ఫేస్‌బుక్‌ను బ్యాన్ చేస్తారట కదా… ఇండియాలో ట్విట్టర్‌ను మూసేస్తారట కదా… సోషల్ మీడియా మీద నిషేధం విధిస్తారట కదా… రేపట్నుంచే అమలు చేసేస్తారట కదా… అందుకే నిన్న ఓ స్పెషల్ సెల్ ఢిల్లీలోని ట్విట్టర్ ఆఫీసుకు వెళ్లిందట కదా… సోదాలు చేసిందట కదా… సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలు ఖంగుతిని అమెరికా అధ్యక్షుడికి చెప్పాయట కదా… ఆయన అమెరికా భద్రత సలహాదారుడికి పురమాయిస్తే ఆయన ఇండియన్ జేమ్స్‌బాండ్ అజిత్ దోవల్‌కు ఫోన్ చేశాడట కదా… ఎలాగోలా కొన్నేళ్లు బ్యాన్ ఉంటే బాగుండు, సొసైటీలో చాలా సమస్యలకు అదే విరుగుడు…….. ఇలా రకరకాల కథనాలు, ఊహాగానాలు గట్రా సాగుతున్నయ్… అంతేకాదు, కాంగ్రెస్ టూల్‌కిట్ పేరిట బీజేపీ సోషల్ మీడియా వింగ్ ఓ సోషల్ దుష్ప్రచారం ప్రారంభిస్తే, ట్విట్టర్ ‘నమ్మదగని సమాచారం’ అని ట్యాగ్ చేయడం మొదలుపెట్టింది కాబట్టి, ఆ కక్షతోనే బీజేపీ ట్విట్టర్‌ను మూసేయడానికి ప్రయత్నిస్తోందనే విమర్శలు కూడా స్టార్టయ్యాయి… సోషల్ ప్లాట్‌ఫారాలను కంట్రోల్లోకి పెట్టుకోవడానికి ఇలా ఝలక్కులు ఇస్తోందని మరికొన్ని కథనాలు…. అసలు నిజమేమిటి..? నిజంగా ఇవి మూతపడతాయా..?
కాంగ్రెస్ టూల్‌కిట్ వివాదం కరెక్టే… బీజేపీ ముఖ్యుల ట్వీట్లకు ట్విట్టర్ ‘నమ్మదగని సమాచారం’ అని ట్యాగ్ పెట్టింది, అంతేతప్ప ఆ ఖాతాలను నిలిపివేయలేదు… ఆ ట్వీట్లను తొలగించలేదు… బీజేపీకి ఆ కోపం ఉంది కానీ, కొన్ని ట్వీట్లకు సంబంధించి వివాదం ఎప్పుడూ వస్తూనే ఉంటుంది, సమసిపోతూనే ఉంటుంది… ఏ సోషల్ మీడియా కూడా కావాలని ప్రభుత్వంతో వైరాన్ని పెంచుకోదు… ఇన్ని లక్షల ఖాతాలున్న ఇండియాలో బ్యాన్ ఎవరు కోరుకుంటారు..? టిక్‌టాక్ యాప్ నిషేధం కథ వేరు… అప్పట్లో చైనాతో దాదాపు యుద్ధం తరహా ఉద్రిక్తత… అందుకని ఆ ప్రముఖ చైనా యాప్‌ను నిషేధించింది, చైనాకు ఓ సంకేతం ఇవ్వడానికి..! కానీ ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాం, యూట్యూబ్‌లతో అదంత వీజీ కాదు… అవి చైనా ప్లాట్‌ఫారాలు అసలే కాదు…
Ads
మూడు నెలల క్రితం సోషల్ మీడియాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త గైడ్ లైన్స్ తీసుకొచ్చింది… నిజానికి అవి అవసరం కూడా… వాటి ప్రకారం… ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫారం విధిగా ఇండియాలో ఓ గ్రీవియెన్స్ ఆఫీసర్‌ను, ఓ చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్‌ను, ఓ నోడల్ కంటాక్ట్ పర్సన్‌ను నియమించాలి… కంటెంటుపై ఫిర్యాదులు, ఖాతా నిషేధం తదితర అంశాలపై జనానికి జవాబు చెప్పే యంత్రాంగం లేదు కాబట్టి ఈ నియామకాలు తప్పనిసరి అని ఆ మార్గదర్శకాలు చెబుతున్నాయి… అంతేకాదు, ఫిర్యాదులపై 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలి వంటి చాలా రూల్స్ పెట్టారు… ఈరోజు గడువు… కానీ ట్విట్టర్ తరహా ఇండియన్ సోషల్ ప్లాట్‌ఫారమ్ కూ తప్ప మరే ఇతర సోషల్ మీడియా సంస్థ కూడా వాటిని పాటించలేదు… వివరణ ఇవ్వలేదు, ఒకటీరెండు ఇంకో ఆరు నెలలు కావాలని అడిగాయి… డ్రాగాన్ చేయడానికి..! ఇండియన్ చట్టాలు తమను పీకేదేముందనే నిర్లక్ష్యం కూడా… ఒకరకమైన తేలికభావం… ఇదీ అసలు కథ… మరి మూసేస్తారా..? అంత వీజీ కాదు… ఏదో వాళ్లు అడుగుతారు, వీళ్లు గడువు పొడిగిస్తారు… సమాజంలో మానసిక కాలుష్యాన్ని వ్యాప్తి చేసే ప్రక్రియ అలా కొ-న-సా-గు-తూ-నే ఉంటుంది…
Share this Article