ఏది వార్త..? ఏది సరైన వార్త..? వార్త ఎలా ఉండాలి..? వార్త ప్రమాణాలు ఏమిటి..? ఈ ప్రశ్నలకు ప్రపంచంలో ఎవడూ సరిగ్గా జవాబులు, నిర్వచనాలు చెప్పలేడు… కీర్తనలే కథనాలుగా మారిన ఈరోజుల్లో మరీ కష్టం… ఒకప్పుడు పండితులు తమకు ఆశ్రయమిచ్చిన చక్రవర్తులు, రాజులను శ్లోకిస్తూ, భజిస్తూ, వాళ్లను విష్ణుస్వరూపులుగా చిత్రిస్తూ, రాజుల పట్ల ప్రజల్లో భయభక్తులు పెంచే రచనలు చేస్తూ, రాజుల కొలువులో ఇదే కొలువుగా చేస్తుండేవారు… ఇప్పుడూ అంతే… మనం అనుకుంటున్నాం, మారిపోయామని… నెవ్వర్… మరింత కూరుకుపోయాం…
జర్నలిజం అంటే ఏమిటి..? సమాచారం ఇవ్వడం మాత్రమేనా..? జనం చదవడానికి ఇష్టపడే ఏ సమాచారమైన ఇవ్వడమా..? సమాజానికి ఉపయోగపడే సమాచారం ఇవ్వడమా..? మళ్లీ ఇవి సంక్లిష్ట ప్రశ్నలు… మీడియా అనేది ఎప్పుడైతే ఓ దందా అయిపోయిందో ప్రయారిటీలు మారిపోయాయ్… ఇప్పుడీ చర్చ ఎందుకంటే..? ఓ వార్త చూస్తే నవ్వొచ్చింది, టైమ్స్‌లో వచ్చిన ఈ వార్త బహుశా చాలా చానెళ్లలో, పత్రికల్లో కూడా వచ్చి ఉండవచ్చు…
కత్రినా కైఫ్ పొట్ట ఎందుకు ఉబ్బి కనిపిస్తోంది..? శ్రద్ధాకపూర్ పెదవి మీద ఆ గాటేమిటి..? జాన్వీకపూర్ కిలో బరువు పెరిగినట్టుంది..? దీపిక పడుకోన్ జీరో సైజుకన్నా తగ్గిపోయి మైనస్ సైజుకు వచ్చినట్టుంది…? ఆలియా భట్ మరింత ఎండుకుపోయినట్టుంది కదా..,? ప్రియాంక ఆ డ్రెస్సుతో యువకుల్లో తుపాన్ సృష్టిస్తోంది కదా..? ఇవన్నీ వార్తలే… అంతేనా..? రాజకీయ నాయకుల భజనలైతే ఇక చెప్పనక్కర్లేదు… ఈ మీడియాకు తోడు సోషల్ మీడియా దరిద్రం ఉండనే ఉంది…
Ads
ముఖేష్ అంబానీ ఈ దేశాన్ని శాసిస్తున్న శక్తి… ఇప్పుడు ఆదానీ కూడా… అలాంటివాళ్లు బోలెడు మంది… వాళ్లూ సెలబ్రిటీలే… వాళ్ల కీర్తనలూ మీడియాకు కర్తవ్యమైపోతోంది… అది ఎంతగా అంటే… అంబానీ మనమడు స్కూల్లో చేరితే నంబర్ వన్ పత్రికలో మూడునాలుగు కాలాల వార్త కుమ్మిపారేశారు…
తల్లిదండ్రులు ఆకాశ్, శ్లోకలు చదివిన నర్సరీలోనూ చేర్చారట… ఆ ఇద్దరు తల్లిదండ్రులు తమ పిల్లాడు ఓ సగటు సామాన్య విద్యార్థిలాగే చదవాలని ఆశిస్తున్నారట… సాధ్యమేనా..? ముఖేష్ అంబానీ మనమడు ఇండియాలోనే ఓ సాధారణ విద్యార్థిగా చదవడమా..? హెంత మాఠ… హెంత మాఠ… ఆ పిల్లవాడు స్కూల్‌లో ఉన్నంతసేపు ఫుల్ భద్రత… అది ఏ రేంజ్ భద్రత అయి ఉంటుందో పాఠకులు ఇట్టే అర్థం చేసుకోవచ్చు… సెక్యూరిటీ సిబ్బంది సివిల్ దుస్తుల్లో బడి ఆవరణలో కాపలా కాస్తారు…
అంతేకాదు, 15 నెలల చిన్నపిల్లాడు కదా… ఒక డాక్టర్ కూడా ఆ పిల్లాడు బడిలో ఉన్నంతసేపూ అక్కడే ఉండాలి… ఒక కుబేరుడి మనమడి కోసం ఓ బడి చుట్టూ అసాధారణ భద్రత, వెంట ఓ డాక్టర్ అనేవి వార్తాంశాలే… అందులో సందేహం లేదు… కానీ ఆ పిల్లాడు ఎక్కడ చదువుతున్నాడో చెప్పి, తన భద్రతను మరింత ప్రమాదంలో పడేయడం ఓ నాన్సెన్స్… తన ఐడెంటిటీని, బడి వివరాల్ని పబ్లిష్ చేయడం కరెక్టు కాదు… అంతే, ఇక అనామకంగా చదివే ఓ సామాన్య విద్యార్థి ఎలా అవుతాడు..? ఓ చిన్న పిల్లాడి చుట్టూ ఏర్పడాల్సిన ఓ అమాయకపు సర్కిల్ ఇక సాధ్యం కాదు… నిజానికి 15 నెలలకే నర్సరీలో వేయడం అవసరమా అనేది అసలు వార్త…!!
అన్నింటికీ మించి ఇందులో ప్రజాప్రయోజనం ఏముంది..? ఆప్టరాల్ కాస్త పాఠకాసక్తి… అదీ చాలా సూక్ష్మశాతం పాఠకులకు మాత్రమే…!! ఆమధ్య ఓ మీడియా మొఘల్ మనమరాలి పెళ్లయింది… ఇంకేం తమ చానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం… గంటల తరబడీ… ఆ పెళ్లిని సీతారాముల కల్యాణంలా చూసి ప్రేక్షకజనం తరించిపోవాలా..? అనే సోయి వాళ్లకు లేదు… అడగడానికి ప్రేక్షకుడికీ స్కోప్ లేదు… అంబానీ మనమడి అక్షరాభ్యాసం వార్త చదువుతుంటే అదే గుర్తొచ్చింది…
Share this Article