Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వినరో భాగ్యము విష్ణు కథ… వాసవ సుహాస సినీగీతంపై ఉత్తమ సమీక్ష…

December 30, 2022 by M S R

వచ్చే ఫిబ్రవరిలో ఓ సినిమా విడుదల అవుతుందట… అల్లు అరవింద్ సమర్పణ… సినిమా పేరు ‘వినరో భాగ్యము విష్ణు కథ’… అందులో ఓ పాట… వాసవ సుహాస అని మొదలవుతుంది… పాడింది కారుణ్య… తనకు వొంకేమీ ఉండదు, ప్రతిభ ఉన్న గాయకుడు… ఈ పాటను చంద్రబోస్ మెచ్చుకుని, ఓ ట్వీట్ పెట్టాడు అనే వార్త పలు సైట్లలో కనిపించింది… తీరా చూస్తే ఆ ట్వీట్‌లో ఆశంసలు, సంస్కరం వంటి పదాలు కనిపించి జాలేసింది…

ఒరిజినల్ ట్వీట్ చూద్దామంటే, అదేమీ కనిపించలేదు… సరే… రాసింది ఎవరబ్బా అని చూస్తే ‘త్రిపురనేని కల్యాణ్ చక్రవర్తి’ అని కనిపించింది… ఇంకాస్త తవ్వుతూ పోతే అసలు అది తెలుగు పాటేనా అనిపించింది… మరోవైపు దీన్ని సంస్కృత గీతంగా చెబుతున్నారు… గందరగోళం… నిజానికి ఆ పాట కంటెంటే గందరగోళం… ఆ పాట ఇలా ఉంటుంది…


‘‘వాసవ సుహాస గమనసుధా

Ads

ద్వారవతీ కిరణార్భటీ వసుధా..

అశోక విహితాం కృపానాన్రుతాం కోమలామ్

మనోజ్ఞితం మమేకవాకం..

మయూఖయుగళ మధుసూధనా మదనా

మహిమగిరి వాహఘనా నాం

రాగరధసారధి హే రమణా

శుభచలన సం ప్రోక్షణా..

యోగ నిగమ నిగమార్చనా వశనా

అభయప్రద రూపగుణా నాం

లక్ష్యవిధి విదాన హేసదనా

నిఖిలజన సా లోచనా


యుగ యుగాలుగా ప్రభోదమై

పది విధాలుగా పదే పదే..

పలికేటి సాయమీమన్న

జాడలే కదా.. నువ్వెదికినఏదైనా

చిరుమోవికి జరిగినా చిరునవ్వుల ప్రాసనా

చిగురేయక ఆగునా నువ్వెళ్లేదారినా

నినునిన్నుగ మార్చినా.. నీనిన్నటి అంచునా


vasava suhasa

వెబ్ సముద్రంలో వెతుకుతూ వెతుకుతూ పోతే… అవధాని Naga Gurunatha Sarma…. రాసిన ఓ విశ్లేషణ కనిపించింది… బాగుంది… అదేమిటో మీరూ చదవండి… ఎందుకంటే… ఏదో ఒకటి రాసేయడం, ఆహా ఓహో అని మిగతావాళ్లు చప్పట్లు కొట్టేయడం… కనీస సమీక్ష కరవైంది ఈమధ్య… అసలు గీకి చూస్తేనే కదా అది కాకిబంగారమో, అసలు బంగారమో తెలిసేది… నాగ గురునాథ శర్మ స్వతహాగా ఇండస్ట్రీలో ఇదే ఫీల్డ్‌లో ఉంటూనే ఒక పాటను సరిగ్గా విశ్లేషించడం విశేషమే…


‘‘నేను సాధారణంగా సినిమా పాటలపై ఎక్కువ కామెంట్ చేయను. దానికి ముఖ్యకారణం నేనూ కవిని కాబట్టి.. వాళ్ళు పడే శ్రమ నాకూ తెలుసు కాబట్టి. ఎక్కువభాగం రచయితలకన్నా ప్రక్కవాళ్ళ బలవంతాలతో పాటలు పేలవంగా వస్తూ ఉంటాయని వదిలేస్తాను. ఈ క్రింది పాటకు సంబంధించి మాత్రం స్పందించడం నా బాధ్యత అనిపించింది.

ఇక విషయానికి వస్తే.. ఇటీవల కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి చేతుల మీదుగా అట్టహాసంగా విడుదలయింది ఈ పాట. పైగా సంస్కృతగీతంగా ప్రచారం చేసుకోవడం ఇంకా విచిత్రం. ఒక్కొక్క వాక్యం చదువుతూ వెళితే.. సమాసాలు, విభక్తులు ఏమీ పట్టవన్నట్లు తోచిన రీతిలో వ్రాసుకుంటూ వెళ్ళినట్లుంది. ఇది వేంకటేశ్వరస్వామి గురించి పాటలాగా.. అది హీరోకు అన్వయించుకునే సందర్భమేమో మరి…
vasava suhasa
సుధా అని సంబోధించారు కదా, అమృతం గురించి ఉందేమో అని చూస్తే ఆ భావమే ఉండదు. వసుధా అన్నాడు కదా అనుకుంటే భూమి ప్రసక్తే లేదు. తిరుమల స్వామిని చెప్తూ ద్వారవతి (ద్వారక) ఎందుకొచ్చిందో ఆ రచయితే చెప్పాలి. మమేకవాకం అని కేక్ ‍వాక్ లాగా ఆ ప్రయోగమేమిటో అర్థం కాలేదు. మధుసూదనుడు మదనుడు ఎందుకవుతాడు? వశనా అంటే కూడా అర్థం వాళ్ళే చెప్పాలి. సంప్రోక్షణ అంటే శుద్ధిచేయడం.. ఆయనే సంప్రోక్షణ అని సంబోధించడం వింత అయితే.. అన్నిటికన్నా నాకు ఆశ్చర్యమనిపించింది ఈ పాట విడుదల చేస్తూ కె.విశ్వనాథ్ గారు మాట్లాడిన మాట. మళ్ళీ నాకు పాతరోజులు గుర్తొచ్చాయనడం ఆయన సంస్కారమో.. అప్పుడే బాగుండేవన్న దెప్పిపొడుపో?


నా బాధేమిటంటే.. వాళ్ళ ప్రయత్నాన్ని తక్కువ చేయను. ఏదో భిన్నంగా వాళ్ళ అభిరుచిని చూపించాలనుకున్నారు. కానీ, ఒక సంస్కృతగీతంగా ఒక పాటను ప్రచారం చేయదలచుకున్నవారు సంపూర్ణంగా పాటను ఒక సంస్కృత పండితుని వద్ద సరిచేయించుకునే ఆలోచనే రాలేదా? ఏది వ్రాస్తే అదే సంస్కృతం అనుకుని, రికార్డ్ చేసేసి, విడుదల చేస్తే తెలియనివాళ్ళు విని మెచ్చుకోవచ్చు.. తెలిసినవాళ్ళు కచ్చితంగా విమర్శిస్తారు, విమర్శించాలి. ఇది ఎవ్వరి మీదనో వ్యక్తిగత విభేదం కాజాలదు. భాషను, సాహిత్యాన్ని మరింత పరిపుష్టం చేసే దారిలో ప్రయత్నం చేయాలి. అసలే తెలుగు సినిమా పాట స్థాయి తగ్గిపోయిన రోజులు.. అడపా దడపా కొన్ని మంచి పాటలు తప్ప.


ఎన్నో యేళ్ళుగా కావ్యస్థాయికి సమానంగా కొనసాగిన తెలుగుపాటను వర్తమానంలో కూడా సుసంపన్నమైన సాహితీ ప్రక్రియగా ప్రజలకు చేరువ చేయాల్సిన బాధ్యత ప్రతీ సినీరచయితపై ఉంది. ఇంకా మాట్లాడితే ప్రతీ నిర్మాత, దర్శకుడిపై ఉంది. కేవలం కమర్షియల్ మోజులో పడి గుడ్డిగా వెళితే తెలుగు సినిమా పాటను మర్చిపోయే రోజు దూరంలో లేదు. మిలియన్ వ్యూస్ కాదు.. హృదయాంతరాలలో నిలిచిపోయే పాట మాత్రమే కవిత్వమై, కథాసారమై, కావ్యమై వర్ధిల్లుతుంది. ఆ స్థాయిలో మళ్ళీ తెలుగు సినిమా పాటను చూడాలని కోరుకుంటున్నాను…



Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నో నో… కల్వకుంట్ల శైలిమ రాజకీయాల్లోకి అస్సలు రాకపోవచ్చు..!!
  • అమెరికా మీద చైనా అగ్రిటెర్రర్ కుట్ర… ఆ ఫంగస్ దానికోసమేనా..?
  • అప్పు పుట్టని దురవస్థ నుంచి…. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దాకా…
  • జుట్టు సెట్ చేయాలంటే కనీసం లక్ష… ఇదొక సక్సెస్ స్టోరీ…
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, ఫోటోగ్రఫీ, దర్శకత్వం, నటన…
  • రాజకీయ నాయకులతో కృష్ణ కబడ్డీ… తరువాత తనే పాలిటిక్స్‌లోకి…
  • అచ్చు శ్యాంసింగరాయ్‌ కథలాగే… ఆ సినిమాల్లో ప్రస్తావించిన స్టోరీయే..!!
  • మెగాస్టార్‌ కనిపిస్తే చాలు, ఈ కెమెరా రెచ్చిపోయేది… ఓ విశేషబంధం..!
  • జైనబ్… అఖిల్‌కన్నా 9 ఏళ్లు పెద్ద… ఐతే ఏంటట..? ఆమెకు తెలియదా..?!
  • పేరుకు గోల్డ్ ఫ్లేక్ కింగ్ … గణేష్ బీడీ పొగ… శ్రీశ్రీశ్రీ రాజావారి లంకచుట్ట పొగ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions