచ్చి వారికి ఇచ్చేవాడు… ఓ తెలంగాణ రాబిన్ హుడ్…
మరి ఏమేరకు తెలంగాణ యాసను ఖూనీ చేశారో సినిమా రిలీజయ్యాక గానీ తెలియదు… ఈమధ్య పాపులర్ నటులు కూడా యాసను చిత్రవధ చేస్తున్నారు… ఈ సినిమాలో ఏం గుడాయించి చేశారో చూడాలిక..! ఈతచెట్టు ఇల్లు కాదు, తాటిచెట్టు తావు కాదు వంటి చరణాల్ని మిగతా ఐదు భాషల్లో ఎలా అనువధించారో కూడా చూడాల్సి ఉంది…!! అన్ని భాషల్లోనూ పవనుడే పాడాడని ఓ వార్త చదివినట్టు గుర్తు..! ఎందుకంటే..? తెలుగులో ఓచోట కూలవచ్చు బదులు కులావచ్చు అని పవన్‌తో పలికిస్తుంటే మరీ ఎబ్బెట్టుగా ఉంది..!!
Share this Article