Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అవసరానికి మరఠ్వాడా మీడియా… ‘అవసరం లేని’ హైదరాబాద్ మీడియా…

April 26, 2023 by M S R

మహారాష్ట్రలో 3 సభలకు బీఆర్‌ఎస్‌ 10 కోట్ల ప్రచార వ్యయం

ప్రధాన పత్రికల్లో కవరేజీ ఖర్చే రూ.5 కోట్లు

హాజరయ్యే జర్నలిస్టులకు రాచమర్యాదలు

Ads

మండల స్థాయి పాత్రికేయులకు మర్యాదలు

చేయడానికే రూ.5 లక్షల కేటాయింపు

మహారాష్ట్రలో బహిరంగ సభ పెట్టిన రోజు

ఢిల్లీ, పంజాబ్‌ పత్రికల్లోనూ భారీగా యాడ్స్‌

మరఠ్వాడాలో హాట్‌టాపిక్‌గా గులాబీసభలు

……… ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీ బ్యానర్ స్టోరీ… పైన ఉన్న డెక్స్ చదివితేనే అర్థమైపోయిందిగా స్టోరీ సారాంశం ఏమిటో… మరఠ్వాడా ఏరియాలో సభల నిర్వహణకు బీఆర్ఎస్ పలు అంశాల్లో విపరీతంగా ఖర్చు చేస్తోంది… వాటిల్లో ఒకటి ప్రచార వ్యయం… మీడియాను మేనేజ్ చేయడానికి కోట్లకుకోట్లు వెదజల్లుతోంది… యాడ్స్, జర్నలిస్టులకు నజరానాలతో మీడియాకు రాచమర్యాదలు చేస్తోంది… మండల స్థాయి రిపోర్టర్లకూ ఆకర్షణీయ చెల్లింపులు… గతంలో వందల కోట్ల యాడ్స్‌ను దేశంలోని అనేక భాషల పత్రికలకు ఇచ్చిన చరిత్ర ఉంది కాబట్టి ఈ వార్త కూడా నిజమే అని భావిద్దాం కాసేపు…

కానీ ఎందుకింత వ్యయం..? ఎందుకంటే… తెలంగాణ దాటి ఇతర ప్రాంతాలకు కొద్దిగానైనా పార్టీ విస్తరించాలి… బీఆర్ఎస్ అని పేరు మార్చుకుని, జాతీయ పార్టీ అని ప్రకటించుకుంది కదా… కేసీయార్ ప్రధాని కావాలనేది ఈ అడుగుల అంతిమ లక్ష్యం… కానీ ఆ పార్టీ ఎదుగుదల ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది… వాళ్ల ఏరియా పార్టీలను కాదని బీఆర్ఎస్‌ను ఆదరించడానికి, కేసీయార్ పార్టీలో ఉన్న యూనిక్ కేరక్టర్ ఏమిటి..? ఏమీ లేదు… అదే ప్రధాన కారణం…

సో, పాత హైదరాబాద్ స్టేట్‌లోని ప్రాంతాలపై కన్నేశాడు కేసీయార్… మరఠ్వాడా కూడా పాత హైదరాబాద్ స్టేట్‌లో భాగమే… తెలంగాణ పరిస్థితులే ఉంటాయి అక్కడ కూడా… నెగెటివిటీ ఛాయలు మీదపడకుండా, ఎంతో కొంత పాజిటివ్ ప్రచారం రావడానికి లోకల్ పత్రికలను, మీడియాను మేనేజ్ చేయడం పార్టీ ఎత్తుగడల్లో ఒకటి… అందుకే ఆయా ప్రాంతాల్లో రిపోర్టింగ్ కూడా ‘‘సినిమా వార్తల ‘కవరే’జీ’’గా మార్చేశారు… సరే, ఈ ప్రచార తాపత్రయం ఎలా ఉన్నా… మీడియా అంటే ఇంత ప్రేమ ఒలకబోయడంలో నిజాయితీ ఉందా..?

మీడియా జర్నలిస్టులంటే కేసీయార్‌కు, బీఆర్ఎస్ పార్టీకి నిజంగానే ప్రేమ ఉందా..? లేదు..! ఉంటే, సుప్రీంకోర్టు సానుకూల తీర్పు ఇచ్చి నెలలు గడుస్తున్నా సరే జర్నలిస్టుల ఇళ్ల స్థలాలను ఎందుకు తొక్కిపెడుతున్నట్టు..? కనీసం కృతజ్ఞతలు చెప్పుకోవడానికి కూడా రెండు నిమిషాల టైమ్ ఇవ్వడం లేదు కేసీయార్… హైదరాబాద్ జర్నలిస్టులు అంత ‘‘కానివారు’’ ఎందుకయ్యారు…? అవసరమున్నప్పుడు ఔరంగాబాద్ జర్నలిస్టులను మేనేజ్ చేసినట్టుగా ‘యూజ్ అండ్ థ్రో’ వాడకమే పాలసీయా..?

హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్లస్థలాలపై కేసీయార్ ధోరణికి ప్రధాన కారణాలుగా చెప్పబడుతున్నవి… 1) సదరు సొసైటీలో ఎక్కువ మంది ఆంధ్రా జర్నలిస్టులే… 2) మరి మా మాటేమిటని ఆ సొసైటీ సభ్యత్వం లేని జర్నలిస్టులు అడుగుతారు… 3) ఇళ్ల స్థలాలు ఇస్తే వైఎస్‌కు ఆ క్రెడిట్ పోతుంది…  నిజానికి ఈ మూడూ నిర్హేతుకమైనవే… సొసైటీలో ఎక్కువగా ఆంధ్రా జర్నలిస్టులే ఉంటే దాన్ని ఎందుకు వ్యతిరేకించాలి..? అది ఉమ్మడి ఏపీ ఉన్నప్పటి, 14 ఏళ్ల క్రితం నాటి సొసైటీ…

  • వైఎస్‌కు క్రెడిట్ వెళ్తుందనేది పొల్లు మాట… ఐనా వెళ్తే తప్పేమిటి..? నష్టమేమిటి..? ఆయన ఎలాగూ బతికిలేడు… ఆయన వారసుడికి తెలంగాణ మీద ఆశల్లేవు… ఐనా ఇప్పుడు ఇళ్లస్థలాల్ని క్లియర్ చేసే పాలకుడికి క్రెడిట్ వస్తుంది తప్ప వైఎస్‌కు ఎందుకొస్తుంది..? వచ్చిందే అనుకుందాం… ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్ వంటి వైఎస్ పథకాల్ని కొనసాగించడం లేదా..? ఎవరో దివంగత నేతకు పేరొస్తుందనే భావనతో ఇళ్లస్థలాల్ని వ్యతిరేకిస్తే అది రాజనీతజ్ఞత కాదు…
  • ఈ ఇళ్ల స్థలాల్ని ఇగ్నోర్ చేస్తే… నాటి వైఎస్సే నయం అనే భావన, క్రెడిట్ ఇంకా పెరుగుతుంది కదా… ఈ మాత్రం లాజిక్ కేసీయార్ ఎందుకు ఆలోచించలేకపోతున్నట్టు..?
  • ఈ సొసైటీలో సభ్యత్వం లేనివాళ్లకు వేరే సొసైటీలు ఏర్పాటు చేసి, వాళ్లకు కూడా ఇళ్లస్థలాలు ఇస్తే ఎవరు వ్యతిరేకిస్తారు..? కేసీయార్‌ను ఏళ్లతరబడీ యాది చేసుకుంటారు కదా… మరి ఆ ప్రయత్నం ఎందుకు జరగడం లేదు..? అంటే ఎవరికీ ఏమీ ఇచ్చే భావన లేదన్నమాటే కదా…
  • సొసైటీలో ఆంధ్రా జర్నలిస్టులు నిజంగానే ఎక్కువ అనుకుందాం… మరి బీఆర్ఎస్ ఏకంగా ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పార్టీ నేతలు మాట్లాడుతున్నారు కదా, అలాంటప్పుడు ఆంధ్రా జర్నలిస్టులు అవసరం లేదా..? మరీ ఔరంగాబాద్ జర్నలిస్టులకన్నా తీసిపోయారా..?
  • మీడియా సంస్థలే లోబడి నడుచుకుంటున్నప్పుడు జర్నలిస్టులతో అవసరం ఏమిటనే ధోరణా ఇది..? సుప్రీంకోర్టులో జర్నలిస్టులకు పాజిటివ్‌గా అఫిడవిట్ ఇచ్చింది కేసీయారే కదా… మరి ఆ పాజిటివిటీ ఇప్పుడు ఎందుకు దూరమైంది..? ఇదేం ద్వంద్వ వైఖరి..?
  • ఈ సొసైటీలో ఉన్నవాళ్లలో చాలామంది రిటైరైపోయారు, ఇక వీళ్లతో అవసరం ఏమిటి, ఇప్పుడు యాక్టివ్‌గా ఉన్న జర్నలిస్టులను అవసరానికి మేనేజ్ చేసుకుంటే సరి అనే ‘‘ఔరంగాబాద్ పాలసీ’’యా ఇది..?
  • ‘జర్నలిస్టు సంక్షేమ ప్రభుత్వం’ అంటే ఇదేనా సార్..?! పోనీ, ఈ సొసైటీలో ఉన్న తెలంగాణ జర్నలిస్టులనైనా ఏం చేద్దామో చెప్పండి…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియా భాయ్… హేట్సాఫ్ సిరాజ్… నువ్వూ ట్రూ హైదరాబాదీ…
  • కర్త, కర్మ, క్రియ కేసీయారే..! ఖ్యాతి మసకబారి, తొలి అధికారిక మరక..!!
  • వంగా సందీప్‌రెడ్డి మార్క్ రోల్… నో, నెవ్వర్, సాయిపల్లవికి అస్సలు నప్పదు…
  • నౌషాద్ ఆఫ్ సౌత్ ఇండియా… ఘంటసాలకూ ఆరాధ్యుడు ఈ సుబ్బరామన్…
  • ఆదాయమే పరమార్థమై… ఆ ‘దేవాదాయ ధర్మాదాయ’ నామకరణాలు…
  • ముసి ముసి నవ్వుల మాటున విషం మరుగుతున్నది… వందేమాతరం..,
  • జేజమ్మ..! బిరబిరా సాగే నదీప్రవాహం… ప్రేమలో అందరినీ తడిపేస్తూ…!!
  • కడుపు చించుకోవద్దు… రేవంత్‌రెడ్డి మాటల్లో తప్పేముంది..?!
  • ఊరికే రావు జాతీయ అవార్డులు… ఎక్కడైనా సరే లెక్కలుంటాయండీ…
  • 5600 కోట్ల విలాసం అది… అడుగే పెట్టలేదు, అమ్మేస్తున్నాడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions