వైఎస్ మరణానికి రిలయెన్స్ అధినేతే కారణమంటూ ఏదో టీవీలో పిచ్చి స్టోరీ కనిపించడంతో ఏపీలో రిలయెన్స్ ఆస్తులపై దాడులు జరిగాయి… ఉద్రిక్తత… అందరిలోనూ అవే సందేహాలు, ప్రచారాలు… సీన్ కట్ చేస్తే అదే అంబానీ బినామీకి జగన్ పిలిచి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చాడు…
ఆంధ్రా భాగో అని ఉద్యమంలో పిలుపునిచ్చాడుకేసీయార్… సీన్ కట్ చేస్తే అదే కేసీయార్ అధికారం వచ్చాక వాళ్లనే నెత్తిన పెట్టుకున్నాడు, ఆ కంట్రాక్టర్లకే దోచిపెట్టాడు… తెలంగాణ ప్రబల వ్యతిరేకులతో ప్రభుత్వ పదవుల్ని నింపేశాడు…
మచ్చుకు ఇవి రెండు ఉదాహరణలు… రాజకీయాల్లో ఇలాంటివి కోకొల్లలుగా కనిపిస్తాయి… ఏ పార్టీ, ఏ నాయకుడూ అతీతం కాదు… దీన్ని పారడాక్స్ అని కాదు, మరో పదం కనిపెట్టాలి ఈ వైఖరికి… రాజకీయాలు వేరు- పాలన వేరు… అసలు రాజకీయాల్లోనే ఎప్పుడూ రెండు ప్లస్ రెండు నాలుగు అయి కాదు… ఏ నంబర్ అయినా రావొచ్చు… In political maths 2 plus 2 is not always 4…
Ads
ఇంత ఉపోద్ఘాతం దేనికీ అంటే… నిన్న ఇండియాటుడే ఓ స్టోరీ చేసింది… దాని సారాంశం ఏమిటంటే..? ‘‘ఆదానీకి మోడీ దోచిపెడుతున్నాడు, ఆదానీ అక్రమాలకు మోడీయే అండ అని రాహుల్ గాంధీ పదే పదే ఆరోపిస్తుంటాడు… కానీ అదే కాంగ్రెస్‌కు చెందిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అదే ఆదానీ సంస్థతో 12,400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలపై సంతకాలు చేశాడు… ఇది పొలిటికల్ హిపోక్రసీ…’’
రాహుల్ గాంధీ తీవ్రంగా ఆరోపణలు చేస్తున్న అదే ఆదానీ పెట్టుబడులను రేవంత్ రెడ్డి ఎందుకు ఆహ్వానిస్తున్నాడు, తనే ఎందుకు స్వాగతిస్తున్నాడు, ఇది పొలిటికల్ హిపోక్రసీ కాదా అనే స్థూలమైన సందేహం ఎవరికైనా వస్తుంది, సహజం… అందుకే చెప్పేది రాజకీయం వేరు- పాలన వేరు… రాజకీయాల్లో ఎప్పుడూ టూప్లస్‌టూ నాలుగు మాత్రమే కాదు…
మరి తెల్లారి లేస్తే ఉన్నవీ లేనివీ ఏవేవో ఆరోపణలు చేసేస్తున్న బీఆర్ఎస్ దీన్ని ఖండిస్తుందా..,? కాంగ్రెస్ రాజకీయ ధోరణులను ప్రశ్నిస్తుందా..? నమస్తే తెలంగాణలో వెటకారపు రాతలు కనిపిస్తాయా..? నెవ్వర్… అస్సలు చేయదు… ఎందుకంటే, ఆదానీ అనుకూల తానులో అదీ ఓ ముక్క… అంతెందుకు..? ప్రస్తుతం రేవంత్ రెడ్డి సంతకాలు చేసిన ఒప్పందాల్లో కేసీయార్ హయాంలో జరిగినవే ఎక్కువ… భూములు కూడా కేటాయించారు…
సో, ఇప్పుడు రేవంత్ సంతకాలు చేసినవాటిల్లో రివైజ్డు ఒప్పందాలే ఎక్కువ… అందుకని సోషల్ మీడియాలో అక్కసు వెళ్లగక్కడం మినహా బీఆర్ఎస్ అధికారికంగా విమర్శించదు… అంబానీలు, ఆదానీలు పక్కా వ్యాపారులు… వాళ్లకు రాహుల్ గాంధీ, మోడీ సేమ్… కేసీయార్, రేవంత్ రెడ్డి సేమ్…
సోషల్ మీడియాలో కొన్ని వెటకారపు విమర్శలు చాలాదూరం వెళ్లిపోయాయి… కాంగ్రెస్ హైకమాండ్‌తో గనుక తనకు ఎప్పుడైనా చెడితే, బీజేపీ సపోర్ట్ తీసుకుని రేవంత్ తోకజాడిస్తాడు, ఆదానీతో ముందుండి కొత్త పొలిటికల్ కథ నడిపిస్తాడు అనే దాకా ఊహాగానాలు వెళ్లిపోయాయి… అందుకే ఆదానీని ఎంకరేజ్ చేస్తున్నాడు అట..!!
మరి ఆదానీ అంత అక్రమార్కుడే అయితే పాత ఒప్పందాల్ని సమీక్షించవచ్చు కదా… రద్దు చేయవచ్చు కదానేది మరో ప్రశ్న… 1) ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ, చట్టబద్ధమైన అనేక పాత నిర్ణయాల్ని కొనసాగించాల్సిందే, శిరసావహించాల్సిందే… 2) పాత ఒప్పందాల్ని ప్రశ్నిస్తూ, సమీక్షిస్తూ, రద్దు చేస్తూ, రంధ్రాన్వేషన చేస్తూ పోతే స్టేట్ గుడ్ విల్ పోతుంది, కొత్త పెట్టుబడులు రావు, ఎవరూ నమ్మరు, అది మరింత నష్టం…
బీఆర్ఎస్ ఎలాగూ మాట్లాడదు… బీజేపీ అస్సలు మాట్లాడదు… ఒకవేళ ఏమైనా విమర్శలు వస్తే… ‘‘ఆదానీకి లొంగిపోవడం కాదు, అలాంటి వాళ్లతో ఎలా సక్రమ పెట్టుబడులు పెట్టించాలో మేం చూపిస్తాం’’ అని సమాధానం చెప్పుకోవడమే తప్ప కాంగ్రెస్‌కు కూడా వేరే దారి లేదు… అంతెందుకు..? రేప్పొద్దున రాహుల్ గాంధీ నిజంగానే ప్రధాని అయితే… ఇదే ఆదానీ ఆ ప్రభుత్వానికి కూడా దగ్గరవుతాడు… తనేమీ దేశబహిష్కరణకు గురికాడు… బికాజ్… తెలివైన బడా వ్యాపారి…!!
Share this Article